ధరణీ రక్షతి రక్షితః | - | Sakshi
Sakshi News home page

ధరణీ రక్షతి రక్షితః

Apr 22 2025 12:17 AM | Updated on Apr 22 2025 12:17 AM

ధరణీ

ధరణీ రక్షతి రక్షితః

కపిలేశ్వరపురం: సకల జీవరాశులకూ ఆధారమైన ఈ ధరిత్రి ప్రమాదంలో ఉంది. కోటాను కోట్ల జీవులు నిన్న బాగా బతికాయి. నేడు ప్రమాదంలో పడ్డాయి. రేపు... ? ఈ ప్రశ్నకు సమాధానం కచ్చితంగా మనిషే చెప్పాలి. తన అవసరాలు కోసం అనివార్యమంటూ విచ్చలవిడి వినియోగంతో ధరిత్రిని ప్రమాదంలోకి నెట్టాడు. అందులోనే తాను నలిగిపోతూ జీవకోటి ఉనికినే ప్రశ్నార్థకం చేశాడు. ఈ ధరణిని మనం కాపాడితే అదే మనలను రక్షిస్తుందన్న విషయాన్ని మరచిపోతున్నాడు. ఆహ్లాదకరమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సైతం పర్యావరణ పరంగా ముప్పు పొంచి ఉంది. నేడు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఈ కథనం...

నేపథ్యమిదీ...

84 లక్షల జీవరాశులున్న భూమిపై మానవులు సాగిస్తున్న విధ్వంసాన్ని ఆపాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి శ్రద్ధ వహించింది. ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకొంటూ ఆ సంస్థ సూచనలపై చర్చలు, సమావేశాలు, సమీక్షలు జరుపుతున్నారు. 2023లో ఎర్త్‌ డే థీమ్‌గా ‘మన గ్రహం కోసం ఖర్చు చేయండి’ అనే నిదానంతోనూ, 2024లో ప్లానెట్‌ వెర్సస్‌ ప్లాస్టిక్‌ అనే నినాదంతో కృషి చేసింది. ఈ ఏడాది ‘అవర్‌ పవర్‌, అవర్‌ ప్లానెట్‌’ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది.

పోగుపడుతున్న చెత్తతో పర్యావరణానికి విఘాతం

నాలుగు లక్షల జనాభా కలిగిన జిల్లా కేంద్రమైన కాకినాడలో రోజుకు 140 టన్నులు, రాజమహేంద్రవరంలో 145 టన్నులు, అమలాపురంలో 38 టన్నుల చెత్త తయారవుతోంది. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో రోజుకు సుమారుగా 28 టన్నులు చొప్పున, ఏలేశ్వరం నగర పంచాయతీలో 8 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగుపడుతోంది. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ వస్తువులు ప్రమాదకరం. పాలిథీన్‌ సంచులు, ఇతర వస్తువుల రీసైక్లింగ్‌ చేసేందుకు వీలుపడదు. ప్లాస్టిక్‌ బాటిళ్లు 450 ఏళ్లు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు వెయ్యి సంవత్సరాలు వరకూ భూమిలో కరగవు. ప్రపంచంలో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్‌కు ప్రభావితమై అంతరించే దశలో ఉన్నాయి. శరీరంలోకి వెళ్లిన సూక్ష్మ స్థాయిలో ఉండే ప్లాస్టిక్‌ పాలిమర్‌ అవశేషాల వల్ల క్యాన్సర్‌, చర్మ , హార్మోన్లకు సంబంధించిన వ్యాధులొస్తాయి. ప్లాస్టిక్‌ పుల్లలు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ట్రేలు, ఫోర్కులు, చెంచాలు, ప్లాస్టిక్‌ స్వీట్‌ బాక్సులు, బడ్స్‌, బెలూన్లు, క్యాండీ, కత్తులు, అలంకరణకు వాడే థర్మోకోల్‌, ఆహ్వాన పత్రాలు, సిగరెట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే వీవీసీ బ్యానర్లు నిషేధ జాబితాలో వున్నాయి.

ప్రమాదభరితంగా పారిశ్రామిక ఉద్గారాలు

తూర్పుగోదావరి జిల్లాలో 38 మధ్య తరహా పరిశ్రమలు, కాకినాడలో 62, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏడు మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వాటికి తోడు అనేక చోట్ల భారీ పరిశ్రమలున్నాయి. హేచరీలు, పరిశ్రమలు విడుదల చేసే విషపూరితమైన రసాయనాలు సముద్రంలోకి చేరి గోదావరి, సముద్ర జలాలను కలుషితం చేస్తున్నాయి.

అడుగంటుతున్న భూగర్భజలాలు

అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆక్వా సాగుతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తాగునీరు కలుషితమైపోతోంది. మెట్ట ప్రాంతాల్లో సాగు నీరందక ఎత్తిపోతల పథకాలతో నీరందిస్తున్నారు. గోదావరి తీరాన ఉన్నప్పటికీ తాగునీటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

కాలుష్యానికి బలవుతున్న జీవరాశులు...

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు తీవ్రత ఎక్కువ. కాకినాడ జిల్లాలో జనవరి నెలలో 220 సముద్ర తాబేళ్లు మృతి చెందాయి. కొత్తపల్లి మండల పరిధిలోని తీర ప్రాంతంలో సముద్ర జలాలు కలుషితం కారణంగా సముద్ర తాబేళ్లు తరచూ మృత్యువాత పడుతూ ఒడ్డుకు చేరుకుంటున్నాయి. గతేడాది కోనసీమ జిల్లాలో సుమారు 984 ఆలివ్‌వ్‌ రిడ్లే తాబేళ్లు 1,02,740 గుడ్లను పెట్టాయి. వాటి నుంచి వచ్చిన 71,388 పిల్లలను సముద్రంలో వదిలారు.

ఆక్వాతో అన్నీ సమస్యలే...

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పునీటి చెరువుల్లో 20,110 ఎకరాల్లోనూ, మంచినీటి చెరువుల్లో 44,199 ఎకరాల్లోనూ ఆక్వా సాగు జరుగుతోంది. 201 రోయ్యల హేచరీలు, 13 ప్రాసెసింగ్‌ యూనిట్లు, నాలుగు ఫీడ్‌ మిల్లులు ఉన్నాయి. వీటి నుంచి పర్యావరణ సమస్యలు రావడమే కాకుండా మూడు పంటలు పండే భూములు ఆక్వా చెరువులుగా మారిపోతున్నాయి. ఆక్వా సాగుతో భూమి సారం దెబ్బతింటోంది.

పర్యావరణ హితమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైవిధ్య భరితమైంది. దేశం నలుమూలలకూ మొక్కలను సరఫరా చేసే కర్మాగారంగా కడియం నర్సరీలు నడుస్తున్నాయి. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన సుమారు 400 కుటుంబాలు 40 ఏళ్లుగా పలు రాష్ట్రాల్లో నర్సరీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో వరి సాగుతో ఆహార ఉత్పత్తి చేస్తున్నారు. 161 కి.మీ. సాగరతీరం, 297 కి.మీ. గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉంది. కాకినాడ సమీప కోరంగి మడ అడవులు ప్రకృతి వైపరీత్యాల నుంచి జిల్లాను కాపాడుతున్నాయి. మడ అడవుల్లో 272 రకాల పక్షి జాతులు, 610 రకాల మత్స్య జాతులున్నాయి. గోదావరి సముద్ర కలిసే ప్రాంతంలో 300 రకాల చేపలుండటమే కాకుండా ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తికి నిలయం. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని చిత్తడి నేలలు ఆహార క్షేత్రాలు కావడంతో శీతాకాలంలో జొన్నాడకు వందల సంఖ్యలో సైబీరియా నుంచి 1,600 కిలోమీటర్లు ప్రయాణించి బార్‌ హెడెడ్‌ గుస్‌గా పిలిచే వలస బాతులు సంచరిస్తుంటాయి. ఆటుపోట్లు, పౌర్ణమి సమయంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆలివ్‌రిడ్లే గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి.

భూరక్షణపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

ప్రతిఘటిస్తున్న ప్రజలు

నేడు ధరిత్రీ దినోత్సవం

వైఎస్సార్‌ సీపీ హయాంలో ధరిత్రి రక్షణ

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ధరిత్రీ రక్షణకు విశేష కృషి చేసింది. 2022 జూలై 1 ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చింది. ఫలితంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2020లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 51వ ర్యాంకును సాధించింది. 2021లో 41, 2022లో 97, 2023లో 59వ ర్యాంకులను పొందింది. మండపేట తదితర పురపాలక సంఘాలు సైతం ధరిత్రీ రక్షణలో గుర్తింపు పొందాయి.

నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

ధరిత్రీ పరిరక్షణ పట్ల కూటమి సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉప్పాడ సముద్ర కోత నివారణకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా పరిశీలన జరిపి సుమారు రూ.2వేల కోట్లతో కోత నివారణతో పాటు, తీరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతానంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన మాట నీటిమూటయ్యింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పచ్చని పంట పొలాలను ఆక్వా జోన్‌గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించారు. పలు గ్రామ సభల్లో ఆక్వా జోన్‌ మాకొద్దంటూ తీర్మానాలు చేశారు.

విఘాతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యావరణ విఘాతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆక్వా సాగుతో ముప్పు వాటిల్లుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఆక్వా జోన్లు ఏర్పాటు చేస్తామంటూ గ్రామసభలను నిర్వహించడం ప్రజా వ్యతిరేకమే. పర్యావరణ పరిరక్షణ చట్టాలను నిర్వీర్యం చేసే పాలనపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.

– కేవీవీ సత్యనారాయణ, కన్వీనర్‌,

రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ సబ్‌ కమిటీ, జనవిజ్ఞాన వేదిక అనుబంధం, యానాం

ధరణీ రక్షతి రక్షితః 1
1/1

ధరణీ రక్షతి రక్షితః

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement