
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని వెంకటనగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రత్తిపాడు పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు నందవరపు వీరబాబు (20), నందవరపు కృష్ణ బైక్‌పై కొత్తూరు (యూజే పురం) వెళ్లి వివాహ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో వెంకటనగరం చెరువు సమీపంలోని కోళ్ల ఫారం వద్ద యూజే పురం వైపు వెళ్తున్న బోర్ వెల్ వాహనం భైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నందవరపు వీరబాబు (20) తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కుర్చున్న నందవరపు కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కృష్ణను 108 వాహనంలో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన అన్నదమ్ములు నందవరపు రాము, బైరాగి కుమారులు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలంలో రోడ్డు బైఠాయించి ఆందోళన చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నందవరపు రాము దంపతుల కుమారుడు వీరబాబు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో నిత్యం చలాకీగా తిరిగే విరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చింతలూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి