
అనుమానాస్పద స్థితిలో ఉద్యోగిని మృతి
నిడదవోలు: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లి కరుణ (28) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకై క కుమార్తె కరుణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం సాధించింది. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరగడం, కాళ్లూ చేతులు వంకర్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న కరుణను బంధువులు పద్మ, సుబ్బు కలిసి కారులో నిడదవోలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న కరుణను రాత్రి 9 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరుణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గదిలో ఉంచారు. బంధువులు, తల్లిదండ్రులు మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుణకు పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూశారు. అయితే వివాహం విషయంలో కుటుంబంలో కలహాలు జరుగుతున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కరుణ మరణ సమాచారం తెలుసుకున్న పట్టణంలోని వివిధ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆసుపత్రికి తరలివచ్చారు. మృతురాలి కరుణ తల్లి సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వీరబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కరుణ మృతదేహన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ సంతాపం తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
రాజానగరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జాతీయ రహదారిపై జీఎస్‌ఎస్ వైద్య కళాశాల సమీపంలో సోమవారం రూ.10 లక్షల విలువైన బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా మంగళవారం కూడా పైప్రాంతానికి కొద్దిదూరంలో పిరమిడ్‌ను చేర్చి ఉన్న పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై రూ.ఒక లక్ష విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ తహసీల్దార్ (పౌరసరఫరాలు) గొలుగూరి బాపిరాజు తెలిపారు. చక్రద్వారబంధానికి చెందిన మాడబోయిన గోపి నుంచి వడిశలేరుకు చెందిన వట్టికూటి మణికంఠ మినీ వ్యాన్‌ను అద్దెకు తీసుకుని, అనపర్తి నుంచి గండేపల్లికి ఈ బియ్యాన్ని రవాణా చేస్తున్నాడన్నారు. నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఉద్యోగిని మృతి