
చెంతనే గోదారి.. చేలు తడారి..
● నాట్ల దశ నుంచీ రైతుకు ఇక్కట్లే..
● కోతకు వచ్చినా కష్టాలే..
● సాగుకు మురుగు నీరే దిక్కు
● బోర్ల ద్వారా అందిస్తున్న అన్నదాతలు
పెరవలి: చెంతనే జీవనది గోదావరి ఉన్నా పైరుకు నీటి తడి అందక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. రబీ వరి సాగు చివరి దశకు వచ్చింది. పాలు పోసుకున్న గింజలు తగినంత నీటి తడి అందితేనే గట్టిపడతాయి. లేదంటే తాలుతప్పలుగా మిగిలిపోతాయి. మరోవైపు పంట ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫలితంగా రైతులు ఇన్ని నెలలుగా పడిన కష్టం, పెట్టిన పెట్టుబడి అక్కరకు రాకుండా పోతాయి. గోదావరి డెల్టా ముఖద్వారమైన పెరవలితో పాటు ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో కాలువల ద్వారా తగినంతగా నీరు అందకపోవడంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరి నాట్ల దశలో ప్రారంభమైన నీటి కష్టాలు కోత దశకు వచ్చినా తీరడం లేదు. కాలువలకు నీరు అంతంత మాత్రంగానే రావడంతో.. అవి చేలకు ఎక్కక రైతులు దిగాలుగా చూస్తున్నారు. పెట్టుబడి పెట్టి, ఇంత కాలం సాగు చేసిన పంట కళ్లెదుటే పాడైపోతూంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
చాలీచాలని నీరు
మెట్ట ప్రాంతం అధికంగా ఉన్న మన జిల్లాలో వరిసాగు ఎక్కువగా బోర్ల పైనే జరుగుతోంది. కాలువల ద్వారా సాగు విస్తీర్ణం తక్కువే. అయినప్పటికీ ఆ ప్రాంతానికి కూడా సాగునీరు సక్రమంగా అందడం లేదు. పెరవలి మండలంలో చిన్న, పెద్ద కాలువలు 69 ఉండగా.. వీటిలో పూర్తి స్థాయిలో నీరు ప్రవహించక శివారు భూములకు నీరు అందడం లేదు. ఈ కాలువలపై 6 వేల ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా ఇందులో సగానికి పైగా భూములకు బోర్ల ద్వారానే నీరందిస్తున్న దుస్థితి ఏర్పడింది. పెరవలి మండలం గరప కాలువ, పెండ్యాల పంపింగ్ స్కీమ్, పేకేరు కాలువ, శక్తమ్మతల్లి కాలువ, ఆచంట కాలువ, కాపవరం కాలువ వంటి వాటితో పాటు డైరెక్టు పైపుల (డీసీ) పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ప్రధాన కాలువలో నీరు గట్టును తాకుతూ ప్రవహిస్తే డీసీల ద్వారా నీరు సక్రమంగా పారుతుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవడంతో చేను తడవటం లేదని రైతులు వాపోతున్నారు. పెరవలి మండలం ఉసులుమర్రు, కాపవరం, ముక్కామల, ఖండవల్లి, నల్లాకులవారిపాలెం, కానూరు, కాకరపర్రు గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఈ గ్రామాలు కాటన్ బ్యారేజీకి పెద్ద దూరం కూడా కాదు. అయినప్పటికీ తగినంతగా సాగు నీరు అందక ఈ ప్రాంతాల్లోని చేలు నెర్రెలు తీశాయి.
అన్నదాతకు అగచాట్లు
సాగు చివరి దశకు చేరిన తరుణంలో పైరు ఎండటానికి సిద్ధంగా ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీంతో, బోర్లు, మురుగు కాలువల నుంచి నీటిని తోడుకుంటూ పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. కాలువల్లోకి వస్తున్న కొద్దిపాటి నీటిని పంట చేలకు ఇంజిన్లతో అందిస్తున్నారు. దీనికోసం వారికి అదనంగా చేతి చమురు వదిలిపోతోంది. ఏటా రబీ సాగులో ఇదే దుస్థితిని ఈ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్నారు. కొవ్వూరు డివిజన్‌లో 34 వేల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ప్రస్తుతం కోతలకు సిద్ధమవుతున్న చేలు 30 శాతం ఉండగా మిగిలినవి ఈ నెలాఖరుకు కోతకు వస్తాయి. దీనివలన మరికొన్ని రోజుల పాటు సాగు నీరు అందించాల్సి ఉంది. చేలు ఇంకా ఆకుపచ్చగానే ఉండటంతో ఈ నెలాఖరుకు కోతకు వస్తాయని, అప్పటి వరకూ నీటి తడి అందించడం తప్పనిసరి అని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి పైరుకు అవసరమైన స్థాయిలో నీరందించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

చెంతనే గోదారి.. చేలు తడారి..

చెంతనే గోదారి.. చేలు తడారి..

చెంతనే గోదారి.. చేలు తడారి..

చెంతనే గోదారి.. చేలు తడారి..

చెంతనే గోదారి.. చేలు తడారి..