![Pakistan Hits Floods Along With Political Crisis - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/2/Untitled-1.jpg.webp?itok=9xrCd0ve)
కనివిని ఎరుగని కష్టం ఎదురైనప్పుడు కన్నీటిని తుడిచే సాంత్వన కావాలి. దశాబ్ది కాలం పైగా ఎరుగని భారీ వరదలు... దేశంలోని 150 జిల్లాల్లో 110 జిల్లాలను ముంచెత్తిన కష్టం... దేశ భూభాగంలో మూడోవంతు ప్రాంతంపై, 3.3 కోట్ల మందిపై ప్రభావం... దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒక బాధితుడు... పదకొండు వందల మందికి పైగా మృతులు. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న కష్టానికి ఈ లెక్కలే సాక్ష్యం. ఇన్ని ఇక్కట్లతో ఆ దేశం ఆపన్న హస్తం కోసం చూస్తోంది. దాయాదికి సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ వస్తున్న వార్తలపై అనుకూల, ప్రతికూల వైఖరులతో ఇప్పుడు దేశంలో చర్చ రేగుతోంది.
ఐరోపా, చైనా సహా ప్రపంచంలో పలు ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రతలు, దుర్భిక్షంతో బాధపడుతుంటే, పాక్ వరదల్లో చిక్కుకుంది. పర్యావరణ విపరిణామాలకు ఇది నిదర్శనం. ఎండా కాలంలోని అత్యధిక ఉష్ణోగ్రతలతో హిమాలయాలు సహా వివిధ పర్వతశ్రేణుల్లో హిమానీనదాలు కరిగి, మే నాటికే పాక్‌లో నదులన్నీ నిండుకుండలయ్యాయి. ఆపై వానాకాలంలో ఊహకందని రీతిలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం రావడంతో పరిస్థితి చేయిదాటింది. జూలై నుంచి పెరుగుతున్న వరదలతో స్థానికులకు కన్నీళ్ళే మిగిలాయి. భూతాపోన్నతికి తక్కువ కారణమైనా, ఇంతటి పర్యావరణ విపరిణామానికి ఇస్లామాబాద్ లోనవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కర్బన ఉద్గార దేశాలకు తమ తప్పు లేని బాధిత దేశాలకు నిధులివ్వాల్సిన నైతిక బాధ్యత ఉంది.
పాకిస్తాన్‌కు ఇది పచ్చి గడ్డుకాలం. ఈ ఏడాది మొదట్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనమయ్యాక పీఠమెక్కిన షెహబాజ్ షరీఫ్ సర్కారు ఇంకా నిలదొక్కుకోనే లేదు. ఎన్నికలు జరపాలని ఇమ్రాన్ వీధికెక్కారు. అంతకంతకూ రాజకీయ అనిశ్చితి పెరుగుతోంది. మరోపక్క ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరింది. దిగుమతుల సామర్థ్యం అడుగంటింది. ఈ పరిస్థితుల్లో ప్రతి చిన్న సాయం విలువైనదే. అసహజ వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టిన పాకిస్తాన్‌కు సాయం అందించాల్సిందిగా ఐరాస సైతం అభ్యర్థించింది. అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, టర్కీ సహా పలు దేశాలు ఇప్పటికే సహాయం అందిస్తున్నాయి. నిజానికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ దీర్ఘకాలంగా ఆర్థిక ఉద్దీపన కోసం నిరీక్షిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎట్టకేలకు 110 కోట్ల డాలర్ల ఉద్దీపనకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితుల్లో సోదర భారత్ సైతం పెద్ద మనసుతో వరద బాధితులకు సాయం చేయడమే సరైన చర్య.
ఇంతవరకూ నోరు విడిచి భారత సాయం కోరని పాక్ పాలకులు సైతం ఒక అడుగు ముందుకు వేయాలి. భారత్ నుంచి కూరగాయల దిగుమతికి ఆలోచిస్తామని ఒకసారి, భారత భూ సరిహద్దు ద్వారా ఆహారం పంపడానికి అనుమతించాలన్న అంతర్జాతీయ సంస్థల అభ్యర్థనపై సంకీర్ణ భాగస్వాములతో, కీలకమైనవారితో చర్చించి నిర్ణయిస్తామని మరోసారి పాక్ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం అసంబద్ధం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ భౌగోళిక రాజకీయాలకే ప్రాధాన్య మిస్తే, అది అమానుషం. గతంలోనూ ఇలాగే ద్వైపాక్షిక, దౌత్య గందరగోళాలతో ఇరు దేశాల మధ్య సాయానికి గండిపడ్డ సందర్భాలున్నాయి. 2000ల తొలినాళ్ళలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. 2001లో భుజ్ భూకంపం వేళ మనకు పాక్ సాయం చేస్తే, 2005లో కశ్మీర్‌లో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భూకంపం వచ్చినప్పుడు నియంత్రణ రేఖ, వాఘా సరిహద్దులు దాటి మనం సరఫరాలు అందించాం. కానీ, 2008 నాటి 26/11 ముంబయ్ దాడుల తర్వాత ప్రకృతి వైపరీత్యాల వేళ సైతం పరస్పర సాయాలు బాగా తగ్గిపోయాయి. నిరుడు కరోనా రెండో వేవ్‌లో తమ దేశం గుండా ఆక్సిజన్ కారిడార్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ముందుకొచ్చినా, మన పాలకులు ఓకే చెప్పలేదు.
2010 నాటి వరదల వేళ 2.5 కోట్ల డాలర్ల మేర ఆర్థిక, వస్తు సాయం సహా గతంలో మనం అనేకసార్లు పాక్‌కు సాయం చేసినా, అది పాముకు పాలు పోసినట్టే అయిందని విమర్శకుల వాదన. అందులో కొంత నిజం లేకపోలేదు. అలాగే, కశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశాక పొరుగుదేశమే మనతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. అయితే గతాన్ని తవ్వుకొనే కన్నా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. దేశంలో అధిక భాగం వ్యవసాయ భూములు నీట మునగడంతో పాకిస్తాన్‌కు ఆహార కొరత, అలాగే ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా రాజకీయాలను పక్కనపెట్టి అమాయక ప్రజల కష్టాలను ఆలోచించాలి.
సామాన్య పాకిస్తానీయులకు ఆహార, ఆరోగ్య, తాత్కాలిక ఆవాసాల సాయం చేయడం వల్ల భారత్‌కూ లాభాలున్నాయి. సద్భావన పెరుగుతుంది. వ్యూహాత్మకంగా చూస్తే – పాక్‌లో చైనా చేప ట్టిన బీఆర్‌ఐ ప్రాజెక్టులు ఇరుకునపడ్డాయి. పాక్ సైతం అమెరికాతో సంబంధాలను మళ్ళీ మెరుగు పరుచుకోవాలని చూస్తోంది. పరిస్థితుల్ని సానుకూలంగా మలుచుకోవడానికి ఇదే సమయం. వరద సాయం ద్వారా దాయాదుల స్నేహానికి భారత్ ద్వారాలు తెరవాలి. నిరుడు ఆఫ్ఘన్‌కు 40 వేల మెట్రిక్ టన్నుల గోదుమలు పంపిన మనం పాక్‌కూ సాయం చేయాలి. పొరుగు వారు కొండంత కష్టంలో ఉన్నప్పుడు చూపాల్సిన మానవతకు మీనమేషాలు లెక్కించడం ధర్మం కాదు. అపకారికి సైతం ఉపకారం చేయాలనే సిద్ధాంతాన్ని నమ్మిన ధర్మభూమికి అసలే పాడి కాదు. దాయాదుల పోరులో దయనీయ ప్రజానీకం కష్టపడితే అది ప్రకృతి శాపం కాదు... పాలకుల పాపం!
Comments
Please login to add a commentAdd a comment