స్నేహమొక్కటి నిలిచి వెలుగును | Sakshi Editorial On Friendship | Sakshi
Sakshi News home page

స్నేహమొక్కటి నిలిచి వెలుగును

Published Sun, May 15 2022 11:57 PM | Last Updated on Mon, May 16 2022 12:14 AM

Sakshi Editorial On Friendship

ఉస్తాద్‌ బడే గులామ్‌ అలీఖాన్‌ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఘంటసాల ఇంట్లో బస చేసేవారు. ఇప్పటిలా ఉదయమొచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడం కాదు. నెలా రెండు నెలలు ఉండిపోవడమే. మేడ మీద వారు ఉంటే అన్నము, రొట్టెలు నిరాటంకంగా ఘంటసాల ఇంటి నుంచి వెళ్లేవి. బడే గులామ్‌ అలీఖాన్‌ ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’లో నాలుగైదు నిమిషాల ఆలాపనకు 25 వేల రూపాయలు తీసుకున్నారు– 1960లో. అంటే నేటి విలువ 20 కోట్లు. అంత ఖరీదైన, మహా గాత్ర విద్వాంసుడైన బడే గులామ్‌ అలీఖాన్‌ ఏం చేసేవారో తెలుసా? తనకు బస ఇచ్చిన ఘంటసాల స్నేహాన్ని గౌరవిస్తూ, అన్నం పెడుతున్న ఘంటసాల సతీమణి సావిత్రమ్మను గౌరవిస్తూ తాను ఉన్నన్నాళ్లు ప్రతి శుక్రవారం పిలిచి ప్రత్యేకం వారిద్దరి కోసమే పాడేవారు. గంట.. రెండు గంటలు... పాడుతూనే ఉండిపోయేవారు. స్నేహం అలా చేయిస్తుంది.

లతా మంగేష్కర్‌ వృద్ధిలోకి వచ్చిందని ఎవరికో కన్ను కుట్టింది. ఆమెకు స్లో పాయిజన్‌ ఇచ్చి చంపడానికి వంట మాస్టర్‌ని ప్రవేశ పెడితే స్లో పాయిజన్‌ ఉన్న వంట తినీ తినీ ఒక్కసారిగా ఆమె జబ్బు పడింది. మూడు నెలలు మంచం పట్టింది. బతుకుతుందో లేదో, మరల పాడుతుందో లేదో తెలియదు. కానీ గీతకర్త మజ్రూ సుల్తాన్‌పురి ఆమెను రోజూ మధ్యాహ్నం చూడటానికి వచ్చేవాడు. సాయంత్రం ఏడూ ఎనిమిది వరకు కబుర్లు చెబుతూ కూచునేవాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు... ఆమె తిరిగి రికార్డింగ్‌ థియేటర్‌లో అడుగుపెట్టే రోజు వరకూ అతడా పని మానలేదు. స్నేహం అలానే చేయిస్తుంది.

గబ్బర్‌సింగ్‌గా విఖ్యాతుడైన అంజాద్‌ ఖాన్, అమితాబ్‌కు ఆప్తమిత్రుడు. కుటుంబంతో గోవా వెళుతూ తీవ్రమైన కారు యాక్సిడెంట్‌ జరిగితే అందరూ చచ్చిపోతాడనే అనుకున్నారు. అమితాబ్‌కు ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద ఆస్పత్రికి వచ్చాడు. ఇంటికెళ్లక దివారాత్రాలు కాపలా కాశాడు. ఏమి సాయం కావాలంటే ఆ సాయం చేయడానికి సిద్ధం. అతి కష్టమ్మీద అంజాద్‌ ఖాన్‌ బతికాడు. స్నేహితుడు అమితాబ్‌ బచ్చన్‌ తన కంటికి కునుకు పట్టే అనుమతినిచ్చాడు.

ఈద్‌ అంటారొకరు. పండగ అంటారొకరు. దువా అంటారొకరు. ప్రార్థన అంటారొకరు. మక్కా మదీనాల ఫొటో ఒక గుమ్మం మీద! విఘ్నేశ్వరుడి చిత్రపటం ఒక వాకిలికి! అమ్మ వండితే ‘ఖీర్‌’ అంటారొకరు. ‘పాయసం’ అని లొట్టలు వేస్తారొకరు. విరజాజుల పూలతీవ ఇరు ఇళ్ల మీద ఒక్కలాంటి పరిమళమే వెదజల్లుతుంది. ప్రభాతాన సుప్రభాతం అయితే ఏమిటి... వినిపించే అజాన్‌ అయితే ఏమిటి... ఒడలు పులకరింప చేస్తుంది. ‘క్యా భాయ్‌’ అని ఒకరు.. ‘ఏవోయ్‌’ అని ఒకరు! స్నేహం దేవుళ్ల అనుమతితో జరగదు. అది హృదయాల దగ్గరితనంతో సంభవిస్తుంది. కళే మతం అనుకునే కళాకారులకు ఈ స్నేహం ఒక ఆరాధనగా ఉంటుంది. 

‘ప్యార్‌ కియా జాయ్‌’ (ప్రేమించి చూడు)లో మెహమూద్, ఓం ప్రకాశ్‌ల కామెడీ విపరీతంగా పండింది. సినిమా పిచ్చోడైన మెహమూద్, తండ్రి ఓం ప్రకాశ్‌ను పెట్టుబడి పెట్టమని పీడించుకు తింటుంటాడు. చివరకు ఒకనాడు ‘అసలేం తీస్తావో కథ చెప్పు’ అని ఓం ప్రకాశ్‌ అంటే మెహమూద్‌ దడుచుకు చచ్చే హారర్‌ స్టోరీ చెబుతాడు. నవ్వూ, భయమూ ఏకకాలంలో కలిగే ఆ సన్నివేశంలో మెహమూద్‌ యాక్షన్‌ ఎంత ముఖ్యమో ఓం ప్రకాశ్‌ రియాక్షన్‌ అంతే ముఖ్యం. ఆ సన్నివేశం మెహమూద్‌కు ఆ సంవత్సరం బెస్ట్‌ కమెడియన్‌గా ఫిల్మ్‌ఫేర్‌ సంపాదించి పెడితే వేదిక మీద అవార్డ్‌ అందుకున్న మెహమూద్‌ కారు ఎక్కి ఆనందబాష్పాలతో నేరుగా ఓం ప్రకాశ్‌ ఇంటికి వెళ్లాడు. ‘మనిద్దరం చేసిన దానికి నాకొక్కడికే అవార్డు ఏంటి? ఇది నీదీ నాదీ’ అని పాదాల దగ్గర పెట్టాడు. స్నేహితులు ఇలాగే ఉంటారు. స్నేహారాధన తెలిసిన కళాకారులు ఇలాగే!

కళ ఈ దేశంలో ఎప్పుడూ మతాన్ని గుర్తు చేయనివ్వలేదు. మతం మనిషికి మించింది కాదని చెబుతూనే వచ్చింది. ఒక హిందూ సితార్‌తో ఒక ముస్లిం తబలా జుగల్‌బందీ చేసింది. ఒక హిందూ గాత్రంతో ఒక ముస్లిం సారంగి వంత పాడింది. ఒక హిందూ నర్తనతో ఒక ముస్లిం షెహనాయి గంతులేసింది. ‘మిమ్మల్ని అమెరికా పట్టుకెళతాం... హాయిగా సెటిల్‌ అవ్వండి’ అని బిస్మిల్లా ఖాన్‌తో అంటే, ‘తీసుకెళతారు నిజమే... నేను పుట్టిన ఈ కాశీ పురవీధులు, ఈ పవిత్ర గంగమ్మ ధార... వీటిని నాతో పాటు తేగలరా’ అని జవాబు పలికాడు. ఈ జవాబే ఈ దేశ సిసలైన సంస్కృతి.

సంతూర్‌ విద్వాంసుడు పండిట్‌ శివ్‌కుమార్‌ శర్మ మొన్నటి దినాన మరణిస్తే ఆయనతో సుదీర్ఘ స్నేహంలో ఉన్న, కలిసి వందలాది కచ్చేరీలు చేసిన తబలా మేస్ట్రో ఉస్తాద్‌ జకీర్‌ హుసేన్‌ ఆయన పార్థివ దేహానికి తన భుజం ఇచ్చాడు. దహన సంస్కారాలు మొదలయ్యాక అందరూ పక్కకు తొలగినా స్నేహితుణ్ణి విడిచి రాను మనసొప్పక పక్కనే ఒక్కడే చేతులు కట్టుకుని నిలుచున్నాడు. ఈ ఫొటో వైరల్‌గా మారితే... ‘ఇది గదా ఈ దేశపు నిజమైన సంస్కారం’ అని ఎందరో కళ్లు చెమరింప చేసుకున్నారు.

కష్టపెట్టేవాటిని ప్రకృతి ఎక్కువ కాలం అనుమతించదు. వడగాడ్పులను, తుపాన్లను, భూ ప్రకంపనాలను, విలయాలను లిప్తపాటే అనుమతిస్తుంది. ద్వేషానికి, విద్వేషానికి కూడా అంతే తక్కువ స్థానం, సమయం ఇస్తుంది. ప్రేమ దాని శిశువు. స్నేహం దాని గారాల బిడ్డ. ఆ గారాల బిడ్డకు అది పాలు కుడుపుతూనే ఉంటుంది. ఈ దేశం ప్రేమ, స్నేహాలతో తప్పక వర్ధిల్లుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement