
ప్రభుత్వం హామీలు అమలుచేయాలి
అమలాపురం టౌన్: మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయా లని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు, సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో పోరాడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం సాయంత్రం జరిగిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూని యన్ అనుబంధ సంఘం ఏఐటీయూసీ జిల్లా శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉండవల్లి గోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత కశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాల కోసం వచ్చే నెల ఐదున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు సుబ్బారాయుడు ప్రకటించారు. ప్రతి మున్సిపాలిటీ వద్ద పారిశుధ్య కార్మికులు నిరసనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరూతూ మేడే రోజున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్, జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు మాట్లాడుతూ మేడేను అన్ని వర్గాల కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల శ్రీనివాసరావు 16 డిమాండ్లతో కూడిన అంశాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ డిమాండ్లపై సమావేశం చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్లను నెరవేర్చాలని తీర్మానం చేసింది. కార్మిక నాయకులు బుంగా కుమార్, రాయుడు సుబ్బలక్ష్మి ప్రసంగించారు. సమావేశం ముగిశాక స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మే 5న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టబోయే ఆందోళనలు జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక నాయకులు కొద్ది సేపు ప్రదర్శన నిర్వహించారు.
● ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్
● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు