పరిస్థితులు అసాధారణమైతే, నిర్ణయాలూ అసాధారణంగానే ఉంటాయి. రాజ్యాంగంతో సంక్రమిం చిన అసాధారణ అధికారాలను సుప్రీమ్ కోర్టు బుధవారం వినియోగించుకున్న వైనం అలాంటిదే. ఆ అధికారాల కిందే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన పేరరివాళన్‌ను తక్షణం విడుదల చేస్తూ సుప్రీమ్ ఉత్తర్వులిచ్చింది.19 ఏళ్ళ వయసులో అరెస్టయి, 31 ఏళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినా సరే క్షమాభిక్షపై గవర్నర్ నిర్ణయం రాక, ఒక జీవితకాల నిరీక్షణలో ఉన్న వ్యక్తికి న్యాయం కోసం చివరకు కోర్టు కదలాల్సి వచ్చింది. సదరు వ్యక్తి తాలూకు ‘శిక్ష పూర్తయినట్టు భావించా’లంటూ పేర్కొనాల్సి వచ్చింది. కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య అధికార పంపిణీ – కరవైన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి లాంటి చర్చలు దేశంలో ఎక్కువైన వేళ... మంత్రిమండలి సలహా మేరకు అధికారాలను వినియోగించడమే రాష్ట్రపతి, గవర్నర్ల రాజ్యాంగ విహిత బాధ్యత అని కోర్టు చెప్పకనే చెప్పింది. నేరస్థుడికి క్షమాభిక్ష, ముందస్తు విడుదల లాంటివి రాష్ట్ర జాబితాలోవి గనక ప్రజా ప్రభుత్వాల అభీష్టమే ఆ అంశాల్లో సర్వోన్నతమని తేల్చింది.
రిటైర్డ్ తమిళ ఉపాధ్యాయుడి కుమారుడైన 50 ఏళ్ళ పేరరివాళన్ అలియాస్ అరివు పక్షాన అతని తల్లి, పలువురు వకీళ్ళు, స్నేహితులు జరిపిన న్యాయపోరాటం చివరకు ఇలా పరిణమించింది. రాజీవ్‌ను చంపిన మానవబాంబు పెట్టుకున్న బాంబుల బెల్టుకు కావాల్సిన బ్యాటరీలు సమకూర్చి నట్టు అతనిపై ఆరోపణ. దోషిగా తేలిన ఆ కేసులో అతని పాత్ర ఎంత, అతని అమాయకత్వమెంత అనేది వేరే పెద్ద చర్చ. శిక్షాకాలంలో దాదాపు 11 ఏళ్ళు చిన్న 6 బై 9 అడుగుల జైలు గదిలో అతను ఏకాంతవాస శిక్ష అనుభవించారు. తీయని ఉరి కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించారు. క్షమాభిక్ష అభ్య ర్థనపై సుదీర్ఘ జాప్యంతో 2014లో పేరరివాళన్ సహా ముగ్గురు దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది సుప్రీమ్ కోర్టు. 2015లో గవర్నర్‌ను క్షమాభిక్ష కోరుతూ, అరివు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు 2018లో గవర్నర్‌ను కోరింది. గవర్నర్ దాన్ని పట్టించుకోకపోవడంతో, అప్పటి తమిళనాడు క్యాబినెట్ అతణ్ణి విడుదల చేయాలని సిఫార్సు చేసింది. ఆ తర్వాత 2020లో సుప్రీమ్ మరో మాట చెప్పింది. అరివుపై విచారణ సాగుతున్నా, ఉపశమనం ఇచ్చేందుకు గవర్నర్‌కు అధికారం ఉందంది. చివరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం అతని క్షమాభిక్ష అంశం రాజ్‌భవన్ విచక్షణకే వదిలేసింది. అయినా సరే గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా బంతి కేంద్రం కోర్టులో వేసి, అంతా రాష్ట్రపతి ఇష్టమేనంటూ చేతులు దులుపుకొన్నారు. చివరకిప్పుడు రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకున్న అసాధారణ అధికారాన్ని సుప్రీమ్ వినియోగించాల్సి వచ్చింది. అరివు విడుదలకు ఆదేశించాల్సి వచ్చింది.
సుప్రీమ్ తాజా ఆదేశం వివాదాలూ రేపుతోంది. రాజీవ్ హత్య కేసులోని దోషులను క్షమిస్తున్నా మనీ, వారిని విడిచిపెడితే అభ్యంతరం లేదనీ ప్రియాంక సహా రాజీవ్ కుటుంబసభ్యులే గతంలో చెప్పారు. కానీ, తీరా ఇప్పుడు దోషుల్లో ఒకరైన అరివు విడుదలకు అధికార బీజేపీ వైఖరే కారణ మంటూ కాంగ్రెస్ తప్పుబట్టింది. మిగతా ఆరుగురు దోషులను కూడా విడిచిపెట్టేస్తారా అని ప్రశ్నిస్తోంది. ఇక, రాష్ట్ర గవర్నర్ పేరబెట్టిన క్షమాభిక్షను కోర్టు పరిష్కరించడంతో, రాజ్ భవన్‌పై బాణాలు వేసేందుకు తమిళనాడు సర్కారుకు సరికొత్త అస్త్రం దొరికినట్టయింది. ఒక్క అరివు క్షమా భిక్షే కాదు... ఏడాది క్రితం గద్దెనెక్కినప్పటి నుంచి ‘నీట్’ రద్దు సహా అనేక అంశాలపై స్టాలిన్ సర్కారు చేసిన పలు సిఫార్సుల గతీ ఇదే! రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు వ్యవహరించాల్సిన గవర్నర్లు తద్విరుద్ధంగా, ప్రభుత్వ సిఫార్సులపై సాచివేత ధోరణిని అవలంబిస్తున్న తీరు ఇలా మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్రం చేతిలోని గవర్నర్ల వ్యవస్థపై వస్తున్న విమర్శలకు కొత్త బలం చేకూరింది.
సుప్రీమ్ తన తాజా ఉత్తర్వులో 1980 నాటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రస్తావించింది. రాష్ట్రపతి ఓ ప్రతీక. కేంద్రప్రభుత్వమే వాస్తవం. గవర్నర్ పేరుకే పెద్ద, కార్యనిర్వాహక అధికారాలకు కేంద్రం. మంత్రిమండలి సలహా మేరకే ఆ అధికారాలను వాడవచ్చన్న మాటలను ఉటంకించింది. అధికారాల విషయంలో కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య ‘లక్ష్మణరేఖ’ ఉందంటూనే, భారత శిక్షాస్మృతి కింద విచారణ చేసినప్పుడు రాష్ట్రాన్ని తోసిపుచ్చే పై చేయి కేంద్రానికి లేదంది. ఎన్‌ఐఏ, ‘ఉపా’ లాంటి చట్టాల కింద కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసినప్పుడు తప్ప, ఏ ఇతర చట్టాల కిందా కేంద్రానిది పై మాట కాదనీ గుర్తు చేసింది. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకొనే అధికారం గవర్నర్లకు లేదనీ, సుప్రీమ్ తాజా ఆదేశాలు ‘రాష్ట్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి’కి విజయసూచిక అనీ స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఇల్లలకగానే పండగ కాదు. ఈ ఒక్క తీర్పుతో కేంద్రం, వివాదాస్పద గవర్నర్లంతా తమ వైఖరిని మార్చేసుకుంటారనీ అనుకోలేం. అలాగే, ఇదే సందుగా పాపులర్ జనాభిప్రాయం సాకుతో దోషుల శిక్ష తగ్గించమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తే సబబనీ చెప్పలేం. అరివును కోర్టు విడుదల చేయమన్నంత మాత్రాన రాజీవ్ హత్య కుట్రలో శిక్ష పడ్డ అతను కానీ, మిగతా దోషులు కానీ అమాయకులనీ తీర్మానించలేం. నేర తీవ్రత, నేరస్థుడి ప్రవర్తన కాక, జైలులో శిక్షాకాలమే విడుదలకు గీటురాయనీ అనలేం. ఖైదీకైనా సరే రాజ్యాంగ స్వేచ్ఛకు భంగం వాటిల్లితే కోర్టు జోక్యం చేసుకోగలదన్నదే సారాంశం. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలంటున్నది అందుకే!
అన్నిరకాలా అసాధారణమే!
Published Fri, May 20 2022 12:31 AM | Last Updated on Fri, May 20 2022 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment