
‘నన్నయ’ వీసీకి రత్నసింహ్‌జీ మహిదా అవార్డు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ‘రత్నసింహ్‌జీ మహిదా మెమోరియల్ అవార్డు అందుకున్నారు. ఆమెకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ శనివారం ఈ అవార్డు అందజేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని రాజ్‌పిప్లాలో సామాజిక సంస్కర్త, విద్యావేత్త, గిరిజనుల సంక్షేమానికి అంకితమైన దివంగత రత్నసింహ్‌జీ మహిదా జ్ఞాపకార్థం సంఘ సేవ చేసిన ప్రముఖులకు ఈ సంవత్సరం నుంచి అందజేస్తున్నారు. బిర్సాముండా గిరిజన యూనివర్సిటీ వీసీ మధుకర్బాయ్ ఎస్‌తో పాటు 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించి, భారత రాష్ట్రపతి నుంచి ‘నారీరత్న’ పురస్కారాన్ని అందుకున్న ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీకి ఈ అవార్డును తొలిసారిగా ప్రదానం చేశారు.
కారు బోల్తా..
10 మందికి గాయాలు
దేవరపల్లి: అతి వేగంగా వెళుతున్న కారు 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి, పంట పొలాల్లో బోల్తా పడి, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి దేవరపల్లి మండలం యర్నగూడెం వద్దకు చేరుకున్నారు. అక్కడ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే పైనుంచి పల్టీలు కొడుతూ పంట పొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో కారులోని 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానికులు బయ టకు తీసి, హైవే అంబులెన్స్‌లో గోపాలపు రం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో గౌరక్క (కోతుల లత), గౌరక్కగారి చిన్నమ్మాయి, కోతుల సోమశేఖర్, కోతుల యశ్వంత్, కోతుల చందన, భార్గవి, పభ్రేష్, లలిక, శిరీష, కారు డ్రైవర్ గౌరక్కగారి శ్రీకాంత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఇ.సుబ్రహ్మణ్యం తెలిపారు.