ప్రపంచాన్ని కల్లోలపరచిన కోవిడ్–19 వైరస్ సార్స్–కోవి 2 పుట్టుకపై లోతైన పరిశోధనకు డిమాండ్ పెరుగుతోంది. వాస్తవాల పారదర్శక వెల్లడికి అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి అధికమౌతోంది. అమెరికా తర్వాత ఇప్పుడు బ్రిటన్, ఐరోపా సంఘం గొంతు పెంచాయి. జీ–7 సదస్సు ముంగిట తెరపైకి వస్తున్న ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు కూడా ఇదే డిమాండ్ చేస్తుందని ముందే బయటపడ్డ ముసాయిదా అంశాల్లో వెల్లడైంది. మరో దఫా లోతైన పరిశోధన జరిపి, నిజాల్ని ప్రపంచానికి తెలపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో)ను సదస్సు కోరే అవకాశం ఉంది. డబ్లుహెచ్‌వో లోగడ జరిపిన పరిశోధన డొల్ల అని, కారణమేమైనా ఈ అంతర్జాతీయ సంస్థ ఎందుకో చైనా పట్ల అనుచిత సానుకూలత చూపిందనే విమర్శలొచ్చాయి. అందుకు భిన్నంగా, తమ పరిశోధకులకు చైనా సహకరించలేదని, ఇంకా లోతైన పరిశోధన అవసరమని డబ్లుహెచ్‌వో నాడే ప్రకటించింది. సమగ్ర పరిశోధన జరగాల్సిందేనని ఇప్పుడు భారత్ కూడా స్వరం కలుపుతోంది. పలు దేశాలు ఇదే బాటలో వరుస కట్టనున్నాయి. సార్స్ వైరస్ సహజంగానే పుట్టిందా? చైనాలోని వూహాన్ వైరాలజీ సంస్థ (డబ్లుఐవి) పరిశోధనశాల నుంచి లీకైందా? అన్నది మౌలిక ప్రశ్న! లీకవడమే నిజమైతే... ప్రమాదపు ఘటనా? ఉద్దేశ్యపూర్వక కుట్రా? అన్నదీ తేలాలి. సహజంగానే తన సమాచారం చుట్టూ ఇనుప గోడలు కట్టే అతిపెద్దగోడగల దేశం, చైనా ఒకింత ఇరుకున పడింది. కొంత శోధించిన అమెరికా నిఘా విభాగాన్ని మరింత లోతు పరిశోధన జరపాలని ఆ దేశాధ్యక్షుడు బైడన్ ఆదేశించిన నుంచి.. ఒకటొకటిగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వేడిపుట్టిస్తున్నాయి. చైనా–అమెరికా దేశాల మధ్య తాజా పరిణామం మరింత ఎడం పెంచవచ్చేమో కానీ, వారి ద్వైపాక్షిక అంశం కాదని విశ్వ సమాజం భావిస్తోంది. ఇది ప్రపంచ సమస్య! ప్రపంచాన్ని అతలాకుతలం చేసి, ఇంకా వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుక, దాని మూలాలు సమగ్రంగా తెలిస్తే, తగు ఉపకరణాలతో ప్రస్తుత ఉపద్రవాన్ని అరికట్టడంతో పాటు భవి ష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఏడాదిన్నర కాలంలో, అధికారికం గానే 37 లక్షల మంది ప్రాణాలు తీసి, 18 కోట్ల మందికి సోకిన వైరస్ గూర్చి మానవాళికి తెలియాలి.
చైనాను కుట్రకోణంలో అనుమానించడానికి బలమైన సాపేక్ష సాక్ష్యాధారాలున్నాయి. సార్స్– కోవి2 వైరస్ సహజమా? మానవనిర్మితమా? అన్న ప్రశ్నను రేకెత్తిస్తున్న అంశాలెన్నో! వూహాన్ వైరా లజీ సంస్థలో ఏళ్లుగా జీవాయుధ తయారీ పరిశోధనలు, రక్షణ విభాగ నిఘాలో జరుగుతున్నాయని లోగడ వెల్లడైంది. వైరస్‌లను లోతుగా అర్థం చేసుకునేందుకు, ‘పనితీరు నుంచి లబ్ది’ (గెయిన్ ఆఫ్ ఫంక్షన్) పరిశోధనలు అంతటా జరుగుతాయి. దీనికి రెండు పార్శా్వలుంటాయి. ఒకటి లోక కల్యాణం కోసం జరిగేది. అంటే, వైరస్ స్వభావాన్ని లోతుగా గ్రహించి, భవిష్యత్తులో అది రూపు మార్చుకునే ‘వైవిధ్యాల’ అవకాశం– ప్రభావాలు, వాటికి విరుగుడు టీకామందుల తయారీపై అధ్య యనం.. లాంటివి! వైరస్ రూపుని, స్వభావాన్నీ కృత్రిమంగా మార్చడం ద్వారా మరింత ప్రమాద కారిగా తయారు చేసేందుకు గల అవకాశాల అధ్యయనం రెండోది. ఇది అత్యంత ప్రమాదకారి! ఇతర జీవుల, ముఖ్యంగా మానవుల విధ్వంసకారిగా వైరస్ వైవిధ్యాన్ని మానవప్రమేయంతో రూపొందించి, జీవాయుధంగా మలచడం, శత్రుదేశాలపై ప్రయోగించడం ఈ కుట్ర వెనుక లక్ష్యం. వూహాన్‌లో ఇదేమైనా జరిగిందా? అన్నది అనుమానం. ఇదే క్రమంలో... బాహ్యప్రపంచంలోకి వైరస్ రాక ఉద్దేశ్యపూర్వక చర్య కావచ్చు, లేదా పొరపాటు పరిణామమైనా(లీక్) అయుండొచ్చు! ఏదన్నదే ఇపుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. చైనాను అనుమానించడానికి ఇంకో కారణముంది. దక్షిణ చైనాలోని యుమ్మన్ ప్రావిన్స్‌లో 2013 లో బయటపడిన ఆర్‌ఏటీజీ–13 వైరస్‌ను ప్రస్తుత సార్స్–కొవి 2 వైరస్ సరిగ్గా పోలి ఉండటమే! తాజా వైరస్‌లోని కొవ్వు కొమ్ముల్లో... సహజం కాని, మానవ ప్రమేయమని అనుమానించదగ్గ 4 జన్యుజోక్యాలను ఢిల్లీ ఐఐటీ పరిశోధకులు గత జన వరిలో గుర్తించారు. ఈ వైరస్ మనిషి ఊపిరితిత్తుల్ని ఎలా ధ్వంసం చేస్తుందో, నమగ్ర అణుస్థాయి నమూనాగా అమెరికా ఇంధన విభాగం ఒక ‘ఎన్వలప్’రూపొందించింది. ‘నేచర్ కమ్యూ నికేషన్’ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది. ఈ వైరస్ సహజమా? కృత్రిమమా? అనే అంశంపై అట్లాంటాలోని జార్జియా యూనివర్సిటీ వాళ్లొక అధ్యయనం చేస్తున్నారు. చైనా ప్రమాదకర జీవాయుధ క్రమమే ఇదని అమెరికా ఆరోపిస్తే, సహజ సార్స్ వైరస్‌ను యుఎస్ జన్యుమార్పిడికి గురిచేస్తోందని చైనా 2003లోనే ఆరోపించింది. ఎవరి విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా తగిన శాస్త్రాధారాలు లేకుండా ఎవరినీ శంకించలేం. లోతైన పరిశోధనతో సందేహాలకతీతంగా అది ధృవపడాల్సిందే!
శాస్త్రవిజ్ఞాన బలాన్ని మంచికి కాకుండా మనిషి చెడువైపు మళ్లించిన సందర్భాలు మనకేం కొత్త కాదు! అణ్వాయుధాలు–వాటి దురుపయోగం ఇందుకో ఉదాహరణ! బాంబు తయారు చేసిన నోబెల్, ఆధునిక మారణాయుధం ఏకే–47 తయారుచేసిన కలైష్నకోవ్‌లు, సత్సంకల్పంతో తామొ కటి తలిస్తే వినియోగం మరొకటై శాంతికి భంగం కలిగిందని తీవ్రంగా బాధపడ్డవారే! సార్స్–కొవి 2 వైరస్ జన్మరహస్యాన్ని చేధించి, కుట్రకోణం ఉంటే... అందుకు కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందే! ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, శాస్త్రవేత్తలపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment