స్వామీ.. భద్రతేదీ..! | - | Sakshi
Sakshi News home page

స్వామీ.. భద్రతేదీ..!

Published Sat, Apr 12 2025 2:24 AM | Last Updated on Sat, Apr 12 2025 2:24 AM

స్వామీ.. భద్రతేదీ..!

స్వామీ.. భద్రతేదీ..!

అన్నవరం దేవస్థానంలో భద్రతకు ఏటా రూ.4.50 కోట్లు

కానరాని లగేజీ స్కానర్లు, మెటల్‌, హ్యాండ్‌ డిటెక్టర్లు

2020లోనే ఇంటెలిజెన్స్‌ నివేదిక

నాలుగేళ్లయినా అమలుకు నోచుకోని వైనం

అన్నవరం: కొద్ది రోజుల కిందట ఓ సత్రంలో మద్యం సీసాల కలకలం.. తాజాగా మద్యం తాగి ఆలయానికి వెళ్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులు.. కారులో మద్యం సీసాలు.. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నవరం దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల తనిఖీలు పెరిగినా అవి మద్యం తాగిన వారిని పట్టుకోవడానికి, మద్యం సీసాలతో రత్నగిరికి వెళ్తున్న వారిని నిరోధించడానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. భక్తుల లగేజీని స్కానర్లతోను, భక్తులను మెటల్‌ డిటెక్టర్లతోను తనిఖీ చేయడం వంటివి దేవస్థానంలో జరగడం లేదు. దేవస్థానంలో భద్రతా చర్యలకు ఏటా రూ. 4.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 14 మంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) సిబ్బందికి జీతాలు, సుమారు 40 మంది హోం గార్డులు, 60 మంది సెక్యూరిటీ గార్డులకు జీతాల రూపంలో ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఆయుధాలు కలిగి ఉండే ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది ఆలయం చుట్టూ మాత్రమే ఉంటారు. వారు 24 గంటలూ అక్కడే ఉంటారు. మిగిలిన భద్రతా విషయాలు వారి పరిధిలో లేవు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడం, స్వామివారి ఆలయం దిగువన క్యూ లైన్ల వద్ద, రోడ్డు జంక్షన్లు, ఉత్సవాల సమయంలో భద్రతా విధుల్లో హోం గార్డులు పాల్గొంటున్నారు. సెక్యూరిటీ గార్డులు కూడా దాదాపు ఇవే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఒక్క అంచె తనిఖీ కూడా లేదు

తిరుమల – తిరుపతి దేవస్థానంలో మూడంచెల్లో తనిఖీలు చేస్తూంటారు. కొండ దిగువన అలిపిరి వద్ద భక్తుల లగేజీని యంత్రాలతో స్కాన్‌ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తరువాత స్వామివారి దర్శనానికి కంపార్ట్‌మెంట్‌ లోపలకు వెళ్లే ముందు మరోసారి తనిఖీ చేస్తారు. అనంతరం ఆలయానికి సమీపానికి చేరుకున్నాక క్యూ లైన్‌లో మరోసారి తనిఖీ జరుగుతుంది. కానీ, అన్నవరం దేవస్థానంలో పకడ్బందీగా ఒక్క అంచెలో కూడా తనిఖీ జరగడం లేదు.

లగేజీ తనిఖీ నామమాత్రమే

సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తుల లగేజీని టోల్‌గేట్‌ వద్ద సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంగా మద్యం సీసాలు, మాంసాహారం, లేదా మద్యం తాగి పట్టుబడితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీలు కూడా సాధారణ రోజుల్లోనే జరుగుతున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో వాహనాల తనిఖీ సాధ్యమే కావడం లేదు. ఒక వాహనం తనిఖీ చేయడానికి 10 నిమిషాలు పడితే, ఆ సమయంలో వెనుక చాలా వాహనాలు నిలిచిపోతాయి. దీంతో తూతూమంత్రంగా తనిఖీలు చేసి పంపించేస్తున్నారు. కార్తికం, వైశాఖం, శ్రావణ మాసాలతో పాటు వివాహాల సీజన్‌, ఉత్సవాల సమయంలో భక్తులు వేలాది కార్లలో రత్నగిరికి తరలి వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యంత్రాల సాయం లేకుండా ఆ కార్లను తనిఖీ చేయడం సాధ్యం కాని పని.

ఇంటిలిజెన్స్‌ అధికారుల సూచనలివీ..

భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు 202లో అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. ఆ సందర్భంగా పలు సూచనలతో నివేదిక అందజేశారు. వారి సూచనలివీ..

ఫ రత్నగిరి టోల్‌గేట్‌ వద్ద కచ్చితంగా రెండు లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలి. భక్తుల లగేజీ స్కాన్‌ చేశాక మాత్రమే ఆ వాహనాలను అనుమతించాలి.

ఫ దేవస్థానం బస్సులలో వచ్చే వారి లగేజీ కూడా తనిఖీ చేయాలి.

ఫ రత్నగిరి మెట్ల దారి వద్ద కూడా లగేజీ స్కానర్‌ ఏర్పాటు చేసి, ఆ ప్రక్రియ పూర్తి చేశాక మాత్రమే భక్తులను కొండ పైకి అనుమతించాలి.

ఫ స్వామివారి ఆలయ ప్రాంగణం లోపలకు వెళ్లేచోట, ఆలయం వద్ద, వెలుపలకు వచ్చేచోట మెటల్‌ డిటెక్టర్‌ డోర్లు ఏర్పాటు చేయాలి.

ఫ ప్రతి భక్తుడిని హ్యాండ్‌ డిటెక్టర్లతో తనిఖీ చేశాకే లోపలకు అనుమతించాలి.

ఫ స్వామివారి ఆలయానికి రాకపోకలు సాగించేందుకు ఎంట్రన్స్‌, ఎగ్జిట్‌ రెండు దారులు మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు.

ఫ దేవస్థానంలో అన్ని ప్రాంతాలూ కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించడానికి సిబ్బందిని 24 గంటలూ అందుబాటులో ఉంచాలి. సీసీ టీవీ ఫుటేజ్‌లను స్థానిక పోలీసులు కూడా పరిశీలించాలి.

అరకొరగానే సూచనల అమలు

ఇంటెలిజెన్స్‌ అధికారుల సూచనల్లో 10 శాతం కూడా దేవస్థానంలో ప్రస్తుతం అమలవడం లేదు. ఎక్కడా లగేజీ స్కానర్లు లేవు. మెటల్‌ డిటెక్టర్‌ డోర్లు లేవు. ఒకటి రెండుచోట్ల ఉన్నా పని చేయడం లేదు. భక్తులను తనిఖీ చేసేందుకు హ్యాండ్‌ డిటెక్టర్లు కూడా లేవు. స్వామివారి ఆలయానికి రెండుకన్నా ఎక్కువ మార్గాలే ఉన్నాయి. చాలాచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ, సత్యగిరిపై మాత్రం ఇంకా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది టోల్‌గేట్‌ వద్ద సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం సీసాలు తెచ్చుకుని అక్కడ తాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీసీ ఫుటేజ్‌ను భద్రతా సిబ్బంది కాకాకుండా సాధారణ కాంట్రాక్ట్‌ ఉద్యోగులే పరిశీలిస్తున్నారు.

అటకెక్కిన లగేజీ స్కానర్ల ప్రతిపాదన

టోల్‌గేట్‌ వద్ద లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్‌ ఆజాద్‌ భావించారు. ఈ మేరకు అలిపిరి వెళ్లి, అక్కడ ఏవిధంగా తనిఖీ చేస్తున్నారో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఈని ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాక టోల్‌గేట్‌ వద్ద పెద్ద షెడ్డు నిర్మించి, భక్తుల లగేజీ స్కాన్‌ చేయడానికి రెండు స్కానర్లు కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించారు. లగేజీ స్కాన్‌ చేసేటప్పుడు వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని భావించి, కళాశాల మైదానంలో నుంచి ఘాట్‌ రోడ్డు వరకూ మరో రోడ్డు నిర్మించారు. భక్తుల వాహనాలు కళాశాల మైదానంలోకి చేరుకుని, అక్కడి నుంచి స్కానింగ్‌ అయ్యాక ఘాట్‌ రోడ్డులోకి ప్రవేశించి రత్నగిరికి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే, ఆటోలు, బైక్‌ల మీద వెళ్లేవారిని కూడా టోల్‌గేట్‌ వద్ద తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఆయన బదిలీ అనంతరం టోల్‌గేట్‌ వద్ద షెడ్డు నిర్మించారు తప్ప లగేజీ స్కానర్లు, ఇతర చర్యలు తీసుకోలేదు. దీంతో, రద్దీ సమయంలో తనిఖీలు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవస్థానంలో ఇప్పటికై నా అధికారులు, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement