కరోనా వైరస్ మహమ్మారి మరోసారి వివిధ రాష్ట్రాల్లో ఉగ్రరూపం దాల్చి దడపుట్టిస్తుండగా దాని కట్టడిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముఖ్యమంత్రులతో వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయన్న విషయంలో పౌరులందరికీ ఈ సమావేశం తర్వాత మరింత స్పష్టత వచ్చింది. నిరుడు మాదిరి టోకున లాక్‌డౌన్ విధించే అవకాశం లేదన్న అభిప్రాయం కలిగింది. దానికి బదులు ఆ మహమ్మారి తీవ్రత బాగా వున్నట్టు నిర్ధారణ అయిన ప్రాంతాలపై పరిమితులు విధించటం ఉత్తమమని ప్రధాని సూచించారు. గత అనుభవాలరీత్యా కొన్నిచోట్ల స్వస్థలాలకు వెళ్లేందుకు వలసజీవులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ స్పష్టత రావటం చాలా అవసరం. ఈ సమావేశాన్ని వీక్షించినవారికి మరో విషయం అర్థమైంది. దేశంలో చాలినంత పరిమాణంలో కరోనా వ్యాక్సిన్లు లేవు. వయోపరిమితులతో పని లేకుండా అందరికీ టీకా ఇవ్వటం కుదరదని మోదీ చెప్పటంతోపాటు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం దాన్ని పాటించటం లేదన్న సంగతిని ప్రస్తావించారు. అయితే దేశంలో ప్రస్తుత పరిస్థితేమంటే... అందరికీ టీకా ఇవ్వటం మాట అటుంచి, చాలా రాష్ట్రాల్లో అర్హులైన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే స్థితి అయినా లేదు. ఇది ఆందోళన కలిగించే అంశం. వ్యాక్సిన్ ఉత్పత్తి అవసరమైనంత లేకపోవటం, వివిధ దేశాలకు దాన్ని ఎగుమతి చేయడం ఇందుకు కారణం. ఒకవైపు కరోనా మహమ్మారి తీవ్రత దేశంలో బాగా ఎక్కువైంది. తాజాగా బయటపడిన కేసుల సంఖ్య 1,31,000 పైమాటే. కేసుల్లో అందరినీ మించిన మహారాష్ట్రలో శుక్రవారం కొత్తగా బయటపడినవి 56,286. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. మరణాల సంఖ్య కూడా అందరినీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విసిరిన పంజాలో చిక్కుకున్న దేశాల జాబితాలో ఇప్పుడు మనం మూడో స్థానంలో వున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో అందరికన్నా అగ్రభాగాన వున్న అమెరికాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండగా మన దేశంలో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
తాజా గణాంకాలన్నీ ఆ మహమ్మారి ఊబిలోకి మనం క్రమేపీ ఎలా దిగబడిపోతున్నామో చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలన్నీ సమష్టిగా పనిచేసి ఈ గండం నుంచి గట్టెక్కడం ఎలాగన్న అంశంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రాలు కరోనా కట్టడిపై శ్రద్ధ పెట్టడం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ విమర్శిస్తున్నారు. కేంద్రం చాలినన్ని వ్యాక్సిన్లను అందజేయటం లేదని విపక్షాల ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. మొన్న మహారాష్ట్ర ఆరోపించగా, ఇప్పుడు రాజస్థాన్ వారితో శ్రుతి కలిపింది. వారే కాదు...బీజేపీ ఏలుబడిలోని గుజరాత్ ప్రభుత్వం సైతం టీకాలు సరిపోవటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి ఇది పరస్పరం ఆరోపణలు చేసుకునే సందర్భం కాదు. విమర్శలు గుప్పించుకునే సమయం కాదు. వారి ఆరోపణలమాటెలావున్నా నిర్దేశించిన వయోపరిమితిలోని వారికైనా టీకాలివ్వటం ఎందుకు సాధ్యపడటంలేదో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. దేశవ్యాప్తంగా కనీసం పది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువుందని తెలుస్తున్నది కనుక ముందు ఆ రాష్ట్రాలకైనా సమృద్ధిగా టీకాలు అందుబాటులో వుంచాలి. జూలై నెలాఖరుకల్లా 30 కోట్లమందికి టీకాలివ్వటం లక్ష్యమని కేంద్రం చెబుతోంది. కానీ ఇంతవరకూ కోటీ 40 లక్షలమందికి మాత్రమే టీకాలిచ్చారు. మనం ఎంతగా వెనకబడ్డామో, లక్ష్యసాధనకు ఎంత దూరంలో వున్నామో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ప్రధాని అంటున్నట్టు అన్ని వనరులూ అందుబాటులో వుండే అభివృద్ధి చెందిన దేశాలు సైతం అందరికీ టీకా ఇచ్చే పరిస్థితిల్లో లేకపోవటం నిజమే కావొచ్చు. అలాగే టీకాల ఉత్పత్తి కోసం తక్షణం భారీ ఫ్యాక్టరీలు నిర్మించటం కూడా సాధ్యపడకపోవచ్చు. కానీ మనకున్న పరిమితుల్లో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచటానికి, వాటిని వెనువెంటనే తరలించటానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించటం తక్షణావసరం. కోవీషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ తమకు వెంటనే రూ. 3,000 కోట్లు మంజూరు చేస్తే తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని కోరుతోంది. ఈ విషయంలో కేంద్రం వెంటనే అనుకూల నిర్ణయం తీసుకోవటం అవసరం. ప్రస్తుతం కోవీషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ టీకాను మాత్రమే దేశంలో అనుమతించారు. రష్యా తయారీ స్పుత్నిక్ టీకా ఉత్పత్తి కోసం ఇప్పటికే మన ఫార్మా సంస్థలు కొన్ని సంసిద్ధంగా వున్నాయి. అందుకవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ టీకాకు అనుమతులిచ్చే అంశంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అది కొంతవరకూ లోటును భర్తీ చేస్తుంది. మహారాష్ట్ర, ఒడిశాలాంటిచోట వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవటంతో టీకాలిచ్చే కేంద్రాలను తాత్కాలికంగా మూసేయాల్సివచ్చింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తోవలో వున్నాయి.
కోవిడ్ నిబంధనల అమలు విషయంలో పౌరుల్లో కొంత నిర్లిప్తత ఏర్పడిన సంగతి వాస్తవం. కరోనా పరీక్షల సంఖ్యను పెంచి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించే విషయంలో కొన్ని ప్రభుత్వాలు కూడా వెనకబడ్డాయి. ఇప్పుడిప్పుడే అవి మళ్లీ వేగం అందుకున్నాయి. చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు అమలవుతున్నాయి. కరోనా ప్రబలంగా వుందని తేలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. విందులు, వినోదాలు, మతపరమైన ఉత్సవాలు, ఊరేగింపులు తదితరాలపై కూడా పరిమితులు విధించటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment