
అక్క బంగారం కాజేసి కటకటాలకు
● సొంత చెల్లి పెద్దమ్మ కూతురితో కలసి చోరీ
● కట్టర్ సాయంతో తాళాలు తొలగించిన వైనం
● 198 గ్రాముల బంగారు ఆభరణాలు,
రూ.10వేల నగదు, ఇంటి డాక్యుమెంట్ల స్వాధీనం
నిడదవోలు : సొంత అక్క బంగారంపైనే చెల్లెలు కన్నేసింది. అదును చూసి ఇద్దరి సాయంతో వాటిని అపహరించి చివరకు కటకటాల పాలైంది. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ శనివారం స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఎంవీ నగర్‌లో బలిజ సత్యనారాయణ, శశి లలితాదేవి దంపతులు నివసిస్తున్నారు. లలితాదేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె సొంత చెల్లెలు పడాల లక్ష్మీశైలజ తాడేపల్లిగూడెంలో ఉంటోంది. శైలజ ఆర్థిక పరిస్థితుల వల్ల తన అక్క బంగారం దొంగిలించి తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని పథకం వేసింది. ఈ మేరకు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన తన పెద్దమ్మ కుమార్తె బండి సత్యవేణి సహాయం తీసుకుంది. ఆమెకు ఈ పథకం గురించి చెప్పింది. బీరువా తాళాలు బద్దలు కొట్టడానికి ఓ వ్యక్తిని పురమయించాలని చెప్పింది. ఆమె ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కప్పకాయల సురేంద్రను తీసుకుని ఆటోలో ఈ నెల పదో తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు లలితాదేవి ఇంటికి చేరుకున్నారు. వారు ముగ్గురు ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించి, ఎవరైనా వస్తే చెప్పాలని సత్యవేణిని ఆటో వద్ద కాపలా ఉంచారు. తర్వాత నిందితులు శైలజ, సురేంద్ర కలిసి ఇంటికి వేసిన తాళాన్ని ఐరన్ కట్టర్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. గదిలో ఉన్న బీరువా లాకర్‌ను కూడా కట్టర్ సహాయంతో కట్ చేసి బీరువాలోని 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు, ఇంటి, ఖాళీ స్థలం డాక్యుమెంట్లు అపహరించుకుపోయారు. దీననిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా శైలజ, సత్యవేణి, సురేంద్రల నేరం చేసినట్టు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తిలక్ పేర్కొన్నారు. వీరి నుంచి 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్ల విలువ రూ.12.55 లక్షలు ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలో ముద్దాయిలను గుర్తించి కేసులు ఛేదించిన ఎస్సై కె.జగన్‌మోహన్‌రావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు.

అక్క బంగారం కాజేసి కటకటాలకు