మొన్న హాంకాంగ్‌నూ, నిన్న అమెరికానూ తాకిన యువతరం ఆగ్రహజ్వాలలు ఇప్పుడు రెండు ఖండాల్లోని రెండు దేశాలను చుట్టుముట్టాయి. ఆగ్నేయాసియాలోని థాయ్‌లాండ్, తూర్పు యూరప్ లోని బెలారస్‌లు తాజాగా ఉద్యమ వేదికలయ్యాయి. రెండుచోట్లా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించా లన్నదే ఉద్యమకారుల ప్రధాన డిమాండు. థాయ్‌లాండ్‌లో సైనిక తిరుగుబాట్లు కొత్త కాదు. అక్కడ 2014లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశ చరిత్రలో అది పన్నెండో సైనిక తిరుగుబాటు. ప్రతిసారీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే అధికారాన్ని స్వాధీనం చేసుకున్నా మని సైనికాధికారులు చెప్పడం రివాజు. అలాగే అనంతరకాలంలో ఉద్యమాలు చెలరేగడం, ప్రజా స్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడటం కూడా తరచు జరుగుతున్నదే.
ఈ క్రమంలో ఎక్కడా రాజరి కాన్ని ప్రశ్నించడం కనబడదు. రాజును విమర్శించినా, రాజరికాన్ని ప్రశ్నించినా ఆ దేశంలో మూడు నుంచి పదిహేనేళ్ల వరకూ శిక్ష పడుతుంది. ఆ శిక్ష మాటెలావున్నా ఛాందసవాద దేశంగా ముద్రపడిన థాయ్‌లాండ్‌లో జనం రాజుగారి జోలికి వెళ్లిన సందర్భాలు పెద్దగా లేవు. కానీ ఈసారి వరస మారింది. దేశంలో ఏం జరుగుతున్నా పట్టనట్టు వుంటున్న రాజరికాన్ని ప్రక్షాళన చేయాలని, రాజ్యాం గాన్ని పూర్తిగా మార్చాలని కోరుతూ ఉద్యమం మొదలైంది. ఇది అనుకోని పరిణామం. సైనిక పాల కులు కూడా దీన్ని ఊహించలేదంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలు మొదలుకొని కళాశాలలు, విశ్వ విద్యాలయాల వరకూ అన్నీ ఉద్యమకేంద్రాలయ్యాయి. దాంతో అణచివేత మొదలైంది.
నియంతలు అధికారదాహంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం మొదలయ్యాక వారిపై జనంలో ఏవగింపు ప్రారంభమవుతుంది. ఆ పాలకులు తమకున్న పరిమితులేమిటో సకాలంలో గ్రహంచి జాగ్తత్తగా వుంటే పేచీ వుండదు. కానీ విచక్షణ కోల్పోయినవారికి పరిమితులు తెలిసే అవ కాశం లేదు. కనుకనే ఉద్యమాలు నానాటికీ తీవ్రమవుతాయి. ప్రస్తుతం ఉద్యమిస్తున్నవారు రాజరికం కూలిపోవాలని కోరుకోవడం లేదు. దేశం పూర్తి స్థాయి రిపబ్లిక్‌గా అవతరించాలని వాంఛించడం లేదు. రాజరికం ఉండాలంటున్నారు. కానీ అది ప్రజాస్వామ్య వ్యవస్థకు లోబడి పనిచేయాలంటు న్నారు. వారు పది డిమాండ్లు పాలకుల ముందుంచారు. రాజరికాన్ని విమర్శిస్తే జైలుకుపంపే నిబం ధన తొలగించాలంటున్నారు. రాజరికాన్ని ఘనంగా, ఏకపక్షంగా కీర్తించే సిలబస్ ఉండరాదంటు న్నారు. మారిన ప్రపంచంలో తమకూ మెరుగైన అవకాశాలు లభించేలా ఎదగాలని యువతరం కోరు కుంటోంది. అందుకు తగ్గ సిలబస్ అవసరమంటోంది.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కావాలంటోంది. ఇప్ప టికైతే ఉద్యమం ప్రశాంతంగానే సాగుతోంది. ఉద్యమకారులు కూడా కొత్త కొత్త పోకడలతో దాన్ని సాగిస్తున్నారు. వాట్సాప్ మొదలుకొని ఫ్లాష్‌మాబ్ వరకూ అన్ని రకాల వేదికలను నిరసనలకు ఉపయోగిస్తున్నారు. రోజూ ఉదయమే పాఠశాలల్లో జాతీయగీతాలాపన సాగే సమయంలో పిల్లలు తిరుగుబాటుకు సూచనగా చేతులు పైకి ఎత్తి, మూడువేళ్లతో సెల్యూట్ చేయడం కొనసాగుతోంది. ఈ ఉద్యమం నిరుడు డిసెంబర్‌లో మొదలైంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడిన తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో నిలిచిపోయింది. అయితే మొన్న జూన్‌లో కంబోడియాలో వుంటున్న థాయ్ లాండ్ మానవహక్కుల కార్యకర్త ఒకరిని సాయుధులు అపహరించడంతో ఉద్యమం మళ్లీ ప్రారం భమైంది. ఆ అపహరణ వెనక థాయ్ సైన్యం హస్తం వుందన్నది ఉద్యమకారుల ఆరోపణ. ఆగ్నేయా సియాలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న థాయ్‌లాండ్ ఇప్పటికే నిరుద్యోగం, అధికధరలు వంటి సమస్యలతో సతమతమవుతోంది.
ఇంచుమించు ఇవే కారణాలతో తూర్పు యూరప్‌లోని బెలారస్‌లో ఉద్యమం రాజుకుంది. అక్కడ పేరుకు ప్రజాస్వామ్యం వుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి స్వాతంత్య్రం లభించాక 1994లో జరిగిన తొలి అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకషెంకో అధికార పీఠాన్ని అధిరోహించారు. అప్పటినుంచీ ఆయన ఆ పీఠాన్ని దిగలేదు. 26 ఏళ్లుగా ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఆయనే అధ్యక్షుడు! దీనిపై ఎప్పటికప్పుడు విమర్శలొస్తున్నా అవి ఉద్యమ రూపం తీసుకోలేదు. ఒకపక్క క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, మరోపక్క పెద్దన్నలా వ్యవహరిస్తున్న పొరుగు దేశం రష్యాను ఆయన నిలువరించలేకపోవడం జనంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. అందుకే ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ముందు జరిగిన సర్వేలో ఆయనకు స్వల్ప సంఖ్యలో మద్దతుందని తేలింది. తీరా ఫలితాలు అందుకు భిన్నంగా రావడమే ప్రస్తుత ఉద్యమానికి మూలం. లుకషెంకో ఎక్కడికెళ్లినా నిరసనలు ఎదురుకావడం, రాజీనామా చేయాలంటూ జనం నినదించడం విశేషం.
ఆఖరికి ప్రభుత్వ నిర్వహణలోని చానెల్‌లో ఉదయం ప్రసారాల సమయంలో సిబ్బంది ఉద్యమానికి మద్దతుగా నిష్క్రమించడంతో కొంతసేపు సంగీతంతో సరిపెట్టాల్సివచ్చింది. విదేశాంగ శాఖ కార్యాలయంలోని ఒక విభాగం అధిపతి, మరొక ఉద్యోగి ధర్నాకు దిగారు. వేలాదిమందిని జైళ్లకు పంపడం, విచక్షణారహితంగా బలప్రయోగం చేయడం ప్రజలకు ఆగ్రహం కలిగిస్తోంది. యూ ట్యూబ్ ద్వారా సుపరిచితుడైన సెర్గీతిఖనోవ్‌స్కీ లుకషెంకోకు వ్యతిరేకంగా పోటీచేస్తానని ప్రకటిం చిన వెంటనే అధికారులు తప్పుడు ఆరోపణలతో అతన్ని నిర్బంధించారు. వెంటనే అతని భార్య స్వెతలానా బరిలో నిలబడతానని ప్రకటించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో విజేత ఆమేనని అత్యధి కులు విశ్వసిస్తున్నారు. సాధారణ గృహిణిగా వున్న ఆమె ఇప్పుడు అమాంతం ఉద్యమకారిణిగా ఎదిగారు. అయితే బెలారస్‌లోని ఉద్యమంపై లుకషెంకోను మించి పొరుగునున్న రష్యా అధినేత పుతిన్‌కు ఆందోళన వుంది. ఈ ఉద్యమం మరింత ఉధృతమై, విజయం సాధిస్తే రష్యాలో కూడా రాజుకుంటుందని ఆయన భయం. మొత్తానికి జనం సహనాన్ని పరీక్షిస్తే, ఇష్టానుసారం పాలిస్తే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, పదవులకు ఎసరు తెస్తుందని థాయ్‌లాండ్, బెలారస్‌లు నిరూపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment