
రాములోరి పెళ్లి సందడి
● కోదండరాముని కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
● ఆంధ్రా భద్రాద్రి జి.మామిడాడలో రేపు నిర్వహణ
పెదపూడి: కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండరాముడి కల్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడిగా భక్తులు ఆయనను కొలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని భద్రాది రాముడి ఆలయానికి దీటుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయంలో తూర్పు, పశ్చిమ దిశల్లో నిర్మించిన గోపురాలు అత్యంత ఎత్తుగా ఉంటాయి.
వాటిపై శిల్పాలను భాగవత, రామాయణాల్లోని అపురూప ఘట్టాలతో మనోహరంగా తీర్చిదిద్దారు. అవి భక్తులను ఆకట్టుకుంటాయి. గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామాలయం కల్యాణకాంతులను సంతరించుకుంది. ఆదివారం జరిగే సీతారాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మంచి ముత్యాలను తలంబ్రాలుగా వాడటం విశేషం.
కల్యాణ కొబ్బరి బొండాలు, రామనామ తలంబ్రాలు సిద్ధం
జి.మామిడాడ గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి అనే సూక్ష్మ కళాకారుడు కోదండ రామాలయంలో ఆదివారం జరిగే సీతారాముల కల్యాణానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి బొండాలు, బియ్యపు గింజలపై మూడు భాషల్లో రాసిన రామనామ తలంబ్రాలు సిద్ధం చేశారు.
ఆయన మాట్లాడుతూ కల్యాణ కొబ్బరి బొండాలపై శంఖు, చక్ర, నామాలతో కోదండరాముని సీతా, లక్ష్మణ, ఆంజనేయ సహితంగా బొండాలపై రంగురంగుల పొడులు, ముత్యాలు, లేసులు సహాయంతో సుందరంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. బియ్యపు గింజలపై ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పార్కర్ పెన్ను సహాయంతో నిష్టగా 1,00,116 గింజలపై తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో రాసి సమర్పిస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లుగా బియ్యపు గింజలపై ఈ మూడు భాషల్లో రాస్తున్నానన్నారు. ఈ తలంబ్రాలను స్వామి వారి కల్యాణ క్రతువులో సమర్పించనున్నట్లు తెలిపారు. ముక్కోటి ఏకాదశికి ప్రారంభమైన ఈ కార్యక్రమం శ్రీరామనవమి రోజుతో పూర్తవుతుందన్నారు.
కల్యాణోత్సవ కార్యక్రమాలు వివరాలు
6వ తేదీ మధ్యాహ్నం అభిజిత్ లఘ్నంలో స్వామివారి కల్యాణం
7వ తేదీ సుప్రభాత సేవ, నిత్యోపాసన, డోలు సన్నాయి. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు
8వ తేదీ సుప్రభాత సేవ, నిత్యోపాసన, సహస్రనామార్చన, మధ్యాహ్నం 3.30 గంటలకు సదస్యం
9వ తేదీ ఉదయం శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవం
10వ తేదీ ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, కంకణ విసర్జనం, పూర్ణాహూతి, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు
11 వ తేది అద్దాల శయన మందిరంలో రాత్రికి ఊయల సేవ, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలతో కల్యాణోత్సవాలు ముగిస్తాయి.

రాములోరి పెళ్లి సందడి

రాములోరి పెళ్లి సందడి

రాములోరి పెళ్లి సందడి

రాములోరి పెళ్లి సందడి

రాములోరి పెళ్లి సందడి