మానవత్వానికి మృత్యులోయ | Sakshi Editorial On Kashmir Valley | Sakshi
Sakshi News home page

మానవత్వానికి మృత్యులోయ

Published Fri, Jun 3 2022 12:14 AM | Last Updated on Fri, Jun 3 2022 12:14 AM

Sakshi Editorial On Kashmir Valley

గత నెల ఓ కశ్మీరీ పండిట్, ఓ వైన్‌షాపు ఉద్యోగి, మొన్న ఓ టీవీ నటి, నిన్న ఓ స్కూల్‌ టీచర్, ఇవాళ గురువారం ఓ బ్యాంకు మేనేజర్‌. మరి, రేపు...? తలచుకొంటేనే నిద్ర పట్టని ఈ వరుస హత్యలతో దాదాపు 75 లక్షల మందికి ఆవాసమైన కశ్మీర్‌ లోయ వణికిపోతోంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని అమాయకులను లక్ష్యంగా చేసుకొని, మే 1 నుంచి ఇప్పటికి 8 మందిని ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. దేశంలోని వైవిధ్యానికీ, లౌకికవాదానికీ ప్రతీకగా నిలుస్తున్న హిందూ కశ్మీరీలు, ముస్లిమ్‌ కశ్మీరీలు, స్థానికేతరులు – ఇలా మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఇప్పుడు తీవ్రవాదుల లక్ష్యమే. ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద కశ్మీరీ లోయకు తిరిగొచ్చిన హిందూ ప్రభుత్వోద్యోగులు వందల మంది భయాందోళనలతో పెట్టేబేడా సర్దుకొని, వెళ్ళిపోతుండడం పెనువిషాదం. ఈ తాజా దృశ్యాలు మళ్ళీ 1990 నాటి పరిస్థితిని తలపించాయి. ప్రాణాలు పోతుంటే, పాలనా యంత్రాంగం ఏం చేస్తోందన్న జవాబు లేని ప్రశ్నను సంధించాయి. 

కశ్మీర్‌లో కేంద్రం కనుసన్నల్లోని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలన ఉన్నా, ఈ పరిస్థితి తలెత్తడం పాలకుల ఘోర వైఫల్యమే. అమరనాథ్‌ యాత్ర కూడా సమీపిస్తుండడంతో తక్షణ దిద్దుబాటు కోసం హోమ్‌మంత్రి కశ్మీర్‌పై ఉన్నత స్థాయి భద్రతా సమావేశం పెట్టడం, భద్రతా సలహాదారుతో భేటీ కావడం అనివార్యమయ్యాయి. అయితే కశ్మీర్‌లో శాంతిభద్రతలు నెలకొనడం దాయాది పాకిస్తాన్‌కు సుతరామూ ఇష్టం ఉండదని తెలిసిందే. అక్కడ చిచ్చు రేపి చలిమంట కాసుకుందామనేది దీర్ఘకాలంగా దాని ప్రణాళిక. తాజా ఘటనలూ అందుకు తగ్గట్టే ఉన్నాయి. కశ్మీరీ ముస్లిమ్‌ పౌరులు ఎప్పటి నుంచో లక్ష్యం కాగా, ఇప్పుడు కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ, సిక్కు మతస్థులు, వలస కార్మికులపై హత్యాకాండ పెరిగింది. ఒకపక్క కశ్మీర్‌లో ఈ మైనారిటీలకు స్థానం లేదని చాటి, మరోపక్క దేశంలోని మిగతా ప్రాంతాల్లో మతపరమైన విభేదాలు రేపే పన్నాగం నడుస్తోంది. ముందుగా రెక్కీ చేసి మరీ అమాయకుల్ని చంపుతున్నారంటే, ఉగ్రమూకలు ఎలాంటి భయాందో ళనలు రేపాలనుకుంటున్నాయో అర్థమవుతోంది. ప్రభుత్వోద్యోగులు తమను కశ్మీర్‌ నుంచి జమ్మూకు సామూహిక బదలీ చేయాల్సిందంటూ వీధికెక్కడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

కశ్మీర్‌ లోయలోని వలస క్యాంపుల్లో ఉండాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వం ఉద్యోగులకు వినతి చేయాల్సి వస్తోంది. హిందూ ప్రభుత్వోద్యోగులను జిల్లా కేంద్రాలకు పంపిస్తామంటోంది. కానీ, రాజధాని శ్రీనగర్‌ సైతం సురక్షితం కానప్పుడు, ఉద్యోగులను జిల్లా కేంద్రాలకు పంపిస్తామన డంలో అర్థం లేదు. అలాగని ఉద్యోగులు కోరుతున్నట్టు అందరూ జమ్మూకు తరలిపోవడం సాధ్యమా? వందల సంఖ్యలో వలస వస్తున్న కశ్మీరీలను భరించే ప్రాథమిక వసతులు జమ్మూలోనూ లేవు. ఒకవేళ రేపు జమ్మూలోనూ ఇలాంటి భద్రతా సమస్యే తలెత్తితే, వీళ్ళంతా ఇంకెక్కడికి పోవాలి? కశ్మీర్‌లో హిందువులు 2 శాతం లోపే! అక్కడకు ఎస్సీ –ఓబీసీ కోటాలో ఉద్యోగాలకు వచ్చినవారు, దీర్ఘకాలంగా ఉంటున్న రాజస్థానీ రాజ్‌పుత్‌లు, పొట్టచేతబట్టుకొని వచ్చిన బిహారీలు, లౌకికవాద ముస్లిమ్‌లు– అందరూ బాధితులే. తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు కనీసం మరో రెండు మూడేళ్ళు పడుతుందని భద్రతా వర్గాలే చెబుతున్నాయి. అప్పటి దాకా వీళ్ళు బలిపశువులు కావాల్సిందేనా? 

ఆర్టికల్‌ 370 రద్దుతో పరిస్థితులు చక్కబడిపోయాయనీ, పోతాయనీ అనుకుంటే అది భ్రమేనని తేలిపోయింది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొన్నదన్న పాలకుల మాటలోని డొల్లతనమూ బయటపడింది. స్థానికంగా తీవ్రవాదుల భర్తీ తగ్గి, విదేశీ తీవ్రవాదుల సంఖ్య పెరగడం కొత్త ట్రెండ్‌. ఆకస్మిక తీవ్రవాద దాడి చేసి, మళ్ళీ అందరిలో ఒకరిగా గడిపేసే ‘హైబ్రిడ్‌ తీవ్రవాదులు’ అనే కొత్త పదం కశ్మీరీ రక్తచరిత్రలో వచ్చి చేరింది. వీటిని అడ్డుకోకపోతే, ఎంతకాలమైనా ఇదే పరిస్థితి. పాల కులు అది గుర్తించాలి. జమాతే శక్తులు వివిధ వర్గాల్లో జొరబడి, కీలక సమాచారాన్నీ, అమాయకుల ఆనుపానుల్నీ లీక్‌ చేస్తున్నాయని పోలీసుల మాట. దానిపై దృష్టి పెట్టి, ఇంటి దొంగలను ఏరి వేయాలి. రాష్ట్రంలో రాజకీయ శూన్యత పూరించి, ప్రజాస్వామ్య సర్కారుకు సత్వరం దోవ చేయాలి.

రాష్ట్రాల కన్నా మనుషుల మనసులు గెలవడం ముఖ్యం. భిన్న వర్గాల మధ్య సౌహార్దం మరీ ముఖ్యం. పరస్పరం అనుమానాలు ప్రబలే మాటల వల్ల ఏం ప్రయోజనం? టూరిస్టులు పెరిగినంత మాత్రాన సాధారణ స్థితి నెలకొన్నట్టు కాదు. కశ్మీర్‌ది పర్యాటకాభివృద్ధిని మించిన సమస్య. కశ్మీరీల భద్రతకు ముందుగా తీవ్రవాద నిర్మూలన కీలకం. ఉపాధి కోల్పోయిన స్థానికులు ఉగ్రమూకల వైపు ఆకర్షితులు కాకుండా చూడడం ముఖ్యం. ప్రాంతీయాభివృద్ధి మాటలే కాదు... ప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇంకా ముఖ్యం. స్థానిక సెంటిమెంట్లను పక్కనబెట్టి, కశ్మీర్‌ స్వయంప్రతిపత్తినీ, రాష్ట్ర ప్రతిపత్తినీ ఏకపక్షంగా రద్దు చేసిన పాలకులు... ప్రతిపక్షాలనూ నిర్వీర్యం చేయాలన్న నిరంకుశ ధోరణిలోనే వెళితే కష్టం. కశ్మీరీ ప్రధాన స్రవంతి నాయకత్వమైన నేషనల్‌ కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమో క్రాటిక్‌ పార్టీలను ప్రజాక్షేత్రంలో కలుపుకొనిపోవాలి. స్థానికులలో ధైర్యం పాదుగొల్పాలి. ఆందోళన లకు చెవి ఒగ్గకుండా, ఆయుధబలంతో ఉక్కుపాదం మోపాలని చూస్తే ఉగ్రచర్యలు కొత్త పిలకలు వేస్తాయి. ఎంతసేపటికీ తప్పంతా పాత పాలకులదే అని చేతులు కడిగేసుకుందా మంటే కుదరదు. పాత సమస్యపై పాలకులు కొత్తగా ఆలోచించాలి. శాంతిస్థాపనకు కొత్త వ్యూహంతో రావాలి. పాలించే రాష్ట్రాల సంఖ్యలో మరో అంకె పెంచుకోవడం కన్నా, ప్రజలకూ, దేశానికీ అదే ముఖ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement