
రారండోయ్ రాములోరి కల్యాణానికి..
● సత్యదేవుడు అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా
● వధూవరులైన సీతారాములు
● పసుపు దంచిన ముత్తైదువలు
● రత్నగిరి క్షేత్ర పాలకుడు
సీతారాముని కల్యాణం నేడు
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడైన శ్రీరాముని ఆలయంలో నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చైత్ర శుద్ధ అష్టమి శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా రాగా సాయంత్రం నాలుగు గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వధూవరులుగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.
అనంతరం ముత్తైదువులతో పాటు ఈఓ సుబ్బారావు కొంతసేపు పసుపు దంచారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
నేడు సీతారాముల కల్యాణం
సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉదయం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం ఏడు గంటలకు సీతారాములను వెండి హనుమద్వాహనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకీ మీద గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం రత్నగిరి రామాలయం వద్ద వార్షిక కల్యాణవేదికపై ఉదయం పది నుంచి ఒంటి గంట వరకూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో మాంగల్యధారణ జరుగుతుంది. అనంతరం భక్తులకు ప్రసాదం, వడపప్పు పానకం పంపిణీ చేస్తారు.
తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు
రోజుకొక వేడుకతో శ్రీరామ నవమిని తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి ఏడు గంటలకు రామాలయంలో జరిగే శ్రీసీతారాముల శ్రీపుష్పయోతోత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయి.

రారండోయ్ రాములోరి కల్యాణానికి..