రఫేల్‌పై సందేహాలు!  | Sakshi Editorial On Rafale Fighter Jet Allegations Done By France | Sakshi
Sakshi News home page

రఫేల్‌పై సందేహాలు! 

Published Thu, Apr 8 2021 12:36 AM | Last Updated on Thu, Apr 8 2021 12:48 AM

Sakshi Editorial On Rafale Fighter Jet Allegations Done By France

రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలపై కుంభకోణం ఆరోపణలు వచ్చాయంటే, అవి అంతూ దరీ లేకుండా అందులో కొట్టుమిట్టాడుతూనే వుంటాయని లోగడ బోఫోర్స్‌ స్కాం నిరూపించింది. రఫేల్‌ ఒప్పందం కూడా ఆ బాటలోనే పయనిస్తోందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. మన వైమానిక దళానికి యుద్ధ వేళల్లో సమర్థవంతంగా తోడ్పడగలదని భావించిన రఫేల్‌ విమానాల దిగుమతికి 2016లో మన దేశం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 59,000 కోట్ల విలువైన ఆ ఒప్పందం కింద భారత్‌కు 36 యుద్ధ విమానాలు అందించటానికి ఆ దేశం అంగీకరించింది. ఆ ఒప్పందానికి అనుగుణంగా నిరుడు జూలైలో తొలి విడతగా అయిదు విమానాలు మన దేశానికి చేరు కున్నాయి. అయితే అందులో కొంత మొత్తం చేతులుమారిందంటూ ఫ్రాన్స్‌కు చెందిన ‘మీడియా పార్ట్‌’ అనే ఆన్‌లైన్‌ సంస్థ చెబుతోంది. ఆ ఒప్పందంపై సంతకాలయ్యాక భారత్‌లోని మధ్యవర్తికి రఫేల్‌ ఉత్పత్తిదారైన డసాల్ట్‌ సంస్థ పది లక్షల యూరోలు చెల్లించటానికి అంగీకరించిందని, ‘ఖాతాదారులకు బహుమతులు’ పేరిట 5,08,925 యూరోలు ఆ మరుసటి ఏడాది చెల్లించారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటుకు సమర్పించిన కాగ్‌ నివేదిక రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇవే యుద్ధ విమానాల కోసం ఖరారు చేసుకున్న ధరతో పోలిస్తే 2.86 శాతం తక్కువని తేల్చింది. ఈ విషయంలో దర్యాప్తు అవసరమేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతా సమసిపోయిందనుకుంటున్న తరుణంలో సోమవారం ‘మీడియా పార్ట్‌’ వెల్లడించిన ముడు పుల వ్యవహారం దానికి మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేసింది. అయితే ఈసారి విపక్షాలు కోరుకున్న స్థాయిలో దీనిపై రచ్చ సాగలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కూడా జనం పెద్దగా దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు. ఇందుకు భిన్నంగా బోఫోర్స్‌ స్కాంపై హడావుడి దీర్ఘ కాలం కొనసాగింది. 1988లో తొలిసారి స్వీడన్‌ రేడియో బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలులో రూ. 64 కోట్లు చేతులు మారాయని వెల్లడించగానే దేశంలో పెను దుమారం లేచింది. అనంతరం 1989లో జరిగిన 9వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. ఇరవై ఆరేళ్లపాటు ఆ స్కాంకు సంబం ధించి అనేకానేక అంశాలు బయటపడుతూ చివరికి 2013లో ఇటలీకి చెందిన కీలక పాత్రధారి ఒట్టా వియో కత్రోకీ మరణం తర్వాత కనుమరుగైంది. వాస్తవానికి అంతకు రెండేళ్లముందే బోఫోర్స్‌ దర్యాప్తు తమ వల్ల కాదని ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ విన్నవించుకుంది. దాంతో పోలిస్తే రఫేల్‌ స్కాం హడావుడి దాదాపు లేదనే చెప్పాలి. 

ముడుపులు చేతులు మారాయా లేదా అన్నదే ముఖ్యం తప్ప బోఫోర్స్‌ స్కాంతో పోలిస్తే రఫేల్‌ వ్యవహారంలో ముడుపులు చాలా చిన్న మొత్తం. ‘మీడియా పార్ట్‌’ చెబుతున్న ప్రకారం మన కరె న్సీలో అది దాదాపు రూ. 9 కోట్లు. అయితే ముడుపుల మొత్తం ఎంతన్నది కాదు... అదెలా బయ టపడిందన్నదే కీలకం. ఫ్రాన్స్‌ అవినీతి వ్యతిరేక విభాగం(ఏఎఫ్‌ఏ) డసాల్ట్‌ కంపెనీకి చెందిన 2017నాటి ఖాతాలను ఆడిట్‌ చేస్తున్నప్పుడు రాఫేల్‌ యుద్ధ విమానానికి చెందిన 50 డమ్మీ నమూనాలు తయారుచేసిన సంస్థకు ఈ మొత్తం చెల్లించినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని గమ నించిన ఏఎఫ్‌ఏ అధికారి ఫ్రెంచ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీసెస్‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి తెలియజేయగా ‘దేశ ప్రయోజనాలరీత్యా’ ఇందులో దర్యాప్తు అనవసరమని ఆ విభాగం చీఫ్‌ ఎలినా హౌలెట్‌ వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ముడుపుల మొత్తాన్ని ‘డెఫ్‌సిస్‌’(డిఫెన్స్‌ సిస్టమ్స్‌) అనే భారత సంస్థకు చెల్లించినట్టు డసాల్ట్‌ ఖాతాలో నమోదైంది. ఒక్కో నమూనాకు 20,357 యూరోలు (మన కరెన్సీలో రూ. 18 లక్షలు) చొప్పున చెల్లించటం వింతగానే అనిపిస్తుంది. ఆ ధరను బట్టి చూస్తే ఒక్కో నమూనా కనీసం కారు సైజులోనైనా వుండాలి. ఇంకా విచిత్రమేమంటే ఆ నమూ నాలను పంపినట్టు తెలిపే పత్రాలుగానీ, డసాల్ట్‌ వాటిని అందుకున్నట్టు తెలిపే పత్రాలుగానీ లేవు. పైగా ఈ వ్యయాన్ని ఖాతాదారులకు ఇచ్చిన కానుకలుగా చూపడం మరింత మిస్టరీ. వీటి సంగ తలావుంచి అగస్టావెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల స్కాంలో ఇరుక్కుని గతంలో అరెస్టయిన సుసేన్‌ గుప్తాతో ఈ ‘డెఫ్‌సిస్‌’ సంస్థకు సంబంధాలుండటం ఆసక్తికరం. ఈ విషయంలో పరిశోధన సాగించిన ‘మీడియా పార్ట్‌’ పాత్రికేయుడు యాన్‌ ఫిలిప్పీన్‌ ఇంకో రెండు భాగాలున్నాయంటున్నాడు. 

ఫ్రాన్స్‌లోని ఒక చిన్న ఆన్‌లైన్‌ మీడియా సంస్థ రఫేల్‌ వ్యవహారంలో ఇంత శ్రద్ధగా పరిశోధన సాగించటం, కొన్ని ఆసక్తికర అంశాలు బయటపెట్టడం ఆశ్చర్యకరమే. మన ప్రభుత్వాలు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా రక్షణ కొనుగోళ్లకు దళారుల బెడద మాత్రం తప్పడం లేదని తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి హామీ ఇవ్వటంవల్లా, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడివున్నందువల్లా విమానాల ధర వెల్లడించటం సాధ్యంకాదని కేంద్రం లోగడ తెలిపింది. కారణాలేమైనా పారదర్శకత లేనప్పుడు రకరకాల కథనాలు గుప్పు మనడం సహజమే. ఇప్పుడు ‘మీడియా పార్ట్‌’ చేసింది కూడా అదే. ఫ్రాన్స్‌ ఆర్థిక నేరాల విభాగం చీఫ్‌ ఈ వ్యవహారంలో దర్యాప్తు ఎందుకు అవసరం లేదనుకున్నారో, ఇందులో దేశ ప్రయోజనాలతో ముడిపడివుండే అంశాలు ఏముంటాయో ఫ్రాన్స్‌ ప్రభుత్వమే చెప్పాలి. అంతవరకూ ఈ ఒప్పం దంపై సందేహాలు వెల్లువెత్తుతూనే వుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement