Sakshi Editorial Story On Pakistan Former PM Imran Khan In Telugu - Sakshi
Sakshi News home page

పాక్‌లో మళ్ళీ పాత కథే!

Published Tue, Aug 8 2023 12:17 AM | Last Updated on Tue, Aug 8 2023 9:04 AM

Sakshi Editorial On Pakistan Imran Khan

నేతల పేర్లు మారవచ్చు... ఆరోపణలు మారవచ్చు... పాక్‌లో మాత్రం ఒకే కథ పునరావృత మవుతూ ఉంటుంది. ప్రధాని పీఠమెక్కినవారు సైన్యం అనుగ్రహం కోల్పోయాక ఏదోక ఆరోపణలో జైలుపాలవుతారు. అదృష్టం బాగుంటే బతికిబట్టకడతారు. లేదంటే శంకరగిరి మాన్యాలు పడతారు. జుల్ఫికర్‌ అలీ భుట్టో నుంచి బెనజీర్, నవాజ్‌ షరీఫ్‌ల దాకా ఇదే పరిస్థితి. ఇప్పుడు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ వంతు.

తీవ్రవాదానికి ప్రోత్సాహం, సైనిక స్థావరాలపై దాడులకు పథకరచన లాంటి తీవ్ర ఆరోపణల నుంచి వచ్చిన కానుకల్ని అక్రమంగా అమ్ముకున్నారనే ‘తోషా ఖానా’ కేసు దాకా 150 దాకా కేసులున్న ఇమ్రాన్‌ను ఊహించినట్టే జైలులో పెట్టారు. ఎప్పటిలానే మిగతా వ్యవస్థంతా పరోక్ష మద్దతు నివ్వగా, పాక్‌ కోర్టు మరో పాపులర్‌ నేత రాజకీయ జీవితానికి తెరదించేందుకు తెగించింది. 

తోషాఖానా కేసులో పాకిస్తానీ కోర్ట్‌ ఆగస్ట్‌ 5న ఇమ్రాన్‌కు మూడేళ్ళ గరిష్ఠ శిక్ష వేసింది. రాజ్యాంగం ప్రకారం శిక్షపడ్డవారు అయిదేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనరాదు గనక, ఈ మాజీ ప్రధానిని అలా బరిలో లేకుండా చేసింది. చివరకు సొంత పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ)కి అధినేతగానూ ఇమ్రాన్‌ కొనసాగరాదు. వెరసి, షరీఫ్‌లు, జర్దారీలు, మౌలానా ఫజల్‌ ఉర్‌ రెహ్మాన్‌ లాంటి సైన్యం ఆశీస్సులున్న వారికి ఎన్నికల బరిలో మార్గం సుగమం చేసింది.

ఇమ్రాన్‌ జైలు పాలయ్యీ కాగానే, ఈ క్షణం కోసమే ఆగినట్టున్న ప్రధాని షెహజాబ్‌ షరీఫ్‌ ఆగస్ట్‌ 9న పార్లమెంట్‌ను రద్దు చేయనున్నారు. నవంబర్‌ మధ్యలో జరగాల్సిన ఎన్నికలు ఓటర్ల జాబితా సవరణ, నియోజకవర్గ విభజన సాకులతో ఆరు నెలల దాకా వాయిదా పడతాయని అంచనా. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణల్లో అగ్రస్థానంలో ఉన్న ఇమ్రాన్‌ జైలులో ఉంటారు గనక ఆ లోగా ఓటర్లలో తాము పట్టు సంపాదించాలన్నది షెహబాజ్‌ సారథ్యంలోని అధికార పార్టీ, మిత్రపక్షాల వ్యూహం. 

ఇమ్రాన్‌పై మోపింది పెద్దగా పసలేని అభియోగమైనా, విధించినది మాత్రం కఠిన శిక్షే! చరిత్ర చూస్తే పాకిస్తాన్‌ మాజీ ప్రధానులు షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీ, నవాజ్‌ షరీఫ్, బెనజీర్‌ భుట్టో, జుల్ఫికర్‌ అలీ భుట్టో, హుస్సేన్‌ షహీద్‌ సుఖ్రావర్దీలకు కూడా రాజ్యవ్యవస్థ చేతిలో ఇదే పరిస్థితే ఎదురైంది. వారంతా ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అయితే, చివరకు వారిపైన మోపిన అభియోగాలేవీ కాల పరీక్షకు నిలబడలేదు.

గతంలో జీతం విషయంలో నేరం మోపి, నవాజ్‌ షరీఫ్‌ రాజకీయ ఆకాంక్షలకు గండి కొట్టారు. ఇప్పుడు ఇమ్రాన్‌కూ సరిగ్గా అలాగే చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు అందుకున్న కానుకల వివరాలను ఇమ్రాన్‌ సరిగ్గా వెల్లడించలేదనే మిష చూపారు. షరీఫ్, ఇమ్రాన్‌ల ఇద్దరి విష యంలోనూ చేసిన నేరానికీ, వేసిన శిక్ష తాలూకు తీవ్రతకూ పొంతన లేదన్నది బహిరంగ రహస్యం. 

వచ్చిన కానుకల రికార్డులు, ఆస్తుల ప్రకటన విషయంలో నిబంధనల్ని పాటించకుండా ఇమ్రాన్‌ తప్పు చేసిన మాట నిజమే. కానీ, తోషాఖానా రికార్డుల్ని నిశితంగా పరిశీలించి, అధికారిక హోదాలో కానుకలు అందుకున్న ఎవరెవరు సరిగ్గా ఆ వివరాలు అందించారనే లెక్కలను గనక ఇంతే కఠినంగా బయటకు తీస్తే మునుపున్న ఎవరూ నిర్దోషులుగా మిగలకపోవచ్చు.

అలాంటప్పుడు ఇమ్రాన్‌కు మాత్రం అదే నేరానికి కోర్టు గరిష్ఠ శిక్ష విధించడమేమిటి? అసలీ మొత్తం వ్యవహారంలో విచారణ జరిగిన తీరు, ఎక్కడ లేని హడావిడితో కోర్టు తీర్పు ప్రకటించిన వైనం ప్రశ్నలకు తావిస్తోంది. విధించిన కఠినశిక్షపై ఇమ్రాన్‌ పై కోర్టుకు వెళ్ళే వీలు, అక్కడ ఊరట దక్కే అవకాశం లేకపోలేదు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తీవ్రనేరాలను సైతం నిత్యం ఉపేక్షించే రాజ్యవ్యవస్థ ప్రజానేతలపై మాత్రం మామూలు అంశాలపైనా అభియోగాలతో, శిక్షలు విధించడమే గమనార్హం.

ఇమ్రాన్‌ తన ముందువారిలా ఆర్మీ ఆదేశాలకు తలాడించకపోవడం తప్పయింది. 2022 ఏప్రిల్‌లో పార్లమెంట్‌లో మెజారిటీ కోల్పోయినప్పటి నుంచి సైనిక నాయకత్వాన్ని సవాలు చేశారు. ర్యాలీలు చేశారు. మొన్న మేలో ఆయనను అరెస్టు చేసినప్పుడు జరిగిన భారీ కల్లోలాల్లో సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. దీన్ని అందిపుచ్చుకున్న ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ నిరసన కారుల్ని అణచివేశారు.

మీడియా నోరునొక్కారు. ఇమ్రాన్‌ సొంత పార్టీ నుంచి ఫిరాయింపులు చేయించారు. ఇప్పుడు ఇమ్రాన్‌ జైలు పాలయ్యేలా చూశారు. ఎన్నడూ పెద్దగా ప్రజాస్వామ్యం పరిఢ విల్లని పాక్‌లో అంతకంతకూ సైనిక జోక్యం పెరుగుతున్న తీరుకు ఇది తాజా ఉదాహరణ. నిజానికి, 2017లో నవాజ్‌ షరీఫ్‌ను దించి, ఇమ్రాన్‌ను గద్దెనెక్కించిందీ సైన్యమే. 2018 జనరల్‌ ఎన్నికల్లో ఫలి తాల్ని అనుకూలంగా మలిచి, ఆనక పార్లమెంట్‌లో ఇమ్రాన్‌కు మెజారిటీ వచ్చేలా చేసిందీ సైన్యమే.   

అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యంపై గౌరవమే చూపని ఈ మాజీ క్రికెటర్‌ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. కొత్త ఆర్మీ ఛీఫ్‌ మునీర్‌ పట్టు బిగిస్తున్నారు. అయితే సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హులుగా ప్రకటించినంతనే జనాకర్షక నేతల కథకు తెరపడుతుందనుకోలేం. నవాజ్, బెనజీర్‌ల విషయంలో ఇదే జరిగింది. రేపు ఇమ్రానైనా అంతే! సైన్యమేమో తన స్వార్థం కోసం రాజకీయ నాయకత్వాన్ని అదిలించి, బెదిరించి పబ్బం గడుపుకుంటూ ఉంటే, కోర్టులేమో పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నాయి.

రెంటి మధ్య పాకిస్తాన్‌ రాజకీయాలు చిక్కుకుపోయాయి. ప్రతీకారాలతో నిలువునా చీలిపోయాయి. దేశంలో ఆర్థిక సంక్షోభానికి తోడు రాజకీయ అలక్ష్యంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కావాల్సింది – దేశాన్ని ఆర్థిక పురోగతి పథంలో నడిపించే దీర్ఘదృష్టి. పాలకులు, వ్యవస్థలు అది మర్చిపోయి, ప్రత్యర్థుల్ని వేటాడే పనిలో మునిగి పోవడమే విచారకరం. వ్యవస్థలు రాజకీయమయమైతే ఇలాంటి దురవస్థలే దాపురిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement