ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనడానికీ, నిరసనలను చల్లార్చడానికీ అమలులో ఉన్న చట్టాలు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి సరిపోతున్నట్టు లేవు. జనం గుమిగూడినప్పుడల్లా, నినాదాలు పెల్లుబికినప్పుడల్లా, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడల్లా అక్కడ బుల్‌డోజర్లు ఆవులిస్తున్నాయి. పోలీసులకన్నా ముందు అవి రోడ్లమీదికొస్తున్నాయి. ఎవరో కొందరిని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లనూ లేదా వారి దుకాణాలనూ నేలమట్టం చేయడం ఇటీవల రివాజుగా మారింది.
వేరే రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో యూపీని ఆదర్శంగా తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మహమ్మద్ ప్రవక్తను కించపరిచినవారిపై చర్యలు తీసుకోవాలంటూ యూపీ, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలం గాణ తదితరచోట్ల మొన్న శుక్రవారం నిరసనలు చెలరేగాయి. ఇవన్నీ దాదాపు శాంతియుతంగానే ముగిశాయి.
యూపీ, జార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్‌లలో మాత్రం ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, విధ్వంసానికి పూనుకోవడం వంటివి చేశారు. జార్ఖండ్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పో యారు. తమ డిమాండ్లు న్యాయమైనవనీ, వాటిని ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నదనీ భావించి నప్పుడు ఉద్యమించడం పౌరుల హక్కు. కానీ హింసకు, విధ్వంసానికి దిగడం క్షమార్హం కాని నేరం. ఇలాంటి చర్యలవల్ల అంతిమంగా తామే నష్టపోతామని ఆందోళనకారులు తెలుసుకోవాలి.
సమాజంలో అశాంతి సృష్టించాలనీ, అలజడులు రేపాలనీ కుట్రలు పన్నే అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తామని ప్రభుత్వాలంటే అభ్యంతరపెట్టేవారు ఉండరు. అందుకోసం కావలసినన్ని చట్టాలు న్నాయి. శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సంకేతాలు పంపదల్చు కుంటే ఆ చట్టాలను వినియోగించుకోవచ్చు.
ఆ క్రమంలో చట్టవిరుద్ధత ఏమైనా చోటుచేసుకున్న పక్షంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. కానీ ఈ క్రమాన్నంతటినీ వదిలిపెట్టి రాజ్యమే బహుళ పాత్రాభినయం చేస్తానంటే ఎవరూ మెచ్చరు. చట్ట ఉల్లంఘనకు పాల్పడినవారిని అదుపు చేసే పేరిట తానే అలాంటి ఉల్లంఘనలకు పూనుకుంటే ప్రజలు సహించరు.
తానే ఆరోపణలు చేయడం, తానే నేర నిర్ధారణకు పూనుకోవడం, తనను తాను న్యాయమూర్తిగా సంభావించుకుని శిక్షను ప్రకటించి అమలు చేయడం ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ న్యాయశాస్త్రం ప్రకారం సబబో యోగి ఆదిత్యనాథ్ ఆత్మావలోకనం చేసుకోవాలి. ఈ చర్యలు చూసి సొంత పార్టీ శ్రేణులు, అత్యు త్సాహం ప్రదర్శించే కొందరు అధికారులు సంబరాలు జరుపుకోవచ్చు. ‘శుక్రవారాల తర్వాత శని వారాలుంటాయి’ అంటూ వారంతా ఆత్మ సంతృప్తి పొందవచ్చు.
కానీ ఈ పోకడలు ఏ సంస్కృతికి దారితీస్తాయో, ప్రజా స్వామిక విలువలను ఎట్లా ధ్వంసం చేస్తాయో సకాలంలో గమనించుకోవడం అవసరం. బీజేపీ బహిష్కృత నేతలు నూపూర్ శర్మ, జిందాల్ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల తర్వాత దేశ వ్యాప్తంగా ఆ వర్గంవారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడం కనిపిస్తూనే ఉంది. వారిద్దరిపైనా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని మైనారిటీ వర్గానికి చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేశారు.
సకాలంలో ఆ పని చేసివుంటే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదు. ఖతార్, కువైట్‌లతో మొదలుపెట్టి అనేక దేశాలు వారి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశాక ఆ ఇద్దరు నేతలనూ బీజేపీ బహిష్కరించింది. అంతకు ముందు ఒక ప్రకటన విడుదల చేస్తూ వారి వ్యాఖ్యలతో తమకు ఏకీ భావం లేదనీ, ఏ మతాన్నీ కించపరచడం తమ విధానం కాదనీ బీజేపీ అగ్ర నాయకత్వం ప్రకటించింది. ఆ వెనువెంటనే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటే అర్థవంతంగా ఉండేది.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఘటనల అనంతరం నిరసనలకు సూత్రధారిగా భావిస్తున్న మహ మ్మద్ జావేద్ అనే వ్యక్తి ఇంటిని ఆదివారం బుల్‌డోజర్‌తో నేలమట్టం చేశారు. అంతకుముందురోజు షహ్రాన్‌పూర్‌లో ఇద్దరు నిందితుల ఇళ్లను ఈ పద్ధతిలోనే ధ్వంసం చేశారు. ఈ ఘటనలన్నిటిలోనూ ఒక క్రమం కనబడుతుంది. నిందితులుగా ముద్రపడినవారి ఇంటి నిర్మాణాలు స్థానిక మున్సిపల్ సిబ్బందికో, జిల్లా అధికార యంత్రాంగానికో హఠాత్తుగా చట్టవిరుద్ధమైనవిగా కనబడతాయి.
నోటీసిచ్చి 24 గంటలు గడవకుండానే, వారికి సంజాయిషీ ఇచ్చే వ్యవధి ఇవ్వకుండానే దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లను సైతం బుల్‌డోజర్‌తో కూల్చేస్తారు. ఇలా చేస్తే చట్టం నుంచి తప్పించు కోవడానికి తప్పుడు మార్గాలు అవలంబించే సాధారణ వ్యక్తికీ, రాజ్యానికీ తేడా ఉంటుందా? తమ చర్యకు ‘అసలు’ కారణాన్ని చెప్పుకోలేని అశక్తత అంతిమంగా ప్రజల్లో తమకుండే ఆమోదనీయ తను కూడా దెబ్బతీస్తుందని యోగి ప్రభుత్వం గమనించడం అవసరం.
చట్టాలు చేయడానికీ, వాటిని అమలు చేయడానికీ ప్రభుత్వాలున్నట్టే... ఆ చట్టాల సహేతుక తనూ, ప్రభుత్వ చర్యల్లోని గుణదోషాలనూ నిర్ధారించడానికి న్యాయస్థానాలున్నాయి. ఎవరి పని వారు చేసినంతకాలమూ ఎటువంటి సమస్యలూ తలెత్తవు. అది జరగనప్పుడు సమస్యలు మరింత జటిలమవుతాయి.
బీజేపీ అగ్ర నాయకత్వం ఈ విషయంలో తగిన అవగాహన కలిగించాలి. న్యాయ వ్యవస్థ సైతం దీనిపై దృష్టిపెట్టాలి. బుల్‌డోజర్‌లు ఉపయోగించి ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేసే పోకడలను సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులోనూ, అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లోనూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని సాధ్యమైనంత త్వరగా విచారించి తగిన ఆదేశాలివ్వడం ఎంతో అవసరం.
ఇదేం వైపరీత్యం?
Published Wed, Jun 15 2022 1:07 AM | Last Updated on Wed, Jun 15 2022 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment