
క్షేత్రం నుంచి క్షాత్రానికి!
పిఠాపురం: వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించే ఎడ్లు నేడు పరుగు పందేలలో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పూర్వం నుంచి ఎడ్ల పందాలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు పండుగలకు మాత్రమే పోటీలు పరిమితమయ్యేవి. ఆ సరదా పోటీలు నేడు మామూలు సందర్భాలలోనూ కొనసాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు వెచ్చించి మరీ పోటీలకు ఎడ్లను పెంచడంలో పలువురు రైతుల ఆసక్తి చూపుతున్నారు. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని వారంటున్నారు. వ్యవసాయ రంగంలో యంత్ర విప్లవం రావడంతో ఎడ్ల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వాటిని మరో విధంగా వినియోగిస్తున్నప్పటికీ కొందరు రైతులు ఎడ్ల బండ్ల పోటీల కోసం ప్రత్యేకంగా పెంచుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒక చోట ఎడ్ల పరుగు పందాలు జరుగుతుండగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పందేల కోసం రైతులు తమ ఎడ్లను తీసుకుస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించనున్నారు. జిల్లాలో లైను పందాలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందాలు ఆడుతుంటారు.
వీటికి సెపరేటు
పరుగు పందాలలో పాల్గొనే ఎడ్లకు గిత్తల ప్రాయం నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. కేవలం ఒక సంవత్సరం వయసు నుంచే చిన్న సైజు బండ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. సాధారణ ఎడ్లలా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తు సమయానుకూలంగా దూరాలను లక్ష్యంగా పెట్టి పరుగు పెట్టిస్తుంటారు. సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందేలకు వినియోగిస్తారు. పరుగు పందేలలో పాల్గొనే ఎడ్ల ఖరీదు రూ.లక్షలు పలుకుతోంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. ఒక రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చై నా రైతులు వెనుకాడడం లేదు. ఇతర జిల్లాలకు వెళ్లి మరీ రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
మేతలోనే సత్తా
పందాలలో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేకమైన మేతతో మేపుతుంటారు. కేవలం ప్రత్యేకమైన దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు, నిత్యం ఉడకబెట్టి నానబెట్టిన ఎండుగడ్డి ముక్కలలో వేసి దాణాగా మేపుతారు. వీటి మేతకు సంవత్సరానికి సుమారు రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందేలు ఉన్నా లేకపోయినా వీటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పదని, మేతలో ఎప్పుడు మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉందంటున్నారు.
బండి సదుపాయాలు ప్రత్యేకమైనవి
సాధారణంగా బరువులు లాగే ఎడ్ల బళ్లు చాలా బరువుగా పటిష్టంగా పెద్దపెద్ద చక్రాలతో ఉంటాయి. ప్రస్తుతం ఆ చెక్క చక్రాల స్థానంలో టైర్లు వచ్చాయి. గతంలో కేవలం ప్రత్యేకమైన చెక్కతో చేసిన చక్రాలు గల బళ్లు ఉండేవి. కాని పరుగు పందాలలో ఉపయోగించే బళ్లు మాత్రం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. బరువు తక్కుగా ఉండేలా పటిష్టంగా చిన్న సైజులో అందంగా తయారు చేయిస్తారు. వాటికి వివిధ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.
రూటు మార్చిన బసవడు
ఏటా పెరుగుతున్న ఎడ్ల పందాలు
రూ.లక్షలు పలుకుతున్న పందెపుటెడ్లు
ప్రత్యేక పోషణ, సాధన, రక్షణలో
జాగ్రత్తలు తీసుకుంటున్న రైతులు
గెలుపు కిక్కే వేరంటున్న యజమానులు
నేడు చేబ్రోలులో పోటీలకు సమాయత్తం
ఎడ్లకు ఎయిర్ కూలర్లు
కంటిలో లోపం రాకుండా దుమ్ము ధూళి పడినా కంటి చూపు దెబ్బతినకుండా లక్ష్యం వైపు దూసుకుపోయే విధంగా పందెం ఎడ్ల కళ్లకు కాటుక పెడుతుంటారు. పరిగెట్టి అలిసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి మందులతో మసాజ్ చేస్తుంటారు. రాత్రి సమయాల్లో ఈగలు, దోమలు కుట్టకుండా దోమ తెరలతో పాటు ప్రత్యేకంగా ఎయిర్ కూలర్లు వాడుతున్నారు.
పది నిమిషాల పరుగుకు పది నెలల సాధన
పందెంలో ఎడ్లు పది నిముషాలు పరుగు పెట్టాలంటే పది నెలల ముందు నుంచి ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక సంరక్షణ ఉంటుంది. ఎంతో శ్రమకోర్చి వాటిని పెంచి పోషిస్తుంటాం.
ఎడ్ల పందేలు మన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా మా తాతల నాటి నుంచి కొనసాగిస్తున్నాం. పందేల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి రోజు పరుగులో శిక్షణ ఇస్తుంటాం. మేతకు ఎక్కువ ప్రాధాన్యనిస్తాం. బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
– రవీంద్రనాథ్ చౌదరి, రైతు, మండపేట
ఆనందం కోసమే అంత కష్టం
మా కుటుంబంలో పూర్వం నుంచి ఎడ్లను పోషిస్తున్నాం. ముఖ్యంగా పరుగు పందేలంటే మాకు చాలా ఇష్టం. ఏటా వీటి పోషణకు రూ.లక్షలు ఖర్చు అవుతున్నా పోటీలలో గెలుపు సాధించినప్పుడు వచ్చే ఆనందం వెల కట్టలేనిది. అందుకే ఎంత ఖర్చయినా లెక్క చేయం. వీటిని కంటికి రెప్పలా చూసుకుంటాం. వాటికి అనేక సౌకర్యాలు కల్పించి కాపాడుకుంటాం.
– కుర్రా పురుషోత్తం, రైతు, బాపట్ల

క్షేత్రం నుంచి క్షాత్రానికి!

క్షేత్రం నుంచి క్షాత్రానికి!

క్షేత్రం నుంచి క్షాత్రానికి!

క్షేత్రం నుంచి క్షాత్రానికి!