
ముగిసిన రెజ్లింగ్ పోటీలు
రాజానగరం: దివాన్ చెరువులోని ఎస్‌వీపీవీ కన్వెన్షన్ హాలులో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–15 విభాగంలో విజయవాడ, అండర్–20 విభాగంలో కాకినాడ ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ రన్నర్స్‌గా కాకినాడ, విశాఖపట్నం నిలిచాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 400 మంది వరకూ రెజ్లర్లు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. విజేతలు ఈ నెల 23న రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకాన్ చార్టర్ అధ్యక్షుడు టి.రాజా, రాజమహేంద్రవరం అధ్యక్షుడు ఇమ్మని వెంకట్, కార్యదర్శి సురేష్ ఉదయ్‌గిరి, ప్రోగ్రాం చైర్మన్ కామేశ్వరీదేవి, స్పోర్ట్స్ చైర్మన్ మద్దూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెల 7 నుంచి
సత్యదేవుని కల్యాణోత్సవాలు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల నిర్వహణ దిశగా అన్నవరం దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీరామ నవమి పర్వదినమైన ఆదివారం సత్యదేవుని కల్యాణోత్సవాల వాల్ పోస్టర్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఆవిష్కరించారు. మే 7వ తేదీ (వైశాఖ శుద్ధ దశమి) నుంచి మే 13వ తేదీ (వైశాఖ బహుళ పాడ్యమి) వరకూ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మే 8వ తేదీ (వైశాఖ శుద్ధ ఏకాదశి) రాత్రి 9 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దివ్య కల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వేద పండితుడు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, ఏఈఓలు కొండలరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో వినియోగించేందుకు గాను విశాఖ జిల్లా గాజువాకకు చెందిన గుంటపల్లి ప్రసాద్ అరకిలో ముత్యాలను ఈఓ సుబ్బారావుకు అందజేశారు.

ముగిసిన రెజ్లింగ్ పోటీలు