
చిన్నతనం నుంచే చోరీల బాట
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చిన్నతనం నుంచే చోరీల బాట పట్టిన దొంగను నిడదవోలు పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, రూ.3.60 లక్షల విలువైన 4 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు, టీవీ, మోటారుసైకిల్, ఐరన్ రాడ్డు, స్కూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం సమీపంలోని గునుపూడి బ్రాహ్మణవీధిలో నివాసముండే పందిరి వెంకట నారాయణ ఆలియాస్ నారిగాడు చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. 2008లో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలో సైకిళ్లు, ఇనుపముక్కలు దొంగతనం చేసేవాడు. దీంతో పోలీసులు వెంకట నారాయణను పట్టుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఆ తర్వాత పలు చోరీలకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేయడం, బయటకు రావడం, మళ్లీ దొంగతనం చేయడం, తిరిగి జువైనల్ హోమ్‌కు వెళ్లడం పరిపాటిగా మారింది. అలా అమలాపురం, పి.గన్నవరం, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ 22న ఆలమూరు పోలీసులు అరెస్టు చేసి తిరిగి జైలుకు పంపారు. నెల తర్వాత బెయిల్‌పై విడుదలైన వెంకట నారాయణ సమిశ్రగూడెం, ఉండ్రాజవరం, పెనుమంట్ర, ఐనవల్లి, పెరవలి, రావులపాలెం, భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిల్లో మరో నేరస్తుడు శివసుబ్రహ్మణ్యంతో కలిసి నేరాలు చేశాడు. ఇదిలా ఉండగా.. వెంకట నారాయణ ఉండ్రాజవరంలోని సీపాని విజయలక్ష్మి ఇంటి తాళాలు పగులకొట్టి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కదలికలపై కన్నువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో 57 కేసులున్నట్టు గుర్తించారు. కేసును చేధించిన నిడదవోలు సీఐ స్వరూప్, ఉండ్రాజవరం ఎస్సై జి.శ్రీనివాసరావు, సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు, సీసీఎస్ ఎస్సై రవీంద్ర, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.నరసింహ కిశోర్, క్రైం అడిషనల్ ఎస్పీ ఎల్.అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు.
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
రూ.50 లక్షల విలువైన
బంగారం స్వాధీనం