నిరుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాక కనబడిన దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి క్రమేపీ పెరుగుతున్న జాడలు కనబడటంతో పరిమిత స్థాయిలో కావొచ్చుగానీ... ఒక్కో రాష్ట్రమే లాక్‌డౌన్‌లు, రాత్రి పూట కర్ఫ్యూలు విధించటం వైపు అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో అక్కడక్కడ నగరాలు, జిల్లాల్లో కొన్ని పరిమితులతో లాక్‌డౌన్ విధించారు. కొన్నిచోట్ల రాత్రి పూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. పర్యవసానంగా తయారీ రంగ పరిశ్రమలు, దుకాణాలు, నిర్మాణరంగం, చిన్న చిన్న వ్యాపారాలు మూతబడటం లేదా పాక్షి కంగా మాత్రమే పనిచేయవలసివస్తోంది. మహారాష్ట్ర పూర్తి స్థాయి లాక్‌డౌన్ విషయం ఆలోచిస్తున్న దని చెబుతున్నారు. ఈ పరిణామాలు వలస జీవుల్లో సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది వున్నకొద్దీ తీవ్రమై గతంలో మాదిరే పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తారని భయాందోళనలు ఏర్పడ టంతో వారు స్వస్థలాలకు వెళ్లడం తప్ప మార్గం లేదనుకుంటున్నారు. ఇప్పటికైతే ఈ వలసలు అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కనబడుతున్నాయి. పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించబోమని... రైళ్లు, బస్సులు యథాప్రకారం నడుస్తాయని ప్రభుత్వాలు వాగ్దానాలిస్తున్నాయి. ఎవరూ రోడ్డున పడే పరిస్థితి వుండదని హామీ ఇస్తున్నాయి. భయపడవద్దని కోరుతున్నాయి. కానీ వాటిని ఎంతవరకూ విశ్వసించవచ్చునో సామాన్యులు తేల్చుకోలేకపోతున్నారు. పరిస్థితి శ్రుతిమించితే ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలవు? పూర్తి స్థాయి కావొచ్చు... పాక్షికంగా కావొచ్చు లాక్‌డౌన్ విధిస్తే అందరి కన్నా దాని ప్రభావం అధికంగా పడేది దినసరి కూలీలు, కార్మికులు వంటి అట్టడుగు జీవులపైనే. క్రితంసారి ఆకలితోనో, అర్ధాకలితోనో గడపక తప్పని రోజులు వారు మరిచిపోలేదు. అందుకే పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి వుంటున్నాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకెళ్లే రైళ్లు, బస్సులు జనంతో కిటకిటలాడుతున్నాయి. నిరుటితో పోలిస్తే ఇప్పు డున్న పరిస్థితి భిన్నమైనది. అప్పట్లో కేవలం మూడు గంటల సమయం మాత్రమే ఇచ్చి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. పైగా అది దేశంలో తొలిసారి కావడంతో దానివల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న అవగాహన చాలామందికి లేదు. పైగా వలసజీవులకు ఇన్నాళ్లూ ఉపాధి కల్పిస్తున్నవారే లాక్‌డౌన్ ఎత్తేసేవరకూ వారి బాధ్యత తీసుకోవాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. కానీ దాన్ని పాటించినవారు అతి కొద్దిమంది. పర్యవసానంగా వలసజీవులు దిక్కులేని పక్షుల య్యారు. లక్షలాదిమంది రోడ్లమీదికొచ్చారు. వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామా లకు నడకదారి పట్టారు. పోలీసులు అడ్డుకున్నా, ఎండలు మండిపోతున్నా, ఆకలి బాధిస్తున్నా వెనక్కి తగ్గలేదు. మార్గమధ్యంలో కొందరు అభాగ్యులు ఆకలితో, అనారోగ్యంతో కన్నుమూశారు.
ఇప్పుడు మరోసారి స్వస్థలాలకు ప్రయాణం కడుతున్న వలసజీవుల్ని తప్పుబట్టడానికి లేదు. అయితే కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వర్తమానంలో ఇది ప్రమాదకరమైన పరిణామం. వారి నిష్క్రమణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ తొమ్మిది పది నెలలుగా పరిస్థితి కాస్త మెరుగుపడినా ఏ రంగమూ ఇంతవరకూ పూర్వ స్థాయికి చేరలేదు. వ్యాపార, వాణిజ్య కార్య కలాపాలు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. తాజా పరిణామాల వల్ల అవి మరింత కుదేలవు తాయి. ఇటు ప్రజారోగ్య రంగం సైతం ఇబ్బందుల్లో పడుతుంది. శరవేగంతో మహమ్మారి విస్తరి స్తున్న ప్రస్తుత తరుణంలో జనం సరిగా మాస్కులు ధరించకుండా ఇలా పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడితే దాని దుష్ఫలితాలెలా వుంటాయన్నది తెలియనిది కాదు. ఇప్పుడిదే అందరినీ ఆందో ళనలో పడేస్తున్న విషయం. నిరుటితో పోలిస్తే ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. ఇంతవరకూ దాదాపు పది కోట్లమంది జనం టీకాలు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే టీకాలు అందుబాటులోకొచ్చినవారు నిండా 8 శాతంమంది కూడా లేరు. పైగా వీరిలో అనేకులు రెండో డోస్ తీసుకోలేదు. వలస కూలీలకు వారు పనిచేసేచోట పెద్దగా పలుకు బడివుండదు కనుక, వారిలో ఎంతమందికి టీకాలందాయో అంచనా వేయటం కష్టం. దీని సంగతలావుంచి వ్యాక్సిన్ తీసుకున్నంతమాత్రాన వైరస్ నుంచి రక్షణ కలుగుతుందన్న నమ్మకం లేదని, మాస్కులు ధరించటం తప్పనిసరని వైద్య రంగ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ కిటకిటలాడుతూ కనిపిస్తున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూస్తుంటే వాటిని ఎవరూ పాటిస్తున్న దాఖలాలు లేవు.
ఈ పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా అందరిలోనూ భరోసా కలిగించాల్సిన అవసరం వుంది. ఆ భరోసా మాటల్లోకన్నా చేతల్లో కనబడాలి. గత అనుభవాలరీత్యా వలస కూలీలకు కావలసిన రేషన్, ఇతర నిత్యావసరాలు సరఫరా అయ్యేలా చూడాలి. నిరుడు విధించిన లాక్‌డౌన్ ముగిశాక కేంద్ర ప్రభుత్వం వలసజీవుల డేటా సేకరణకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా విధానం రూపొందింది. ఈ విషయంలో ఏమేరకు ముందడుగు పడిందో తెలియదుగానీ... అలాంటి ఏర్పాటుంటే వలస కూలీలను గుర్తించి, వారికి సాయపడటం ఇప్పుడు సులభమయ్యేది. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి అనువుగా వలస కూలీలకు భరోసా కల్పించడం, ఎక్కడివారక్కడ వుండేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి.
వలసపక్షుల బెంగ
Published Wed, Apr 21 2021 1:44 AM | Last Updated on Wed, Apr 21 2021 3:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment