
వర్షాకాలానికి 18 లక్షల టన్నుల ఇసుక సిద్ధం చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డ్‌లలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్న గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాలు, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక స్టాక్ యార్డులకు ఆయా నియోజకవర్గాల్లో అనువైన ప్రదేశాలపై ప్రతిపాదన అందజేయాలని ఆర్‌డీఓలకు సూచించారు. స్టాక్ పాయింట్ల వద్ద తగిన నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సెమీ మెకనైజ్డ్ కింద పర్యావరణ అనుమతులు పొందిన 10 రీచ్‌ల ద్వారా 57,82,950 మెట్రిక్ టన్నుల ఇసుక త్వరలో అందుబాటులోకి రానున్నదని కలెక్టర్ తెలిపారు. కాటవరం, సింగవరం, కుమారదేవం, తాడిపూడి, పెండ్యాల ఇసుక ర్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణ పశ్చిమ గోదావరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల డీఎల్‌ఎస్‌సీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.390 కోట్ల మేర ఖనిజ ఆదాయం సాధించామని జిల్లా మైన్స్ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్‌డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్ బీవీ గిరి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి వై.శ్రీనివాస్, సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్, ఇరిగేషన్ డీఈ ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
డెలివరీ బాయ్స్ ఈ–శ్రమ్‌లో
నమోదు చేసుకోవాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో, ఓలా వంటి సంస్థల్లో పని చేస్తున్న డెలివరీ రంగ ఉద్యోగులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో తమ పేర్లు ఉచితంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే గుర్తింపు కార్డు పొంది, సంక్షేమ పథకాలు అందుకోవచ్చని వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో అసంఘటిత రంగ కార్మికులకు ప్రకటించిన సంక్షేమ ప్రయోజనాలు అందుకునేందుకు ఆయా ప్లాట్‌ఫామ్ కార్మికులు తమ పేర్లను ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ బీఎస్‌ఎం వలి కోరారు.
పీజీఆర్‌ఎస్‌కు 193 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు 193 అర్జీలు సమర్పించారు. వారి నుంచి అధికారులతో కలసి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక, మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలో 946 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, వాటిలో ఇంకా 69 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రీ ఓపెన్ అయిన ప్రతి అర్జీదారును వ్యక్తిగతంగా కలిసి, పరిష్కారం వివరాలు తెలియజేయాలని సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యాన ఆరుగురు దివ్యాంగులకు వివిధ ఉపకరణాలను జేసీ అందజేశారు.
డీసీహెచ్‌ఎస్‌గా పద్మ
కొవ్వూరు: జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్)గా ఎం. పద్మ నియమితులయ్యా రు. ఇప్పటి వరకూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చి, సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను కార్యాలయ సిబ్బంది, కొవ్వూరు ఆసుపత్రి సూపరిండెంటెండ్ కె.సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీసీహెచ్‌ఎస్‌గా పని చేసిన ఎం.పద్మజారాణి విజయనగరం డీసీహెచ్‌ఎస్‌గా బదిలీ అయ్యారు.

వర్షాకాలానికి 18 లక్షల టన్నుల ఇసుక సిద్ధం చేయాలి

వర్షాకాలానికి 18 లక్షల టన్నుల ఇసుక సిద్ధం చేయాలి