
అనధికార లే అవుట్లపై చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: అనధికార లే అవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) వైస్ చైర్మన్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. అనధికార లే అవుట్లపై తీసుకుంటున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలపై రుడా పరిధిలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో శుక్రవారం ఆయన తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనధికార లే అవుట్ల వలన ప్రజలకు, డెవలప్‌మెంట్ చార్జీల రూపంలో పంచాయతీలు కోల్పోతున్న ఆదాయం, తద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కలిగే అడ్డంకులు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి పంచాయతీ పరిధిలో వారం రో జుల్లోగా ప్రతి అనధికార లే అ వుట్‌ను గుర్తించాలని ఆదేశించా రు. ఆ వివరాలను పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డు, ముఖ్య ప్రదేశాల్లో ప్రదర్శించాల ని సూచించారు. ఈ కార్యక్రమం అమలుపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని, నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని కేతన్ గార్గ్ హెచ్చరించారు.