
కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు వ్యాన్
పిఠాపురం: పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతున్న స్కూలు వ్యాన్ ప్రమాదానికి గురై పంట కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు విద్యార్థులు, డ్రైవరుకు గాయాలయిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోలుకు చెందిన ఒక ప్రైయివేటు స్కూలు వ్యాన్ సోమవారం ఉదయం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో విద్యార్థులను ఎక్కించుకుని గొల్లప్రోలు బయలుదేరింది. గ్రామ శివారుకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోవడంతో స్కూలు వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో వ్యాన్ పంట కాలువలో తిరగబడడంతో వ్యాన్‌లో ఉన్న జి.హర్షిత, జి.అపర్ణ, జి.సిద్ధు, జి.ధరణి, కె.భార్గవ్, కె.హాసిని, నిహారిక, వ్యాన్ డ్రైవరు వెంకటేష్‌కు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన పక్కనే పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు వ్యాన్‌లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. వారిని పిఠాపురంలో ఒక ప్రైయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. వ్యాన్ డ్రైవరుకు కాలు విరగగా మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రామకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణంగా చెబుతున్న లారీ ఆపకుండా వెళ్లి పోయినట్లు చెబుతున్నారు. గొల్లప్రోలు పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగే సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వేగంగా కాలువలోకి దూసుకెళ్లకుండా డ్రైవరు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు విద్యార్థులు చెబుతున్నారు. కాలువలో నీరు సైతం తక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ప్రాణాలతో బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు.
ఢీకొట్టి వెళ్లిపోయిన లారీ
ఏడుగురు విద్యార్థులు, డ్రైవరుకు గాయాలు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు వ్యాన్