మువ్వన్నెల జెండా రెపరెపలాడాల్సిన గణతంత్ర దినోత్సవంనాడు దేశ రాజధాని నగరం చవి చూసిన హింస కనీవినీ ఎరుగనిది, దురదృష్టకరమైనది. సాగు సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ గత రెండు నెల లుగా ఢిల్లీ నగరం వెలుపల బైఠాయించి ఉద్యమిస్తున్న రైతులు కూడా వాంఛించని పరిణామం ఇది. ‘జై జవాన్... జై కిసాన్’ అన్న నినాదాలు ప్రతిధ్వనించాల్సిన రోజున జవాన్లు, కిసాన్ల మధ్య ఘర్ష ణలు చోటుచేసుకోవటం ఎంతో విషాదకరం. ఒకచోట ఆందోళనకారులు పోలీసులను లోతైన గొయ్యిలోకి నిర్దాక్షిణ్యంగా నెట్టడం, మరోచోట వారిపైకి ట్రాక్టర్లను శరవేగంతో పోనిచ్చి భయ భ్రాంతులకు గురిచేయటం లాంటి దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ర్యాలీలోకి పాకిస్తాన్ ప్రేరేపిత ఖలీస్తానీ శక్తులు చొరబడే ప్రమాదం వున్నదని నాలుగురోజులక్రితం పోలీసులు తెలిపారు. కానీ ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించుకుంటామన్న హామీపై షరతులతో అనుమతించారు. వాటి ప్రకారం పెరేడ్ ముగిశాకగానీ ర్యాలీ ఢిల్లీలో ప్రవేశించకూడదు. అంటే ఢిల్లీ వెలుపల ఏడు ప్రాంతాల్లో బైఠాయించిన ఉద్యమకారులు ఉదయం 11 గంటలకు మాత్రమే తమ తమ స్థానాల నుంచి బయ ల్దేరాలి. కానీ అందుకు భిన్నంగా 8 గంటల ప్రాంతంలోనే ర్యాలీలు ఎలా మొదలైనాయో, పోలీసులు ఎక్కడికక్కడ ఎందుకు నిలువరించలేకపోయారో అనూహ్యం.
ముందనుకున్న విధంగా జరిగివుంటే అంతా ప్రశాంతంగా ముగిసిపోయేది. కానీ అది కాస్తా అదుపు తప్పి పోలీసులకూ, ఉద్యమకారులకూ మధ్య ఘర్షణలుగా పరిణమించింది. దాదాపు డజను చోట్ల నిర్దేశించిన మార్గాన్ని కాదని ఉద్యమకారుల్లో కొందరు బారికేడ్లను ధ్వంసం చేశారని పోలీసులు అంటుండగా... అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డంకులు సృష్టించారని రైతుల ఆరోపణ. నిజానిజాల మాటెలావున్నా ఆందోళనకారులను నిలువరించటం పోలీసు బలగాలకు సాధ్యం కాలేదు. అనేకచోట్ల లాఠీచార్జిలు జరిగాయి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాల్సివచ్చింది. వీటన్నిటినీ దాటుకుని ఆందోళనకారులు ఎర్రకోటలోకి ప్రవేశించి బురుజులెక్కి రైతు ఉద్యమ పతాకనూ, ఖల్సా జెండాను ఎగరేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
వేగంగా ట్రాక్టర్ నడిపి బారికేడ్లను ఢీకొట్టి, ఆ క్రమంలో ప్రమాదం జరిగి ఒక యువకుడు మరణించగా, రాళ్లు రువ్విన ఘటనలు, ఇతరత్రా దౌర్జన్యాల్లో 86మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు సంయమనం పాటించకపోయివుంటే మరెన్ని దుర దృష్టకర ఘటనలు చోటుచేసుకుని వుండేవో ఊహించలేం. ముందు పోలీసులే రెచ్చగొట్టే చర్యలకు దిగారని కొందరు ఆందోళనకారులు చేస్తున్న వాదన సమంజసం కాదు. అదే నిజమైతే, తమలో ఎవరూ రెచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత ర్యాలీకి నాయకత్వంవహిస్తున్నవారిదే. కొన్ని రోజుల క్రితం ఉద్యమ నేతలు కూర్చున్న ప్రాంతంలోకి చొరబడి ఒక వ్యక్తి ఖలిస్తాన్ అనుకూల నినాదా లిచ్చినప్పుడు వారిలో కొందరు వెంటనే అతన్ని గుర్తించి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఇప్పుడు కూడా అదే మాదిరి అప్రమత్తత పాటిస్తూ అవాంఛనీయ ఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఎక్కువుంది. హింసకు పాల్పడిన బృందాలకు నాయకత్వంవహించిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కెఎంఎస్‌సీ) నేతలు తమ కమిటీలో ఎప్పుడూలేరని ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న 40కి పైగా రైతు ఉద్యమ సంస్థలకు చెందిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) నాయకులు అంటున్నారు. ఇలాంటివి జరిగే అవకాశమున్నదని అంచనా వేసుకుని ఎస్‌కేఎం నేతలు తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ విషయంలో వారు విఫలమయ్యారు.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకుని, గణతంత్ర వ్యవస్థగా ప్రకటించుకున్నరోజైన జనవరి 26 జాతి యావత్తుకూ అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం. దీన్ని పురస్కరించుకుని ఏటా అత్యంత ఘనంగా త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, విన్యాసాలు వుంటాయి. దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యత చాటేలా శకటాలను ప్రదర్శిస్తారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావలసివున్నా స్వదేశంలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఆయన విరమించుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా యధావిధిగా వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌరవవందనం స్వీకరించారు. ప్రధాని మొదలుకొని మంత్రులు, అధికారులు, వివిధ పార్టీల నేతలుసహా 25,000మంది జనం ఈ పెరేడ్‌ను తిలకించారు. కానీ పెరేడ్ అనంతరం జరిగిన ఘటనలు ఈ వేడుకలను మసకబార్చాయి.
సాధారణ దినాల్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే ఎర్రకోట ప్రాంతానికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకల సందర్భాల్లో మరింత భద్రత వుంటుంది. అయినా కూడా ఇవి చోటుచేసుకోవటం నిఘా విభాగాల వైఫల్యమే. ఇంతవరకూ ఏ ఉద్యమమూ హింస, దౌర్జన్యాలతో విజయం సాధించిన ఉదంతాలు మన దేశంలో లేవు. స్వాతం త్రోద్యమం మొదలుకొని ఇందుకెన్నో ఉదాహరణలున్నాయి. గత నాలుగైదు నెలలుగా కేంద్రం తీసు కొచ్చిన సాగు బిల్లులపై గానీ, ఆ తర్వాత వాటిని చట్టాలుగా మార్చటంపైగానీ రైతులోకం ఆందోళన చేస్తోంది.
ముఖ్యంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల రైతులు ఈ చట్టాలు రద్దు చేయాల్సిందేనని గత రెండు నెలలుగా ఢిల్లీ వెలుపల బైఠాయించి ఆందోళన సాగిస్తున్నారు. అదెంతో క్రమశిక్షణతో, సంయమనంతో సాగటం అన్ని వర్గాల ప్రశంసలూ పొందుతోంది. కానీ గణ తంత్ర దినోత్సవంనాడు చోటుచేసుకున్న ఘటనలు ఆ ఉద్యమం ఇన్నాళ్లూ సాధించుకున్న ప్రతి ష్టనూ, విశ్వసనీయతనూ దెబ్బతీశాయి. దీనిపై ఉద్యమ నేతలు సమీక్షించుకోవాలి. ప్రభుత్వం సైతం అవసరమైతే మరొక మెట్టు దిగైనా ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment