
సీతమ్మకు కోవా సారె సిద్ధం
పి.గన్నవరం: స్థానిక శ్రీపట్టాభి రామస్వామి వారి ఆలయంలో ఆదివారం జరుగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు కోవా స్వీట్లతో తయారు చేయిస్తున్న కంత (సారె) భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శ్రీరాముని తరఫున సీతమ్మవారికి ఈ కంతను సమర్పిస్తారు. వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, కూరగాయలు, పంచె, చీర, పర్ణశాల వంటి ఆకృతుల్లో కోవాతో తయారు చేస్తున్న స్వీట్లు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. గత 16 ఏళ్ల నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఏటా కోవాతో పాటు పలు రకాల పిండి వంటలను తయారు చేయించి సీతమ్మవారికి సమర్పిస్తున్నట్టు సత్యవాణి తెలిపారు. స్థానిక అక్విడెక్టు వద్ద వేంచేసిన శ్రీపట్టాభిరామ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. దీనికి 20 రోజుల ముందు నుంచి 100 రకాలకు పైగా కోవాతో స్వీట్లు, పిండి వంటలు తయారు చేయిస్తారు. స్వీట్లు, పిండి వంటల తయారీలో స్థానిక శ్రీరామ్ గార్డెన్స్‌కు చెందిన మహిళా భక్తులు సహకారం అందిస్తున్నారు.

సీతమ్మకు కోవా సారె సిద్ధం