
సరదా తెచ్చిన తంటా
కొవ్వూరు: విజ్జేశ్వరం లాకులకు దిగువన చిగుర్లంక వద్ద సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరొకరిని స్థానికులు కాపాడారు. సోమవారం సాయంత్రం నిడదవోలు చర్చిపేటకి చెందిన మర్తి ప్రకాష్‌కుమార్ (15), రాజమహేంద్రవరానికి చెందిన గంధం హర్ష(18), మరో యువకుడు స్నానం చేసేందుకు చిగుర్లంక వద్ద గోదావరి పాయ వద్దకు వచ్చారు. స్నానాలు ఆచరిస్తున్న ప్రదేశంలో లోతు తక్కువగా ఉందని భావించి నదిలోకి దిగారు. వారు దిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగారు. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అక్కడే సమీపంలో ఉన్న ఆరుగురు యువకులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రకాష్‌కుమార్, హర్ష నదిలో గల్లంతయ్యారు. మరో యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు, తహసీల్దార్ ఎం.దుర్గాప్రసాద్ జాలర్లు, గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇదే ప్రదేశంలో రెండేళ్ల క్రితం స్నానాలకు దిగి పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు.
హర్ష తండ్రి మూడు నెలల క్రితమే మృతి
గోదావరిలో గల్లంతైన హర్ష ప్రస్తుతం వైజాగ్‌లో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. తండ్రి మూడు నెలల క్రితమే మృతి చెందారు. తల్లి ౖశైలజ రాజమహేంద్రవరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. హర్ష పెద్ద సోదరి అబిల పోలియో వ్యాధి బారిన పడింది. రెండో సోదరి హేనాకి వివాహం చేశారు. అంబేద్కర్ జయంతి, వేసవి సెలవులను పురస్కరించుకుని నిడదవోలులో ఉంటున్న అక్క హేనా ఇంటికి వచ్చారు. గతంలో హర్ష కుటుంబం నిడదవోలులోనే ఉండేవారు. సోమవారం మధ్యాహ్నం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలో పాల్గొని భోజనం చేసి వచ్చాడని హర్ష చిన్నాన్న మల్లవరపు వినోద్ చెబుతున్నారు. హర్ష తండ్రి మృతి చెంది మూడు నెలలు అయ్యింది. ఇంతలోనే సెలవులకని వచ్చి హర్ష గల్లంతు కావడం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. బయటికి వెళ్లి గంటలో వచ్చేస్తానని చెప్పాడని, ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని కన్నీటి పర్యంతం అయ్యారు.
పదో తరగతి పరీక్ష రాశాడు
మృతుడు మర్తి ప్రకాష్‌కుమార్ పదో తరగతి పూర్తి చేశారు. తండ్రి కిషోర్ ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తల్లి కువైట్‌లో ఉంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రకాష్‌కుమార్‌కి సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. కుమారుడు గల్లంతైన విషయం విదేశాల్లో ఉన్న తల్లి తెలుసుకుని తల్లడిల్లిపోతోంది.
ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి
గోదావరి నదిలో స్నానానికి దిగి యువకులు గల్లంతు కావడం బాధాకరం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గజ ఈతగాళ్లతో పాటు కాకినాడ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నామన్నారు. మత్య్సశాఖ, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో నదిలో యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారని చెప్పారు. ఇటీవల తాడిపూడిలో ఐదుగురు మృతి చెందడం,ఇప్పుడు ఈ ప్రమాదం బాధాకరం అన్నారు.

సరదా తెచ్చిన తంటా

సరదా తెచ్చిన తంటా

సరదా తెచ్చిన తంటా