రాజమహేంద్రవరం సిటీ: అదుపుతప్పి రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందినట్టు రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్సై మావుళ్లు గురువారం తెలిపారు. ద్వారపూడి–కడియం రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు చెప్పారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్టు తెలిపారు. మృతుడు నీలం రంగు ప్యాంటు, పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని చెప్పారు. టాటానగర్ నుంచి పాలక్కడ్‌కు జనరల్ టికెట్ ఉందన్నారు.
తోట నరికివేతపై కేసు
గోపాలపురం: మండలంలోని భీమోలు గ్రామంలో ఈ నెల 3న కొందరు యువకులు జామాయిల్ తోటలోకి అక్రమంగా చొరబడి, కర్రలను నరికి విక్రయించడంపై కేసు నమోదు చేశామని ఎస్సై కర్రి సతీష్‌కుమార్ గురువారం తెలిపారు. భీమోలు గ్రామానికి చెందిన పేద రైతు షేక్ యాకుబ్ తన ఐదు ఎకరాల జామాయిల్ తోటలోకి అదే గ్రామానికి చెందిన 13 మంది ముఠాగా ఏర్పడి జామాయిల్ తోటలోకి ప్రవేశించారు. తోటలోని కర్రలను నరికి, విక్రయించినట్టు యాకుబ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను బెజవాడ రవీంద్ర, పెనుమాక మోషే, హేమంత్, ఖండెల్లి దాసు, ముప్పిడి రామకృష్ణ, రాజేష్, అర్జంగి రాంబాబు, నేకూరి బాలకృష్ణ, బెజవాడ మోహన్‌రావు, ఖండెల్లి వెంకట్రావు, పత్తిపాటి చందు, వేములూరి రాంబాబు, ఈతకోట పెంటయ్యగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.
పోక్సో కేసులో వ్యక్తి అరెస్టు
ప్రత్తిపాడు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని వంచించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు గురువారం అరెస్టు చేశారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వి.గన్నిబాబు అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
16లోగా అభ్యంతరాలు,
గ్రీవెన్స్ సమర్పించాలి
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, పూర్వ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు గత నెలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి ఎం.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు దరఖాస్తుల పరిశీలన అనంతరం htpp://artgo davari.nic.in వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్ లిస్ట్ పొందుపర్చినట్టు చెప్పారు. ఈ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11 నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా కొవ్వూరు ఆస్పత్రి ఆవరణలోని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని కోరారు. అభ్యంతరాలు, గ్రీవెన్స్ పరిశీలన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపారు.