ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై, ప్రత్యేకించి పేద, ధనిక వర్గాల మధ్యా, వివిధ ప్రాంతాల మధ్యా పెరుగుతున్న అంతరాలపై ఎట్టకేలకు పాకిస్తాన్ దృష్టి సారించినట్టు కనబడుతోంది. అంతే కాదు... ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించా ల్సిన అవసరాన్ని కూడా అది గుర్తించింది. మొన్న శుక్రవారం విడుదల చేసిన పాకిస్తాన్ జాతీయ భద్రతా విధాన పత్రం జమ్మూ–కశ్మీర్‌తో సహా చాలా అంశాలను స్పృశించింది. పాకిస్తాన్‌ను ఏలు తున్నది పౌర ప్రభుత్వమే అయినా, అది సైన్యం కనుసన్నల్లో పనిచేస్తుంది. ఒక దేశంగా ఆవిర్భ వించాక పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ఏ పౌర ప్రభుత్వమూ అక్కడ మనుగడ సాగించిన దాఖలా లేదు. కనుక ఇప్పుడు విడుదల చేసిన విధాన పత్రానికి సైన్యం ఆమోదముద్ర కూడా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ఏడేళ్ల ‘వ్యూహాత్మక మేధోమథనం’ తదుపరి ఇది రూపొందిందని చెబుతున్నారు. అయితే ప్రవచించే ఆశయాలకూ, ఆచరణ తీరుకూ మధ్య సమన్వయం కొరవడినప్పుడు ఏ విధానమైనా నవ్వులపాలవుతుంది. ప్రకటించినవారి చిత్తశుద్ధిపై సందేహాలు తలెత్తుతాయి. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... పాకిస్తాన్ తన జాతీయ భద్రతా విధాన పత్రాన్ని ప్రకటించిన రోజునే భారత్–పాక్ సరిహద్దుల్లో అయిదు కిలోల బాంబును మన భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ఘటనకు ముందూ వెనకా పాక్ నుంచి చొరబాట్లు చోటుచేసుకున్నాయి. వచ్చే నాలుగేళ్లకూ వర్తించగల ఈ విధాన పత్రంలో సహజంగానే పొరుగునున్న మన దేశంపై పాక్ ప్రధానంగా దృష్టి సారించింది. 62 పేజీల ఆ పత్రంలో 16 సార్లు మన దేశం ప్రస్తావనకొచ్చింది. జమ్మూ–కశ్మీర్ విషయానికొస్తే దాన్ని ‘ద్వైపాక్షిక సంబంధాల్లో అంతర్భాగమైన’ సమస్యగా అభివర్ణించింది. ఆ సమస్యను ‘శాంతియుతంగా’ పరిష్కరించుకోవడమే తన ఉద్దేశమని ప్రకటించింది.
కశ్మీర్ విషయంలో మన దేశం వైఖరికీ, పాక్ ఆలోచనకూ ఎక్కడా పొంతన లేదు. దేశ విభజన కాలంనుంచీ కశ్మీర్‌ను మన దేశం ఆంతరంగిక వ్యవహారంగానే పరిగణిస్తోంది. పాకిస్తాన్ దీన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ కశ్మీర్ పరిష్కారం ‘అసంపూర్ణ ఎజెండా’గానే భావిస్తోంది. అందుకోసమే మనతో నాలుగుసార్లు కయ్యానికి దిగింది. మూడున్నర దశాబ్దాలుగా చొరబాటుదార్ల ద్వారా పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దాని విషాద పర్యవసానాలను కశ్మీర్ అనుభవిస్తున్నది. కశ్మీర్‌లో కొంత ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్‌ను అప్ప గించడంపైనేనని మన దేశం చెబుతోంది. తాజాగా విడుదల చేసిన విధాన పత్రం వచ్చే వందేళ్ల కాలంలో భారత్‌తో శత్రుత్వాన్ని కోరుకోవడంలేదని చెబుతూనే... ఇదంతా కశ్మీర్ డిమాండ్‌ను ఆ దేశం పట్టించుకోవటంపై ఆధారపడి ఉంటుందని షరతు విధించింది. కనుక తాజా విధానం అమలుతో పాకిస్తాన్ వైఖరిలో కలిగే మహత్తరమైన మార్పు ఏమీ ఉండదన్న మాట! అది బహిరం గంగా ఒప్పుకున్నా లేకున్నా ఈ వైఖరికీ, పాకిస్తాన్‌కు ఆర్థికంగా వచ్చిపడుతున్న కష్టాలకూ మధ్య సంబంధం ఉంది. భారత్‌తో నేరుగా తలపడలేక మతం పేరిట యువతలో విషబీజాలు నాటి, వారికి ఆయుధాలిచ్చి కశ్మీర్‌లో అలజడులు సృష్టించడానికి పంపే విధానం చివరకు ఆ దేశంలో కూడా ఉగ్రవాదం పెరగడానికి దోహదపడింది. అంతక్రితం మాటేమోగానీ... గత రెండు దశాబ్దా లకుపైగా ఉగ్రవాద ఘటనలతో విసుగెత్తిన ప్రపంచ దేశాలు లోపాయికారీగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలను చూసీచూడనట్టు వదిలే పరిస్థితి లేదు. కనుకనే ఆర్థికంగా తీసుకొచ్చే సంస్కర ణలతోపాటు ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు చర్యలు తీసుకుంటేనే రుణాలిస్తామని ఐఎంఎఫ్ వంటి సంస్థలు షరతులు విధిస్తున్నాయి. ఉగ్రవాద వ్యాప్తినీ, ఉగ్ర సంస్థలకు నిధుల మళ్లింపునూ అడ్డుకునే విషయంలో జీ–7 దేశాల ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) రూపొందించిన నిబంధనలను సంతృప్తికరంగా అమలు చేయడంలో పాకిస్తాన్ విఫలమైనందువల్ల దాన్ని ‘అనుమానాస్పద దేశాల’ జాబితాలో చేర్చారు. పర్యవసానంగా ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వగైరా సంస్థలనుంచి నిధులు రాబట్టడం పాకిస్తాన్‌కు కష్టంగా మారింది. దాన్నుంచి బయటపడటంలో భాగంగానే అప్పుడప్పుడు ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ కనబడుతుంది. తాజా విధానపత్రం అలాంటి చర్యలవంటిదే అయితే దానివల్ల పాకిస్తాన్‌కైనా, మొత్తంగా ఈ ప్రాంతానికైనా కలిగే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు.
కేవలం భద్రతాపరమైన అంశాలను మాత్రమే పట్టించుకుని ఊరుకోకుండా ఆర్థికాభివృద్ధికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన చర్యలేమిటో, అవి దేశ భద్రతకు ఎలా ఉపయోగపడతాయో ఈ విధానపత్రం వివరించే ప్రయత్నం చేసింది. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధితో మానవభద్రత ముడిపడి ఉంటుందని తెలిపింది. అయితే సామాజిక సుస్థిరతకూ, ఆర్థికాభివృద్ధికీ ఉగ్రవాదం పెను ఆటంకమవుతుందని గుర్తించింది కనుక ఆ దిశగా దాని ఆచరణ ఉంటుందని ప్రపంచ దేశాలు ఆశిస్తాయి. ఈ విషయంలో అది మున్ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది కూడా. సైన్యం సహకారం లేనిదే, దాని పనితీరు మారనిదే ఇదంతా సాధ్యపడదు. కనుక భారత్‌నుంచి రాగల ముప్పు గురించి అనవసర ఆందోళనలు మానుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే పాకిస్తాన్‌కు మెరుగైన భవిష్యత్తు ఉంటుంది.
ఆత్మవిమర్శే ఔషధం
Published Wed, Jan 19 2022 12:24 AM | Last Updated on Wed, Jan 19 2022 12:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment