
‘వర్జీనియా’ రైతులకు
ఉపశమనం
● మూడేళ్లకు లైసెన్స్ పునరుద్ధరణ
● వచ్చే పంట కాలం నుంచి అమలు
● 83,500 మందికి లబ్ధి
● కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ
గెజిట్ ప్రచురణ
దేవరపల్లి: వర్జీనియా పొగాకు రైతులకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీపి కబురు చెప్పింది. పొగాకు సాగు చేయాలంటే రైతు పేరిట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యారన్ నిర్వహణకు పొగాకు బోర్డు నుంచి లైసెన్స్ తీసుకోవలసి ఉంది. ఏటా పంట వేయడానికి ముందు అక్టోబర్, నవంబర్ నెలల్లో పొగాకు బోర్డు కార్యాలయలో వీటిని పునరుద్ధరించుకోవలసి ఉంది. దీని నిమిత్తం రైతులు బోర్డు నిర్ణయించిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు భారంగా మారిన ఈ విధానాన్ని రద్దు చేయాలని, మూడేళ్లకోసారి పునరుద్ధరించుకునేలా అవకాశం ఇవ్వాలని రైతు సంఘాలు చాలా కాలంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
దీనిని పరిగణనలోకి తీసుకుని, మూడేళ్ల వరకూ చెల్లుబాటయ్యేలా ఈ నెల 22న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గెజిట్ ప్రచురించిందని పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ (రాజమహేంద్రవరం) జీఎల్‌కే ప్రసాద్ శుక్రవారం తెలిపారు. మన రాష్ట్రంలో 2025–26 పంట కాలం నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనివలన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యారన్ నిర్వహణ లైసెన్స్ పునరుద్ధరణ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందని వివరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి అందనున్నాయని తెలిపారు. ఈ సవవరణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని దాదాపు 91 వేల బ్యారన్లకు చెందిన 83,500 మంది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. రాజమహేంద్రవరం రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 14,861 బ్యారన్లకు సంబంధించిన 12,861 మంది రైతులకు దీని ద్వారా ఉపశమనం కలగనుంది.