
రాష్ట్రానికి 160 అగ్నిమాపక వాహనాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 160 అగ్నిమాపక వాహనాలను మంజూరు చేసిందని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్నిప్రమాదాల్లో ఇప్పటి వరకూ రూ.9.28 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, రూ.38.28 కోట్ల ఆస్తులను కాపాడామని చెప్పారు. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లిల్లో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్థం ఏటా ఏప్రిల్ 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. వంటింట్లో గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని, అగ్ని ప్రమాదాన్ని గమనించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆయా ప్రదేశాల నుంచి ఆరుబయట సురక్షిత ప్రదేశా లకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
25 అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు
ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఇ.స్వామి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్లు మంజూరు చేసిందని, మొదటి విడతగా రూ.153 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో 25 అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా సరిపడా నీటిని, ఫిక్స్‌డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్‌స్ట్టలేషన్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గోదాములు, గ్రామీణ ప్రాంతాలు, కర్మాగారాల్లో అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పందిళ్లు నిర్మించుకోవాలన్నారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.