
కాలువల మూసివేత సాధ్యమేనా?
డెల్టా ప్రధాన పంట కాలువలకు డిసెంబరు 7వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి విడుద ఇలా (టీఎంసీ)లలో...:
తూర్పు డెల్టా : 34.293
మధ్య డెల్టా : 20.291
పశ్చిమ డెల్టా : 56.478
మొత్తం : 111.382
● ఏప్రిల్ 15న మూసివేయడానికి
సన్నాహాలు
● ఇప్పటికీ శివారులకు సాగు నీటి అవసరం
● మరో ఐదు రోజులు పెంచాలని
కోరుతున్న వ్యవసాయశాఖ
● తాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా
పెంచాల్సిన గడువు
● రబీలో ఇప్పటి వరకు 111 టీఎంసీల
వినియోగం
● అయినా శివారుల్లో కీలక సమయంలో సాగునీటి ఎద్దడి
● నీటి యాజమాన్యంలో అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువల మూసివేతకు సాగునీటి పారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి మూడు ప్రధాన పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద హెడ్ స్లూయిజ్ గేట్లు మూసివేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీకి మరో ఐదు రోజులు నీరందించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతుండడంతో ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నీటి యాజమాన్యంలో సమన్వయలోపం
గోదావరి మూడు డెల్టాల పరిధిలో సుమారు 8.86 లక్షల ఎకరాల్లో వరి, ఇతర వ్యవసాయ పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్‌లో సాగుకు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 90 టీఎంసీలు ఉంటే సరిపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలో 4.80 లక్షల ఎకరాలలో వరి ఆయకట్టు ఉంది. దీనిలో సుమారు 4.20 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని అంచనా. పంట కాలువలు, చానల్స్ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ఆరంభంలో షార్ట్ క్లోజర్ పనులు చేస్తామని చెప్పారు కాని పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయలేదు. ఇది సాగునీటి సరఫరాకు ప్రధాన అవరోధంగా మారింది. దీనికితోడు నీటి యాజమాన్య విషయంలో అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డెల్టాకు 111 టీఎంసీలు
గోదావరి డెల్టాలో డిసెంబరు 7వ తేదీన మొదలైన రబీ షెడ్యూలులో ఏప్రిల్ 15 వరకు 111.355 టీఎంసీల నీటిని పంట కాలువలకు విడుదల చేశారు. దీనిలో తూర్పు డెల్టాకు 34.293, మధ్యడెల్టాకు 20.291, పశ్చిమ డెల్టాకు 56.478 టీఎంసీల చొప్పున అందించారు. రబీ సాగు, ఇతర అవసరాలకు వాస్తవంగా 90 టీఎంసీల అయితే పంటకు సరిపోతోంది. కాని అంత కన్నా అధికంగా నీరు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అయినా డెల్టా శివారులు, మెరక ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్, మధ్య డెల్టా అనే తేడా లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో ఇంచుమించు అన్ని మండలాల్లో ఏదో ఒక సందర్భంలో రైతులు నీరందక ఇబ్బంది పడ్డారు. తూర్పు డెల్టాలో కరప, కాజులూరు, తాళ్లరేవు, కె.గంగవరం, పీబీసీలో కొత్తపల్లి, మధ్య డెల్టా పరిధిలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం మండలాల్లో చేలు నెరలు తీసిన విషయం తెలిసిందే. వంట కాలువలకు విడుదల చేసిన నీరుతోపాటు డెల్టాలో పలుచోట్ల వ్యవసాయ విద్యుత్ మోటార్లతో చేలకు పెద్ద ఎత్తున నీరందించారు. ఇలా కనీసం ఒకటిన్నర టీఎంసీ, మురుగునీటి కాలువలపై క్రాస్‌బాండ్‌లు వేయడం ద్వారా కూడా నీటిని చేలకు మళ్లించడం ద్వారా మరో ఐదు టీఎంసీల వరకు నీటిని చేలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. ఇలా చూస్తే మొత్తం 117.50 టీఎంసీల నీటిని రబీ కాలంలో అందించినట్టు. అయినప్పటికీ తూర్పు, మధ్య డెల్టాలోని ఏకంగా పదకొండు శివారు మండలాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందంటే అది ముమ్మాటికీ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యమేనని రైతులు చెబుతున్నారు. నీటి ఎద్దడి ప్రభావంతో రైతులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంట బోదెలు, చానల్స్ నుంచి, డ్రెయిన్ల నుంచి మోటార్లతో నీరు తోడకం వల్ల ఎకరాకు అదనంగా రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఎద్దడికి గురైన ప్రాంతంలో దిగుబడి పడిపోవడం కూడా రైతులకు లాభాలు మాట అటుంచి పెట్టుబడులు వస్తే గొప్ప అన్నట్టుగా మారింది.
నేడు నిర్ణయం
డెల్టాలో రబీ సాగుకు మరో ఐదు రోజుల పాటు గడువు పెంచే అవకాశముంది. దీనిపై మంగళవారం ధవళేశ్వరంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 15వ తేదీ అంటే మంగళవారం అర్ధరాత్రి తరువాత బ్యారేజీ గేట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కోనసీమ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బోసుబాబు అభ్యర్థించడంతో ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ గోపినాఽథ్, గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజినీరు (సీఈ) దీనిపై మంగళవారం తుది నిర్ణ యం తీసుకోనున్నారు. వ్యవసాయశాఖతోపాటు తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపాల్సి ఉన్నందున ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కూడా గడువు పెంచాల్సిందిగా కోరుతున్నారు. ఈ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు కాలువల మూసివేత గడువు పెంచే అవకాశముందని సమాచారం.