సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు తమను పంపాలంటూ గురువారం బెంగళూరులో అధికారులను వేడుకుంటున్న వలసకూలీలు
న్యూఢిల్లీ: కష్టం సుఖం పంచుకునే వారుంటే గంజైనా తాగి బతకవచ్చునన్న వలస కూలీల ఎదురు చూపులు ఫలించడం లేదు. కేంద్ర ప్రభుత్వం వారిని సొంతూళ్లకి పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పలు రాష్ట్రాలు ఇంకా అనుమతులు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వలస కార్మికుల్ని బస్సుల్లో తీసుకురావడం సాధ్యం కాదంటూ పలు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలకు చెందిన వారు చాలా మంది దక్షిణాది రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఉన్నారు.
కొన్ని రాష్ట్రాలను దాటుకుంటూ వారిని బస్సుల్లో తీసుకురావడం కష్టమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. తాత్కాలికంగానైనా రైళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వలస కూలీలను బస్సుల్లో తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ లేఖ రాశారు. ఇప్పటికే 8 లక్షల మంది వరకు తిరిగి సొంతూరికి వస్తామని దరఖాస్తు చేసుకున్నారని వారిని ఎలా తీసుకురావాలని ప్రశ్నించారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వలస కూలీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. తమిళనాడుకి చెందిన వలస కూలీలు దాదాపుగా 4 లక్షల మంది వరకు ఉంటారని, బిహార్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న వారిని బస్సుల్లో తీసుకురావడం అయ్యే పనికాదని అక్కడ అధికారులు తేల్చేశారు.
ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్న 20వేల మంది వలస కూలీలను గురువారం వెనక్కి తీసుకువచ్చినట్టుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. రాజస్తాన్‌లో చిక్కుకుపోయిన వారిని 200 బస్సుల్లో తీసుకువచ్చామని అదనపు ప్రధాన కార్యదర్శి సీపీ కేసరి చెప్పారు. వీళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించాక వాళ్ల సొంతూళ్లకి పంపిస్తామని తెలిపారు. ప్రతీరోజూ కాలి నడకన 2 వేల నుంచి 3 వేల మంది రాష్ట్ర సరిహద్దులకి చేరుకుంటున్నారని వివరించారు. మరోవైపు రాజస్తాన్‌లో చిక్కుకుపోయిన పంజాబ్, హర్యానా, గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 40 వేల మందికి పైగా వలస కూలీలు తిరిగి సొంతూళ్లకి ప్రయాణమవుతున్నారు. వారిని వెనక్కి తీసుకురావడానికి ఆయా రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఒకేసారి టెస్ట్‌లు అసాధ్యం
వేలాది మంది వలస కూలీలు ఒకేసారి రాష్ట్రాలకు చేరుకుంటే వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం కూడా అసాధ్యమేనని పలు రాష్ట్రాల అధికార యంత్రాంగం చెబుతోంది. వారిలో ఎవరికైనా వైరస్ సోకి ఉంటే సమూహ వ్యాప్తికి దారి తీయవచ్చునన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఖర్చులు వాళ్లవే..
కర్ణాటక ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని రాష్ట్రంలోకి రావడానికి అనుమతిచ్చింది. సొంతూళ్లకి రావాలని అనుకుంటున్న వారు ఎవరైనా ప్రయాణ ఖర్చులు వాళ్లే భరించుకోవాలని, ప్రభుత్వం బస్సుల్ని మాత్రమే ఏర్పాటు చేస్తుందని కర్ణాటక మంత్రి జేసీ మధు స్వామి స్పష్టం చేశారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించాకే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తామన్నారు. రాష్ట్రంలో కూడా ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లడానికి ఒకేసారి అనుమతినిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment