
సీతమ్మ ధర్మనిష్ఠ అపూర్వం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. ధర్మనిష్ఠలో ఆయనకు సరితూగేది సీతమ్మ. రాముడిపై లోకాపవాదు తొలగించడంలో నాకూ బాధ్యత ఉంది’ అని సీతమ్మ లక్ష్మణునితో చెబుతుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఉత్తరకాండపై ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన స్థానిక టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఆయన ఐదో రోజు ప్రవచనాన్ని శనివారం కొనసాగించారు. రాముని ఆదేశంపై తమసా నదీ తీరాన వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో తనను విడిచి వెళ్తున్న లక్ష్మణుని ద్వారా రామునికి సీత సందేశం పంపుతుందని, తనపై అపవాదు వేసిన ప్రజల పట్ల సోదరభావంతో మెలగవలసిందిగా కోరుతుందని చెప్పారు. ‘రావణ వధానంతరం సీతాదేవితో హనుమ.. నిన్ను హింసించిన రాక్షస సీ్త్రలను తుదముట్టిస్తానని పలికినప్పుడు సీతమ్మ వారిస్తుంది. వారు రాజశాసనాన్ని అమలు చేశారని, వారిని హింసించరాదని హనుమతో చెబుతుంది’ అని అన్నారు. సీతమ్మ ధర్మజ్ఞురాలని, ఆమె ధర్మనిష్ఠ అపూర్వమని చెప్పారు. గర్భవతి అయిన సీ్త్రని పుట్టింటికి పంపించినట్లు, రాముడు సీతాదేవిని అత్యంత సురక్షితమైన వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపాడని, భర్తృ, రాజధర్మాల మధ్య అద్భుతమైన సమన్వయం చూపాడని వివరించారు. ‘సుమంత్రునితో తిరిగి వస్తూ లక్ష్మణుడు శోకవివశుడవుతాడు. 14 సంవత్సరాల వనవాసం, తరువాత సీతావియోగం తలుచుకుని విధి అనుల్లంఘ్యనీయమని బాధ పడతాడు. సీతాదేవిని మాత్రమే కాదు, భవిష్యత్తులో నిన్ను సైతం రాముడు పరిత్యజిస్తాడని నేను విన్నాను అని సుమంత్రుడు చెబుతాడు’ అని చెప్పారు.
దేవాసురుల సంగ్రామం జరిగినప్పుడు భృగు మహర్షి పత్ని అసురులకు ఆశ్రయమిస్తుందని, మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శిరస్సు ఖండించగా.. భృగు మహర్షి క్రోధంతో ‘నీవు నరునిగా జన్మించి భార్యావియోగాన్ని అనుభవిస్తావ’ంటూ విష్ణువును శపిస్తాడని చెప్పారు. దశరథునికి దుర్వాస మహర్షి ఈ వృత్తాంతం చెబుతూంటే తాను విన్నానని, ఇది రహస్యమని లక్ష్మణునికి సుమంత్రుడు చెబుతాడని సామవేదం అన్నారు. సీతాభట్టారికా స్తోత్రంతో భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు.