
రోగి మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
● ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి మృతి చెందాడంటూ దానవాయిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద మంగళవారం మృతుడి బంధువులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరుకు చెందిన జి.సత్యనారాయణ (55) కూలి పనిచేస్తుంటాడు. అతడు ఆదివారం పనికి వెళ్లి ట్రాక్టర్ పైనుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు కాళ్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు..ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సత్యనారాయణను దానవాయిపేటలోని ఆ వైద్యుడు తెలిపిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడి కాళ్లకు ఆపరేషన్ చేసి ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ చేసిన రోజు, మర్నాడు సోమవారం బాగానే ఉన్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులు ఐసీయూలోకి వెళ్లి చూసేసరికి సత్యనారాయణ అచేతనంగా పడిఉన్నాడు. అతడి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో వెంటనే బయటకు పరుగెత్తుకు వచ్చి విషయాన్ని అక్కడ సిబ్బందికి తెలిపారు. వారు వచ్చి సత్యనారాయణకు వైద్య చికిత్సలు ప్రారంభించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీనిపై మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. తాము చెప్పే వరకు పేషెంట్‌ను పట్టించుకోలేదని, తాము చెబితేనే చనిపోయినట్లు వారికి అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళన చేస్తున్నారని ఆ ఆసుపత్రి నిర్వాహకులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.