రాజవంశం అసలు ‘రంగు’ | Sakshi Ediotorial On Britain Monarchy | Sakshi
Sakshi News home page

రాజవంశం అసలు ‘రంగు’

Published Wed, Mar 10 2021 12:52 AM | Last Updated on Wed, Mar 10 2021 12:54 AM

Sakshi Ediotorial On Britain Monarchy

ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఒరవడినందించిన బ్రిటన్‌... ఫ్యూడల్‌ ధోరణులకు ప్రతీకగా వుండే రాచరిక వ్యవస్థను ఇప్పటికీ భద్రంగా పరిరక్షించుకుంటూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటుంది. రాజ కుటుంబమంటే ఆ దేశ పౌరుల్లో ఇప్పటికీ అంతో ఇంతో భక్తిప్రపత్తులుంటాయి. అక్కడ ఏం జరిగినా అది పెద్ద వార్తే. ఆ కుటుంబంలో చోటుచేసుకునే ఏ ఘటనైనా పతాకశీర్షికే. ఎందుకంటే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ఆ దేశాధినేత. కామన్వెల్త్‌ దేశాల్లోని చాలా దేశాలకు సైతం ఇప్పటికీ ఆమె అధిపతి. అలాగని ప్రభుత్వ వ్యవహారాల్లో ఆ కుటుంబం పాత్రేమీ వుండదు. వారిని సంప్రదించే వారూ వుండరు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన రాజకుటుంబం ప్రస్తుతం గత కాలపు అవశేషం మాత్రమే. ఇన్నాళ్లూ ఆ కుటుంబంలోని ప్రేమ పురాణాలు, కోపతాపాలు అందరిలోనూ ఆసక్తిని రేపాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఆ రాజకుటుంబంలోని వ్యక్తుల నేలబారు తనం బజారునపడింది. ఆ కుటుంబంలో తనకెదురైన వేధింపుల పర్యవసానంగా ఆత్మహత్య ఆలోచనలు సైతం తనను చుట్టుముట్టాయని రాజకుటుంబంలోని చిన్న కోడలు మేఘన్‌ ఒక టీవీ ఇంటర్వూ్యలో చెప్పడం బ్రిటన్‌లో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసూయ, ద్వేషం వగైరాలకు బ్రిటన్‌ రాజకుటుంబం సైతం మినహాయింపు కాదని గతంలో చాలాసార్లు రుజువైంది. కానీ ఇప్పుడు మేఘన్‌ అంతకన్నా దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడించారు. రాణి ఎలిజబెత్‌-2 తనతో బాగానే వ్యవహరించినా రాజకుటుంబంలోని ఇతరులు ఎప్పుడూ తనతో సక్రమంగా లేరని ఆమె చెప్పటం, ముఖ్యంగా తాను ఆఫ్రికన్‌-అమెరికన్‌ను గనుక తన రంగు గురించి, పుట్టబోయే బిడ్డ రంగు గురించి చర్చించుకోవటం... ఆ బిడ్డకు రాచరిక హోదా ఇవ్వాలా వద్దా అంటూ తర్కించుకోవటం తనను తీవ్రంగా కుంగదీశాయని ఆమె చెప్పటం సంచలనమైంది.

వాస్తవానికి రాజవంశంలో అంతర్లీనంగావుండే అహంభావ ధోరణి, వర్ణ వివక్ష ప్రపంచానికి తెలియనివేమీ కాదు. మేఘన్‌కు ముందు ఆ కుటుంబంలో ప్రేమ వివాహాలున్నాయి. కానీ ఏ ఒక్కరూ  శ్వేతజాతేతరుల్ని పెళ్లాడలేదు. అందుకే ప్రిన్స్‌ హ్యారీ మేఘన్‌ను వివాహం చేసుకోబోతున్న సంగతి వెల్లడైనప్పుడు అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విషయంలో వచ్చిన కలతల గురించి బ్రిటన్‌ టాబ్లాయిడ్‌లలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం తప్ప ఎవరూ తమకై తాము ధ్రువీకరించలేదు. అందుకే కొందరు ఆ కుటుంబం మారిందనుకున్నారు. కానీ అదంతా ఉత్త భ్రమగా తేలిపోయింది. మేఘన్‌ తమలో ఒకరిగా మారినా ఆ కుటుంబం దాన్ని జీర్ణించుకోలేక పోయిందని తాజాగా వెల్లడైన అంశాలు చెబుతున్నాయి. రాజకుటుంబం పట్ల సాధారణ పౌరుల్లో వుండే వినయవిధేయతలు, గౌరవప్రపత్తులకు తగినట్టు వారి వ్యవహార శైలి వుండటం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో వున్నాయి. హ్యారీ తల్లి లేడీ డయానా, తండ్రి ప్రిన్స్‌ చార్లెస్‌ల మధ్య కలతలు ఏర్పడినప్పుడు, వారు విడిపోయినప్పుడు అందరూ నోళ్లు నొక్కుకున్నారు. ఆదర్శప్రాయంగా వుండాల్సిన కుటుంబం ఇలా సమస్యల్లో చిక్కుకున్నదని నొచ్చుకున్నవారు కూడా వున్నారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఆ కుటుంబం మారిందని, కాలానుగుణంగా పద్ధతులు మార్చుకుందని భావించారు. అదంతా నిజంకాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. వర్తమానంలో జీవిస్తూ గతం చూరుపట్టుకు వేలాడేవారు ఎంతటి ఉన్నత స్థానాల్లో వున్నా భంగపాటు తప్పదని చరిత్ర రుజువు చేసింది. రాజకుటుంబ సభ్యుల్లో ఎవరూ దీన్ని గ్రహించిన దాఖలాలు లేవు. తమకు ఇకపై రాచరిక హోదాలు వద్దని హ్యారీ, మేఘన్‌ దంపతులు ప్రకటించినప్పుడే ఆ కుటుంబంలో ఏదో అవుతున్నదని అందరూ అనుకున్నారు. ఏం జరిగివుంటుందన్న ఊహాగానాలు అప్పటినుంచీ జోరుగానే సాగుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా నామమాత్రావశిష్టంగా మారినా... బ్రిటన్‌ రాజకుటుంబానికి వుండే సౌకర్యాలు, ఆ హోదా వల్ల లభించే గౌరవ ప్రతిష్టలూ సామాన్యమైనవి కాదు. వాటిని వదులు కోవటం చిన్న విషయం కాదు.

ప్రజాస్వామ్య భావజాలం శరవేగంతో ప్రపంచమంతా విస్తరించడంతో రాజులు పోయారు... రాజరికాలూ అంతరించాయి. కానీ వాటి తాలూకు అవశేషాలు మానవాళిని ఇంకా పట్టిపీడిస్తున్నాయి. మన దేశంలో వున్న కుల వ్యవస్థలాంటిదే పాశ్చాత్య దేశాల్లో అడుగడుగునా కనబడే వర్ణ వివక్ష. ఇక్కడ అణగారిన వర్గాలవారు జీవితపర్యంతమూ నిత్యం ఎదుర్కొనవలసి వచ్చే కుల వివక్షవంటిది అక్కడ జాత్యహంకారం రూపంలో నల్లజాతివారిని బాధిస్తుంటుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుకునే రోహిత్‌ వేముల, పాయల్‌ తాడ్వీ వంటివారు ఈ వివక్ష భరించలేక ప్రాణాలు పోగొట్టుకుంటే... అక్కడ రాజ కుటుంబీకుణ్ణి పెళ్లాడిన మేఘన్‌ సైతం అదే కోవలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. వివక్ష ఒక మనిషిని మానసికంగా ఎంత కుంగ దీస్తుందో, ఎలాంటి దుష్ఫలితాలకు దారితీస్తుందో మేఘన్‌ ఉదంతం మరోసారి చాటింది. ప్రేమాభిమానాలు అడుగంటి, రంగు తప్ప మరేమీ ముఖ్యం కాదనుకుంటున్న రాజకుటుంబం నుంచి నిష్క్రమించి ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ దంపతులు ఆ కుటుంబానికి  ఒకరకంగా మేలు చేశారని చెప్పాలి. రాచరిక దర్పం కనీసం నామమాత్రంగానైనా మిగలాలంటే ముందు మనుషులుగా ప్రవర్తించటం నేర్చుకోవాలని వారు తెలియజెప్పారు. అది గ్రహించగలిగితే బ్రిటన్‌ రాజకుటుంబానికే మేలు చేకూరుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement