
ఉత్తరకాండ వాల్మీకి రామాయణాంతర్గతమే..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఉత్తరకాండ నిస్సందేహంగా వాల్మీకి మహర్షి రామాయణాంతర్గతమే. ఈ వివాదం ప్రాచీన కాలంలో లేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై నగరంలోని హిందూ సమాజంలో మంగళవారం జరిగిన తొలి రోజు ప్రవచనంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర కాండపై వివాదం ఇటీవల తలెత్తిందని అన్నారు. ఉత్తర భారతంలో ఈ వివాదం లేదని, రామాయణంపై వెలువడిన అన్ని భాష్యాల్లోనూ ఉత్తరకాండలోని అంశాలను పేర్కొన్నారని చెప్పారు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకగా మహర్షి వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణం రచించారని, ఉత్తరకాండ లేదనుకుంటే, గాయత్రీ మంత్రంలో మూడక్షరాలు లేవనుకోవాలని అన్నారు. షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్టు బాలకాండలోనే వాల్మీకి మహర్షి పేర్కొన్నారని, అప్పటి వరకూ జరిగిన కథను షట్కాండలలో, జరగబోయే కథను ఉత్తరకాండలో రచించారని వివరించారు. తపో మార్గంలో, యోగదృష్టితో మహర్షి రచించిన రామాయణంలో ఎటువంటి తప్పులూ ఉండవన్నది బ్రహ్మవాక్కు అని చెప్పారు. బాలకాండ 3వ సర్గలో సీతాపరిత్యాగాన్ని ఉత్తరకాండలో రచించినట్టు వాల్మీకి మహర్షి పేర్కొన్నారని తెలిపారు. ‘యుద్ధకాండ వరకూ పారాయణ చేస్తే, సంపూర్ణ రామాయణ ఫలితం లభిస్తుందని అంటే, ఉత్తరకాండ లేదని అర్థం కాదు. సుందరకాండ పారాయణ చేస్తే పూర్తి రామాయణ పారాయణ ఫలితం లభిస్తుందని అంటే మిగతా కాండలు, కథ లేవని అర్థం కాదు’ అని ఆయనన్నారు. ఆద్యంతం ఛలోక్తులతో సామవేదం ప్రవచనం కొనసాగింది. ‘రచన ఎంత అసంప్రదాయమైనది, సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నదీ అయితే అంత గొప్ప పురస్కారం లభించవచ్చు. ఇటువంటి పురస్కారం భగవంతుని తిరస్కారానికి గురి కాక తప్పదు’ అని అన్నారు. ‘నాకు ఇష్టమైనవి, నేను నమ్మినవి ప్రమాణాలు, నేను నమ్మనివి ప్రక్షిప్తాలు అనుకునే మూర్ఖాగ్రేసరులు కొందరున్నారు’ అంటూ ఛలోక్తులు విసిరారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలుకుతూ, పూర్వ రామాయణమైనా, ఉత్తర రామాయణమైనా రాముని చరిత్రేనని అన్నారు. ఈ ప్రవచనాలు వినడం నగరవాసులు చేసుకున్న సుకృతమని అన్నారు.