
ప్రతి రైతు పారిశ్రామికవేత్తగా ఎదగాలి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి రైతూ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, వ్యవసాయాన్ని పరిశ్రమగా చేపట్టాలని జాతీయ వాణిజ్య పరిశోధన, వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమహేంద్రవరం ఐసీఏఆర్ – నిర్కా (సీటీఆర్‌ఐ)లో మంగళవారం వ్యవసాయంలో ఆవిష్కరణలు – వ్యవసాయం పారిశ్రామికరణ దిశగా ఆవిష్కర్తల కలయిక కార్యక్రమం జరిగింది. అధ్యక్షత వహించిన శేషుమాధవ్ మాట్లాడుతూ వ్యవసాయంలో వాణిజ్యపరమైన వినూత్న ఆవిష్కరణలు, అవకాశాలతో పాటు వాణిజ్య పంటల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే దిశగా రైతులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు కృషి చేయాలన్నారు. న్యూఢిల్లీ ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఐపీటీఎం) డాక్టర్ నీరు భూషణ్ ముఖ్యఅతిథిగా ఆన్‌లైన్‌లో హాజరు కాగా, వారి తరఫున న్యూఢిల్లీ ఐసీఏఆర్ – ఐటీఎంయూ డాక్టర్ వి.విక్రమ్‌సింగ్ ఆన్‌లైన్‌లో సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీఎంయూ నోడల్ ఆఫీసర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.రవిశంకర్ మాట్లాడుతూ ఆవిష్కర్తల కలయిక ఆవశ్యకతలను వివరించారు. వాణజ్య వ్యవసాయంపై ఆవిష్కరణలు, విలువ ఆధారిత పదార్థాల తయారీపై రైతుల విజయగాథలు, కోత అనంతరం వాణిజ్య పంటలలో వివిధ ఉత్పత్తులలో సంకలనం చేయబడిన సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, హైదరాబాద్ ఐసీఏఆర్–నారమ్ మేనేజ్మెంట్ డివిజన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ హెడ్ ఎస్.సెంథిల్ వినాయగం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నటరాజ్, నాబార్డు ఏజీఎం సోము నాయుడు, ఎపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్‌పీ నాయుడు మాట్లాడారు. అనంతరం 11 మంది ఔత్సాహిక యువత తమ అనుభవాలను వివరించారు. 11 ఎగ్జిబిషన్ స్టాళ్లలో పసుపు, అశ్వగంధం, ఆముదం, మిరప ఉత్పత్తులతో పాటు ఎన్‌జీవో, ఎఫ్‌పీవోలు, ఏపీసీఎన్‌ఎఫ్ (ప్రకృతి వ్యవసాయం) వారి వివిధ ఉత్పత్తులు, రోబోటిక్స్, డ్రోన్స్, జ్యూట్‌బ్యాగులను ప్రదర్శించారు. అనంతరం 17 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను సత్కరించారు.
నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్
ఉత్సాహంగా ‘ఆవిష్కర్తల కలయిక’