
జగన్మోహనం.. శివకేశవ క్షేత్రం
● భక్తులను ఆకట్టుకునే ద్విముఖ రూపాలు
● కోరిన కోర్కెలు నెరవేర్చే దివ్య స్వరూపం
● ప్రపంచ ప్రసిద్ధి చెందిన ర్యాలి క్షేత్రం
● నేటి నుంచి కళ్యాణమహోత్సవాలు
కొత్తపేట: ముందు పురుషరూపం, వెనక సీ్త్ర రూపంతో ఏకశిలలో జగన్మోహినీ, విష్ణువు సాక్షాత్కరించే అద్భుత క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే క్షేత్రం ర్యాలి. ఈ క్షేత్రంలో ఈ నెల 6 నుంచి 13 వరకూ స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం ఆరో స్థానాన్ని దక్కించుకని ఖ్యాతికెక్కింది. ఈ క్షేత్రంలో ముందు భాగం కేశవుని రూపం, వెనుక జగన్మోహినీగ స్వయంభూగా అవతరించారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఏకశిలా విగ్రహం ఉన్న ఈ ఆలయంలో అణువణువునా ఉన్న అద్భుతాలు భక్తి భావాలను పెంపొందిస్తాయి. ఈ ఆలయంలో భక్తులందకీ గర్భాలయ ప్రవేశం ఉండటం విశేషం. అంతే కాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం ఒక విశేషం. కాగా శివాలయంలో నీరు ఇంకి పోవడం, శ్రీజగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదముల నుంచి నిరంతరం నీరు (గంగ) ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెప్తోంది.
ఆలయ విశిష్ట చరిత్ర
ఈ ఆలయ ప్రత్యేకతలకు తగినట్లే ఆ దైవం వెలిసిన విధానం కూడ ఒక చరిత్ర సంతరించుకుంది. ఈ ఆలయంలో దైవం, రాక్షస సంహారంలో భాగంగా ఏర్పడిన ఒక అవతారమని చారిత్రక కథనం. ఇటు గౌతమి అటు వశిష్ట నదీ పాయల మధ్య ఆవిర్భవించిన ఈ ఆలయ స్థాపనకు, ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు రావడానికి కూడా ఒక కథ ఉన్నట్టు పండితులు వెల్లడిస్తున్నారు. విక్రమదేవుడు అనే భక్తుడు ఒకప్పుడు అడవిలా ఉన్న ప్రాంతంలో వేట సాగిస్తూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతనికి కలలో కనబడిన మహావిష్ణువు స్వయంభూ శిల రూపంలో నేను ఈప్రాంతంలో ఉన్నానని నీవు కర్రతో రథం చేయించి లాగుకొని వెళ్ళితే ఆ రథం శీల రాలి పోతుందని అక్కడ తవ్వితే విగ్రహం బయట పడుతుందిని చెప్పి అదృశ్యమయ్యాడని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ ప్రకారం విక్రమ దేవుడి ద్వారా ఈ విగ్రహం బయటపడిందని చరిత్ర చెబుతోంది. రథం శీల రాలడం వలన ఈ దైవం వెలసిన ప్రాంతానికి శ్రీర్యాలిశ్రీ అని పేరు వచ్చిందని నానుడి.
పాప సంహారం కోసం వెలసిన దైవం
అమృతం కోసం తగవులాడుకుంటున్న దేవదానవులను శాంతిపజేసి దానవులకు అమృతం అందకుండా చేసేందుకు మహా విష్ణువు జగన్మోహినీగా ఈ లోకంలో అవతరించిన విషయం తెలిసిందే. ఆ ఘట్టం ముగిసిన తరువాత అత్యంత సుందరంగా ఉన్న జగన్మోహినిని మోహించిన శంకరుడు ఆమెను వెంటాడటంతో సీ్త్ర రూపంలో ఉన్న విష్ణుమూర్తి ర్యాలి గ్రామం వరకూ వచ్చి ఇక్కడ అంతర్థానమైనట్టు ఆలయ చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ మోహించుకోవడాన్ని సర్వజనానికి తెలిసేటట్టు చేయడం కోసం సీ్త్ర పురుష రూపాల్లో ఏక శిలలో లోకనాఽథులు ఇద్దరూ ఇక్కడ స్వయంభూలుగా వెలిశారని భక్తులు విశ్వాసం
అడుగడుగునా అద్భుతాలే
లోకనాథులు వెలసిన ఈ గ్రామంలో జగన్మోహిహినీ కేశవస్వామి ఆలయంలో అణువణువునా అద్భుతాలే కనిపిస్తాయి. అత్యంత ఎత్తయినా పురాతన నిలువు గోపురం అందరినీ ఆకర్షించే గర్భగుడితో పాటు శ్రీదేవి, భూదేవి విగ్రాహాలు సైతం ఎంతగానో అకర్షిస్తాయి. ఇవి అన్ని ఒక ఎత్తయితే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వింత. ఈ ఆలయ ప్రధాన విగ్రహమే ఐదు అడుగుల ఎత్తున ఉన్న సాలగ్రామ ఏక శిలలో సీ్త్ర పురుష రూపాల్లో శివ కేశవులు సాక్షాత్కరించడం భక్తి పారవశ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ఒక్క శిలలోనే రెండు విధాలైన ఆలయాలు, పొన్న చెట్టు, దక్షిణ భాగంలో గోవర్ధన పర్వతం, మకర తోరణం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సాలగ్రామ ఏక శిలా విగ్రహంలోనే దశావతారాలు కన్పించడం మరో అద్భుత విశేషం. కంఠంలోని హారాలు, కర కంకణాలు, శంకు చక్రాలు జీవం ఉట్టి పడేలా ఆ శివకేశవులే మన ముందు ప్రత్యక్ష మయ్యినట్టుగా చూసేవారికి అనుభూతి కలుగుతుంది. సాలాగ్రామ విగ్రహం పాదాల వద్ద గంగా జలం నిత్యం ఉబుకుతూనే ఉండడం ఇక్కడ మరో విశిష్టత. పాదాల వద్ద వున్న గంగాదేవి విగ్రహం నుంచి ఈ జలం ప్రవహిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతుందని భక్తుల విశ్వాసం. విగ్రహం వెనుక వైపు వున్న జగన్మోహినీ రూపం మరింత సమ్మోహనం. సీ్త్ర రూపంలో వున్న మహాశిష్ణువు అత్యంత సౌందర్యంగా కనిపిస్తారు. శిరమున సిగచుట్టూ అప్పుడే సంపెంగ నూనె రాసుకొన్నట్లున్న శిరోజాలు సహజమైన చీర కట్టు, తలలో ముచ్చటగొలిపే చామంతి పువ్వు విశేషంగా కనిపిస్తాయి. అంతేకాక పద్మినీ జాతి సీ్త్రలకు శుభసూచకంగా ఉండేలా పుట్టుమచ్చలు సైతం ఈ విగ్రహంలో సాక్షాత్కరించడం భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వుంటుంది. రావులపాలెం బస్ కాంప్లెక్సు నుంచి రెండు గంటలకు ఒకసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు.
కల్యాణ మహోత్సవాలు ఇలా..
ఆదివారం గరుడ వాహన సేవ, గ్రామోత్సవం, రాత్రి 8–45 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం, 7, 8, 9 తేదీల్లో స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, పదో తేదీన సదస్యం, 12న చక్రస్నానం, 13న శ్రీపుష్పోత్పవంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయని దేవస్థానం ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు.

జగన్మోహనం.. శివకేశవ క్షేత్రం