
ఉపాధ్యాయులు సమాచారం ధ్రువీకరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్స్ సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించామని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు ఆదివారం తెలిపారు. ఆ జాబితాలు ఆర్‌డీ కాకినాడ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జేడీఎస్‌ఈకేకేడీ.ఆర్గ్, సంబంధిత ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యాశాఖల వెబ్‌సైట్‌లు, నోటీసు బోర్డులలో అందుబాటులో ఉంచామన్నారు. అయితే సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16వ తేదీలోగా సంబంధిత ఉమ్మడి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించి, సరి చేయించుకోవాలన్నారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలతో సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆధారాలు, సంబంధిత సాక్ష్యాలు ఉంటే వాటిని జత చేయాలన్నారు. టీఐఎస్‌లో సమాచారం అంతా సరిగానే ఉన్న ఉపాధ్యాయులు అందరూ తమ మొబైల్‌లోనే వన్ టైమ్ పాస్ వర్డ్ తో తమ డేటాను కన్ఫర్మ్ చేయాలన్నారు.
సీతారాములకు ఘనంగా శ్రీపుష్పయాగం
రత్నగిరిపై ముగిసిన
శ్రీరామనవమి వేడుకలు
అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో చివరగా తొమ్మిదో రోజు ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీసీతారాములకు శ్రీపుష్పయాగం కార్యక్రమం నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో రాత్రి ఎనిమిది గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనంపై , పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై ప్రతిష్టించి పండితులు పూజలు చేశారు. అనంతరం సీతారాములను సుగంధ భరిత పుష్పాలతో పూజించారు. సీతారాములకు వివిధ రకా ల పిండివంటలు నివేదించారు. అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. రామాలయంలో పూలమాలలతో అలంకరించిన ఊయల మీద సీతారాములను పవళింపు చేసి మంత్రాలు చదువుతూ మూడుసార్లు ఊపారు. అనంతరం ఆ ఊయలకు అమర్చిన అద్దంలో సీతారాములను పండితులు దర్శించారు. అనంతరం పండితులకు దంపత తాంబూలాలు బహూకరించారు. భక్తులకు ప్రసాదాలను, ముత్తయిదువులకు జాకెట్టు ముక్కలను పంపిణీ చేశారు. భక్తు లు సీతారాములను అద్దంలో తిలకించి పులకించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో రత్నగిరి పై శ్రీరామ నవమి మహోత్సవాలు ముగిసాయి.
వైభవంగా వెంకన్న శ్రీపుష్పోత్సవం
వాడపల్లిలో ముగిసిన కల్యాణోత్సవాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని శ్రీపుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన కల్యాణమహోత్సవాలు ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీపుష్పోత్సవంతో ఘనంగా ముగిసాయి. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వైఖానస పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి రాత్రి శ్రీపుష్పోత్సవం నిర్వహించారు. వివిధ రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోల పాటలతో పవళింపజేశారు. పలువురికి దంపతి తాంబులాలు అందచేశారు. కాగా అందరి సహకారంతో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు డీసీ చక్రధరరావు తెలిపారు.

ఉపాధ్యాయులు సమాచారం ధ్రువీకరించాలి