
మోటారు సైకిళ్లు ఢీకొని ఒకరి మృతి
మరో ఇద్దరికి గాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216పై పటవల పైడా కళాశాల సమీపంలో రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో మహమ్మద్ అలీషా(44) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కాకినాడకు చెందిన మొహమ్మద్ అలీషా, మహమ్మద్ జహంగీర్ కలిసి ద్విచక్రవాహనంపై ముమ్మిడివరంలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తుండగా, పైడా కళాశాల సమీపంలో ఎదురుగా వెళుతున్న మరొక బైక్‌ను ఢీకొనడంతో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్నవారు కింద పడిపోయారు. ఈ ఘటనలో మహమ్మద్ అలీషా తలకు తీవ్రగాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జహంగీర్‌తోపాటు మరొక బైక్‌పై వెళుతూ వెనుక కుర్చున్న మహిళకు కూడా గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. వీరిని 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
ఖండవల్లి రోడ్డు ప్రమాదంలో ఒకరు..
ఇద్దరికి తీవ్ర గాయాలు
పెరవలి: జాతీయ రహదారిపై పెరవలి మండలం ఖండవల్లి సెంటర్‌లో ఆదివారం రాత్రి కారు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు యువకులు తీవ్ర గాయాలు పాలయ్యారు. పెరవలి ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన నేకూరి రాజ్ కిరణ్, ఈతకోట శ్రీనివాస్, కొనుకు సతీష్ కుమార్ (23) మోటార్ సైకిల్‌పై ఖండవల్లి వస్తుండగా సెంటర్‌లో రోడ్డు దాటే క్రమంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న సతీష్‌కుమార్ మోటార్ సైకిల్ పైనుంచి ఎగిరి 10మీటర్ల దూరంలో పడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒక యువకుడికి చేయి జారిపోవడంతో అతనిని మైరుగైన వైద్యం కోసం మంగళగిరి పంపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యుదాఘాతంతో...
తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం పంచాయతీలో పెంకే దుర్గా శ్యాంప్రసాద్(35) విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యన్నారాయణ తెలిపిన వివరాల మేరకు జి.వేమవరంలోని సానబోయిన ఆదినారాయణకి చెందిన మల్లితోటలో శ్యాంప్రసాద్ కొంతకాలంగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మల్లితోటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటారు వేసే క్రమంలో విద్యుత్ వైరు స్విచ్‌బోర్డులో పెడుతుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్యాంప్రసాద్ మృతదేహం వద్ద భార్య నందిని కుటుంబ సభ్యులు బోరున విలపించడం అక్కడివారిని కలిచివేసింది. నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యన్నారాయణ తెలిపారు.

మోటారు సైకిళ్లు ఢీకొని ఒకరి మృతి