
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): పార్లమెంటు ఉభయ సభల్లోనూ వక్ఫ్ చట్టానికి అనుకూలంగా ఓటు వేసి ముస్లింలను కోలుకోలేని విధంగా కూటమి ప్రజాప్రతినిధులు దెబ్బ కొట్టారని వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ ఆరిఫ్ అన్నారు. తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యను ముస్లింలు, లౌకికవాదులు తీవ్రంగా వ్యతిరేస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో ఓటు వేయడం ద్వారా ముస్లింలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటానన్న మాటను వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిలబెట్టుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ఈ బిల్లుకు టీడీపీ నాయకులు అనుకూలంగా ఓటు వేశారని, పైగా వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై ఆందోళనలు చేస్తున్న ముస్లింలకు అండగా నిలబడిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల మనోభీష్టాన్ని గౌరవించి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని ఆరిఫ్ డిమాండ్ చేశారు.
డీఈడీ ఫీజు చెల్లింపునకు
23 వరకూ గడువు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 23తో ముగుస్తుందన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో 28వ తేదీలోగా చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.250, ప్రైవేటు విద్యార్థులు ఒక సబ్జెక్టుకు రూ.125, రెండు సబ్జెక్టులకు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.175, నాలుగు సబ్జెక్టులకు రూ.250 చొప్పున చెల్లించాలని వివరించారు.