
ముగిసిన పది మూల్యాంకనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వారం రోజులుగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు తెలిపారు. మూల్యాంకనం నిమిత్తం 101 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 630 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 200 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై
సమగ్ర విచారణ
ఎస్పీ నరసింహకిషోర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ డీ నరిసింహ కిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్‌ఏస్‌ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని, అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందన్నారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ నిశిత విశ్లేషణ జరుగుతోందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకు ఎవరికీ ఇవ్వలేదని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌లు పోలీస్ శాఖ రిలీజ్ చేయలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థ సమర్థంగా, సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు చేస్తుందన్నారు.
సత్యదేవునికి ఘనంగా
జన్మ నక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరిచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్‌లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ల రసాలు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్చకులు దత్తాత్రేయ శర్మ, సుధీర్, పవన్ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి యాగశాల లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది.
నేడు నిజరూప దర్శనం
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు గురువారం ఏ విధమైన ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్‌లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో అర్హతగల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్షకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారిణి ఎం లల్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కులధ్రువీకరణ పత్రం, టెట్ పరీక్షలో అర్హత సాధించి రుజువు వంటివి జతపరచాలన్నారు. దరఖాస్తును సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి కార్యాలయం, 2వ అంతస్తు, ప్రగతి భవన్, డీఆర్‌డీఏ కాంప్లెక్స్, జీజీహెచ్ ఎదుట, కాకినాడ చిరునామాలో సమర్పించాలన్నారు.