
ఉత్సాహంగా ఎడ్లబళ్ల పోటీలు
రాజానగరం: వ్యవసాయ ఆధారితంగా ప్రాంతాలలో సంప్రదాయంగా వస్తున్న ఎడ్ల బండ్ల పోటీలను ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేలా ప్రతిపాదన చేయనున్నట్టు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని వెలుగుబంద సమీపంలో వృత్తాకారంలో ఆదివారం నిర్వహించిన ఎండ్ల బళ్ల రాష్ట్ర స్థాయి పోటీలకు అపూర్వ స్పందన లభించింది. జీఎస్‌ఎల్ వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ పోటీలను ప్రారంభించగా, విజేతలకు ఎమ్మెల్యే బత్తుల బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలలో వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలకు ఇదొక పండుగలాంటిదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి పోటీలు లేకపోతే పశుసంపద అనేది కనుమరుగై పోయేదన్నారు. గ్రామ దేవత సత్తెమ్మ తల్లి తీర్థమహోత్సవాలను పురస్కరించుకుని వెలుగుబందకు చెందిన కూటి కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి 23 ఎడ్ల జతలు పోటీపడగా, నిర్ణీత వ్యవధిలో గమ్యాన్ని చేరుకున్న ఎనిమిది జతల ఎడ్లను విజేతలుగా ప్రకటించి, బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా రూ. 20 వేలను పెద పైడితల్లమ్మ (లెక్కల వానిపాలెం), రెండో బహుమతిగా రూ. 16 వేలను వేగుల్ల తేజాచౌదరి (మండపేట), మూడో బహుమతిగా రూ. 14 వేలను పోలుపర్తి రామునాయుడు అందుకోగా, మరో ఐదు జతలను కూడా తదుపరి స్థానాలలో విజేతలుగా ప్రకటించి నగదు బహుమతులను అందజేశారు.