
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే..
● ముస్లింల అస్తిత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
● జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దేశంలోని సుమారు 22 కోట్ల మంది ముస్లింల అస్తిత్వాన్ని అస్థిరపరిచేలా వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆమోదింపజేసుకుందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. జాంపేటలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు పలకడం ద్వారా దేశంలోని ముస్లింల మేలును కాంక్షించబోమనే విషయాన్ని రుజువు చేశాయని విమర్శించారు. ముస్లింల ఆస్తులను కాజేసే కుట్రలో భాగంగానే ఈ చట్టం తెచ్చారని, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా అని ధ్వజమెత్తారు. ఈ చట్టం ముస్లింల షరియత్‌కు పూర్తి విరుద్ధమన్నారు. ముస్లింల అభివృద్ధికి దానం చేసిన స్థిర, చర ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉంచుకోవాలని, తద్వారా వారిని అణచివేసే లక్ష్యంతోనే ఇలాంటి నల్ల చట్టం తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను అపహాస్యం చేస్తూ ముస్లింలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారన్నా రు. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా చట్టంలో ఎలాంటి మార్పూ చేయలేదని, ఇది కేవలం బడాబాబులకు దోచిపెట్టడమేనని ఆరిఫ్ విమర్శించారు. ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు హాని తలపెట్టే ఎటువంటి చర్యలనూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ఏనాడూ చేపట్టలేదని చెప్పారు. ఎన్‌ఆర్‌సీ బిల్లును సైతం రాష్ట్రంలో అమలు చేసేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా దేశవ్యాప్తంగా మతసామరస్యాన్ని కాంక్షించే మేధావులు, లౌకికవాదులు ఆయనను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ క్రాస్ ఓటింగ్ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా పలువురు ఖండిస్తున్నారని, ఇది టీడీపీ నీచమైన కుట్రగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ముస్లింలకు ఎటువంటి నష్టం జరగనివ్వనని ఇఫ్తార్ విందులో హామీ ఇచ్చి, రెండు రోజులు తిరగక ముందే వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు పలికారని, చెప్పిన మాటపై ఎప్పుడూ నిలబడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారని దుయ్యబట్టారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. టీడీపీలోని ముస్లిం నాయకులు ఇప్పటికై నా ఆత్మపరిశీలన చేసుకుని, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, దీనికోసం పార్టీలకతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని ఆరిఫ్ పిలుపునిచ్చారు.