
వైభవంగా పొన్నవాహన మహోత్సవం
కొత్తపేట: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం పొన్న వాహన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఈ కార్యక్రమం జరిపారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున స్వామి వారి మేలుకొలుపు, గౌతమి నది నుంచి తీర్థపు బిందెను తీసుకువచ్చి విశేషార్చన, నిత్య హోమాలు నిర్వహించారు. రాత్రి ఉభయ దేవేరులతో స్వామివారు పొన్నవాహనంపై గ్రామంలో విహరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం సజ్జాపురానికి చెందిన నందగోపాల మహిళల కోలాట భజన మండలి కోలాటం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.