rajiv gandhi assasination
-
‘రాజీవ్’ దోషుల విడుదలలో ఊహించని ట్విస్ట్
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజీవ్ హత్య కేసు దోషులను విడుదల చేయడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేంద్ర ప్రభుత్వం. దోషుల విడుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. తగిన విచారణ లేకుండా దోషుల విడుదల జరిగిందని, ఇలా చేయడం న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని పిటిషన్లో పేర్కొంది కేంద్రం. గత మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో రాజకీయ సమస్యగా మారిందని, ఇలాంటి సున్నితమైన అంశంలో కేంద్రం సలహా అవసరమని అభిప్రాయపడింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చేందిన వారు కాగా.. ఉగ్రవాదులుగా ముద్ర పడినవారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఈ కేసులో తామూ ఒక భాగమేనన్న కేంద్రం.. తమ వాదన వినకుండా విడుదల చేయడం సబబు కాదని పిటిషన్లో పేర్కొంది. కేసులో ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయకుండా దోషుల శిక్ష తగ్గింపు కోరారని వివరించింది. కావున.. విడుదల ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరింది కేంద్రం. ఇదీ చదవండి: రాజీవ్ హత్య కేసు: సుప్రీంకోర్టు తీర్పు మాకు అంగీకారం కాదు.. సోనియా కుటుంబం క్షమించినా.. -
ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?
రాజీవ్ హత్య కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సిట్ నానా తిప్పలు పడింది. 1991 జూన్ 11న మొదటి అరెస్టు జరిగింది. 1991 నవంబర్ నాటికి నిందితుల వేటను ముగించింది. దొరికిన అన్ని డాక్యుమెంట్లు, వీడియో క్యాసెట్లు, ఫోటోలు, ఫైళ్లు అన్నింటినీ పరిశీలించి LTTE చీఫ్ ప్రభాకరన్ సహా 41 మందిని నిందితులుగా చూపుతూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 1998 జనవరి 28న నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమిళులు ఉండేవారు. ఈలమ్ పేరుతో వేరే దేశాన్ని ఏర్పాటు చేయాలనేది వీరి డిమాండ్. వీరికి తమిళ రాజకీయ పార్టీలు సహా తమిళుల అండ దండలు కూడా ఉండేవి. శ్రీలంక తమిళుల్లో.. కొందరు మితవాదులు, మరికొంతమంది అతివాదులు ఉండేవారు. సింహళీయ తమిళులకు ప్రభుత్వం కొన్ని హక్కులిచ్చి, ప్రజలకు రక్షణ కల్పించాలని మిత వాదులు భావిస్తే ఈలమ్ ఏర్పడి తీరాల్సిందేనని అతివాదులు చెప్పేవారు. ఈలం కోసం హింసా మార్గాలు అనుసరించినా తప్పులేదని భావించేవారు. ఈ క్రమంలోనే.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం LTTE పురుడుపోసుకుంది. 1954లో పుట్టిన వేలుపిళ్లై ప్రభాకరన్ 1976 మే 5న LTTEని ఏర్పాటు చేశాడు. తన 21వ ఏట.. జాఫ్నా మేయర్‌ను హత్య చేసి అలజడి సృష్టించిన ప్రభాకరన్.. తమిళ ఈలం ఏర్పాటు డిమాండ్‌తో లంకలో హింసాత్మక పద్దతులకు పాల్పడ్డాడు. శ్రీలంక నాయకులు కూడా తమిళుల ఓట్ల కోసం నానా రకాల ఎత్తులు వేశారు. ఆ ఆటలో నాటి భారత ప్రభుత్వం కూడా పాలు పంచుకుందనే ఆరోపణలున్నాయి. లంక సర్కార్‌ను ఇరుకునపెట్టడానికి ఇందిరాగాంధీ హయాంలో LTTEని ప్రోత్సహించారని చెబుతారు. టైగర్లకు ఆయుధాలు, నిధులు అందించారని అంటారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు DMK, అన్నాడీఎంకే సహా తమిళ పార్టీలన్నీ ఈ వ్యవహారంలో తలో చేయి వేశాయి. లంక సర్కార్‌పై పోరు ప్రకటించిన ప్రభాకరన్ 1983-86 మధ్య తమిళనాడులో తలదాచుకున్నాడు. ఆ సమయంలో తమిళనాడు సీఎం MGR కాగా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిర మరణం తర్వాత లంక విషయంలో భారత సర్కార్ వైఖరి మారింది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ టైగర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1986 నవంబర్‌లో తమిళ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపులు జరిపి LTTE ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రభాకరన్ నిరాహార దీక్ష చేపట్టాడు. అతనికి మద్ధతుగా DMK సహా తమిళ నేతలు ఆందోళనలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం టైగర్ల ఆయుధాలను తిరిగిచ్చేసింది. ఆ పరిణామం LTTE ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీలంకతో పాటు భారత్‌లోనూ LTTE పలు హింసాత్మక చర్యలకు పాల్పడింది. LTTE దాడులను అరికట్టడానికి రాజీవ్‌గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వంతో రాజీ పడాలంటూ.. ప్రభాకరన్‌కు రాజీవ్ సూచించారు. అవసరమైతే ఈ సంధి వ్యవహారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ, శ్రీలంక ప్రధాని జయవర్దనే మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారత్ నుంచి శాంతి పరిరక్షక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ బలగాలు.. LTTE మూకలను చీల్చి చెండాడాయి. ఇది LTTEకి ఊపిరిసలపనివ్వలేదు. 1991లో భారత్‌లో మళ్లీ ఎన్నికలొచ్చే సరికి LTTE భయపడిపోయింది. రాజీవ్‌గాంధీ మళ్లీ ప్రధాని ఐతే తమ ఆటలు సాగబోవని ఆందోళన చెందింది. రాజీవ్ ఉంటే తమకు ముప్పు తప్పదని భావించిన LTTE అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. రాజీవ్‌గాంధీని చంపాలని ప్రభాకరన్ నిర్ణయం తీసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. 1991 మార్చి ఐదో తేదీన జరిగిన ఓ మీటింగ్ ప్రభాకరన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 1991 మార్చి ఐదో తేదీన LTTE కేంద్ర కమిటీ సభ్యుడు కాశీ ఆనందన్.. శ్రీలంక సమస్య గురించి రాజీవ్‌గాంధీతో రహస్యంగా చర్చలు జరిపాడు. ఐతే కాశీ వచ్చింది రాజీవ్‌ను చంపడానికి. రాజీవ్‌ను ఢిల్లీలోనే హతమార్చే ప్లాన్‌తో LTTE.. కాశీని ఢిల్లీ పంపించింది. అయితే, రాజీవ్‌తో భేటీ తర్వాత కాశీ తన నిర్ణయం మార్చుకున్నాడు. లంక తమిళుల పట్ల రాజీవ్‌కు సానుభూతి ఉందని, అతనితో సత్సంబంధాలు పెట్టుకోవడం LTTEకి మంచిదంటూ ప్రభాకరన్‌కు కాశీ లేఖ రాశాడు. ఇది ప్రభాకరన్‌కు మంట పుట్టించింది. చంపి రమ్మని పంపితే హితోక్తులు చెబుతున్నాడంటూ రగిలిపోయిన ప్రభాకరన్.. అప్పుడే రాజీవ్ హత్యకు ప్రణాళిక రచించాడు. ఎంత పకడ్బంధీగా చేసినా నేరస్థులు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు. ఆ చిన్న పొరపాటే వారిని పోలీసులకు పట్టిస్తుంది. రాజీవ్ హత్య కేసులోనూ అదే జరిగింది. అత్యంత పకడ్బంధీ ప్లాన్‌తో రాజీవ్ హత్య చేశామని చంకలు గుద్దుకున్న LTTEకి కొన్ని రోజుల్లోనే షాక్ తగిలింది. రోజుల వ్యవధిలోనే టైగర్ల కుట్ర బయటపడింది. ఓ రసీదు.. ఓ కెమెరా.. నేరస్థుల ఆనవాళ్లను పట్టించాయి. ఆ దర్యాప్తు క్రమంలోనే రాజీవ్ హత్యకు LTTE ఎలా ప్లాన్ వేసిందో బయటపడింది. రాజీవ్‌ను హత్య చేసే పనిని ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పొట్టు అమ్మన్‌కు అప్పగించింది. అసలు పేరు షణ్ముగలింగం శివశంకర్. 1962లో పుట్టిన అమ్మన్ 1981లో LTTEలో చేరాడు. స్వల్ప కాలంలోనే LTTEలో కీలక నేతగా ఎదిగిన అమ్మన్‌కు ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో బాగా తెలుసంటారు. దాంతో.. ప్రభాకరన్‌కు అమ్మన్పై నమ్మకం ఎక్కువ. అందుకే రాజీవ్‌ను హతమార్చే పనిని అమ్మన్‌కు అప్పగించాడు. ఈ క్రమంలో రాజీవ్‌ను హత్య చేసే పథకం ఊపిరి పోసుకుంది. ప్రభాకరన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పొట్టు అమ్మన్.. 1991 ఏప్రిల్ 28న జాఫ్నాలోని మధకల్లో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే రాజీవ్ హత్యకు దాదాపు మూడు వారాల ముందు ఈ మీటింగ్ జరిగింది. శివరాజన్, ధాను, శుభ, రూసో, కీర్తి, శివరూపన్, విజయానందన్, నెహ్రూ, సుధేంద్రరాజా, అఖిల తదితరులు ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాజీవ్‌ను చంపకపోతే లంకలో తమిళులు శాంతంగా ఉండలేరని, రాజీవ్ బతికి ఉంటే తమకు ముప్పు తప్పదంటూ శివరాజన్, ధాను తదితరులకు నూరి పోశాడు. అలా రాజీవ్ హత్యకు హంతకముఠాను ప్రిపేర్ చేశాడు. శివరాజన్.. రాజీవ్ హంతక ముఠాకు లీడర్ ఇతనే. ఇతని అసలు పేరు భాగ్యచంద్రన్. రాజన్, దురై, అరవింద్, శివరాజ్ ఇలా చాలా మారు పేర్లే ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన శివరాజన్.. 1983లో అతివాద సంస్థలతో పరిచయం పెంచుకొని పేలుడు పదార్థాల తయారీలో గట్టి శిక్షణ తీసుకున్నాడు. 1984లో LTTEలో చేరాడు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణదళానికి సహకరిస్తున్న EPRLF నేత పద్మనాభన్‌ను హత్యచేసింది ఇతనే. దాంతో పొట్టుఅమ్మన్కు శివరాజన్పై గట్టి నమ్మకం ఏర్పడింది. పద్మనాభన్‌ను చంపిన ఏడాదికే.. రాజీవ్‌ను హతమార్చే బాధ్యతను శివరాజన్పై పెట్టాడు. ఆ బాధ్యతను తీసుకున్న శివరాజన్ ముందుగా తన జట్టును తయారు చేసుకున్నాడు. పద్మనాభన్ హత్యలో సహకరించిన సుధేంద్ర రాజాను తీసుకున్నాడు. ఇతనికి రాజా, శాంతన్ అనే మారు పేర్లు ఉన్నాయి. అతనితో పాటు శుభ అనే అమ్మాయి వచ్చింది. ఈమె LTTE షాడో బృందం సభ్యురాలు. ఇక మానవబాంబుగా ధాను ఎంపికైంది. 22 ఏళ్ల ధాను అసలు పేరు కళైవాణి. ముద్దు పేరు అన్బు. బట్టికలోవాలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె తండ్రి సూచనలతో LTTEలోని మహిళా విభాగం కరుంపులిలో చేరింది. ఇక రూసో, విజయానందన్లు హంతకముఠాతో చేయి కలిపారు. వీరితో పాటు మరో ముఖ్య వ్యక్తి శివ రూపన్. ఇతను పొట్టు అమ్మన్‌కు నమ్మకస్తుడైన వ్యక్తిగత వైర్లెస్ ఆపరేటర్. LTTEలో రహస్యాలు తెలిసిన అతి కీలక వ్యక్తుల్లో శివరూపన్ కూడా ఒకడు. ఇక ముఠాలో మరో ఇద్దరు సభ్యులు నెహ్రూ, తంబి అన్న. ఇలా హతమార్చడానికి శివరాజన్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ముఠా తయారైంది. శివరాసన్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలని ధాను, తదితరులకు పొట్టు అమ్మన్ స్పష్టంగా చెప్పాడు. దీంతో శివరాసన్ సూచనల ప్రకారం ఏప్రిల్ 30న హంతక ముఠా శ్రీలంకలోని మధకల్ నుంచి నాటు పడవలో బయల్దేరి మే ఒకటో తేదీన తమిళనాడులోని వేదారణ్యం దగ్గర కొడికరల్ తీరానికి చేరారు. స్మగ్లర్ షణ్ముగం వారిని సురక్షిత స్థావరాలకు తరలించాడు. LTTE రాజకీయ విభాగంలో పని చేస్తూ మద్రాస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాంతన్, డిక్సన్‌లు కూడా వారితో చేరిపోయారు. హంతకముఠా వేదారణ్యంలో అడుగుపెట్టేనాటికి LTTE మద్రాస్‌లో పూర్తి స్కెచ్‌తో రెడీ ఐంది. చెన్నైలో LTTE కార్యకలాపాలకు కేంద్రమైన శుభా న్యూస్ అండ్ ఫోటో ఏజెన్సీస్ యజమాని శుభా సుందరం అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. LTTE సిద్ధాంతవేత్తల్లో ముఖ్యుడైన బేబీ సుబ్రమణీయం అలియాస్ బాల సుబ్రమణ్యంతో పాటు శివరాజన్ సహాయకుడు మురుగన్‌లు కలిసి.. కుట్రదారులను తయారు చేశారు. ముత్తు రాజన్ తదితరులు వారికి సహరించారు. శుభా సుందరం, సుబ్రమణ్యం, మురుగన్‌లు కలిసి ఫోటో గ్రాఫర్ హరిబాబు, అరివు పెరారీ వాలన్, నళిని, ఆమె తమ్ముడు భాగ్యనాధన్లను తమ కుట్రలో పావులుగా చేసుకున్నారు. ధాను మానవబాంబు.. ఆమెకు స్టాండ్ బైగా మరో మానవబాంబు శుభ. ఐతే నళినితో ప్రేమలో పడిన మురుగన్.. ఆమెను కూడా మానవబాంబుగా మార్చాలని ప్రయత్నించాడు. అందుకు రంగం కూడా సిద్ధం చేశాడు. ఐతే స్టాండ్ బై మానవ బాంబుగా శుభ రావడంతో ప్లాన్ మార్చేశాడు. ఇక పెరారీ వాలన్ బెల్టు బాంబును తయారు చేశాడు. అలా రాజీవ్ హత్యకు రంగం సిద్ధమైంది. రాజీవ్‌ను హతమార్చాలని కంకణం కట్టుకున్న LTTE.. అందుకు రిహార్సల్స్ చేసుకుంది. ఏప్రిల్ 21న రాజీవ్‌గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో రిహార్సల్స్ జరిపి చూసుకున్నారు. ఆ తర్వాత మే 7న వీపీ సింగ్ సభలోనూ రిహార్సల్స్ చేసుకున్నారు. ఓ వీఐపీ వద్దకు వెళ్లి మానవబాంబు ప్రయోగించగలమో లేదో చెక్ చేసుకున్నారు. మే 7 నుంచి 20 వరకు హత్యకు సంబంధించి వివిధ రకాల పనులు పూర్తి చేసుకున్నారు. ఇక అనుకున్న రోజు రానే వచ్చింది. మే 20 తేదీ రాత్రి కుట్రదారులు ఎంజాయ్ చేశారు. 1991 మే 21.. జయకుమార్ ఇంట్లో శివరాజన్ రెడీ అయ్యాడు. మానవబాంబు ధాను, శుభాలతో కలసి నళిని ఇంటికి వెళ్లాడు. ఫోటోగ్రాఫర్ హరిబాబు పారిస్ కార్నర్‌కు వెళ్లి పూంపుహార్ అనే షో రూమ్‌లో ఒక చందనమాల కొన్నాడు. ధాను, శుభ, నళిని, హరిబాబు, మురుగన్‌లను తీసుకొని శివరాజన్ శ్రీ పెరంబుదూర్ బయల్దేరాడు. 21 సాయంత్రం ఏడున్నర గంటలకు.. హంతకముఠా శ్రీ పెరంబుదూర్ చేరింది. మే 20న ఒడిశాలో ప్రచారం చేసిన రాజీవ్ 21న ఉదయం ఒడిశాలోని భద్రక్, అంగుల్, పర్లాఖిమిడి, గుణపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించాడు. ధాను ధరించిన బెల్ట్బాంబుకు 2 స్విచ్‌లున్నాయి. ఒకటి సేఫ్టీ స్విచ్ కాగా మరొకటి బాంబ్‌ను పేల్చే స్విచ్. రాజీవ్‌కు పాదాభివందనం చేసే నెపంతో కిందికి వంగిన ధాను.. మొదట సేఫ్టీ స్విచ్ నొక్కి శివ రాజన్‌కు సైగ చేసింది. శివరాజన్ తప్పుకోగానే మరో మాట లేకుండా రెండో స్విచ్ నొక్కేసింది. అంతే 10.25 ప్రాంతంలో అక్కడ మారణహోమం జరిగిపోయింది. కన్నుమూసి కన్ను తెరిచేంతలో కనివినీ ఎరుగని దారుణ హత్య జరిగిపోయింది. హంతకముఠాకు లీడర్‌గా వ్యవహరించిన శివరాజన్ సూసైడ్ చేసుకున్నాడు. అతనికి సహకరించిన స్మగ్లర్ షణ్ముగం.. సిట్ విచారణ జరుగుతుండగానే విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడు. మిగత వాళ్లు పోలీసులకు దొరికిపోయారు. -
అన్నిరకాలా అసాధారణమే!
పరిస్థితులు అసాధారణమైతే, నిర్ణయాలూ అసాధారణంగానే ఉంటాయి. రాజ్యాంగంతో సంక్రమిం చిన అసాధారణ అధికారాలను సుప్రీమ్ కోర్టు బుధవారం వినియోగించుకున్న వైనం అలాంటిదే. ఆ అధికారాల కిందే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల్లో ఒకరైన పేరరివాళన్‌ను తక్షణం విడుదల చేస్తూ సుప్రీమ్ ఉత్తర్వులిచ్చింది.19 ఏళ్ళ వయసులో అరెస్టయి, 31 ఏళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినా సరే క్షమాభిక్షపై గవర్నర్ నిర్ణయం రాక, ఒక జీవితకాల నిరీక్షణలో ఉన్న వ్యక్తికి న్యాయం కోసం చివరకు కోర్టు కదలాల్సి వచ్చింది. సదరు వ్యక్తి తాలూకు ‘శిక్ష పూర్తయినట్టు భావించా’లంటూ పేర్కొనాల్సి వచ్చింది. కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య అధికార పంపిణీ – కరవైన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి లాంటి చర్చలు దేశంలో ఎక్కువైన వేళ... మంత్రిమండలి సలహా మేరకు అధికారాలను వినియోగించడమే రాష్ట్రపతి, గవర్నర్ల రాజ్యాంగ విహిత బాధ్యత అని కోర్టు చెప్పకనే చెప్పింది. నేరస్థుడికి క్షమాభిక్ష, ముందస్తు విడుదల లాంటివి రాష్ట్ర జాబితాలోవి గనక ప్రజా ప్రభుత్వాల అభీష్టమే ఆ అంశాల్లో సర్వోన్నతమని తేల్చింది. రిటైర్డ్ తమిళ ఉపాధ్యాయుడి కుమారుడైన 50 ఏళ్ళ పేరరివాళన్ అలియాస్ అరివు పక్షాన అతని తల్లి, పలువురు వకీళ్ళు, స్నేహితులు జరిపిన న్యాయపోరాటం చివరకు ఇలా పరిణమించింది. రాజీవ్‌ను చంపిన మానవబాంబు పెట్టుకున్న బాంబుల బెల్టుకు కావాల్సిన బ్యాటరీలు సమకూర్చి నట్టు అతనిపై ఆరోపణ. దోషిగా తేలిన ఆ కేసులో అతని పాత్ర ఎంత, అతని అమాయకత్వమెంత అనేది వేరే పెద్ద చర్చ. శిక్షాకాలంలో దాదాపు 11 ఏళ్ళు చిన్న 6 బై 9 అడుగుల జైలు గదిలో అతను ఏకాంతవాస శిక్ష అనుభవించారు. తీయని ఉరి కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించారు. క్షమాభిక్ష అభ్య ర్థనపై సుదీర్ఘ జాప్యంతో 2014లో పేరరివాళన్ సహా ముగ్గురు దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది సుప్రీమ్ కోర్టు. 2015లో గవర్నర్‌ను క్షమాభిక్ష కోరుతూ, అరివు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు 2018లో గవర్నర్‌ను కోరింది. గవర్నర్ దాన్ని పట్టించుకోకపోవడంతో, అప్పటి తమిళనాడు క్యాబినెట్ అతణ్ణి విడుదల చేయాలని సిఫార్సు చేసింది. ఆ తర్వాత 2020లో సుప్రీమ్ మరో మాట చెప్పింది. అరివుపై విచారణ సాగుతున్నా, ఉపశమనం ఇచ్చేందుకు గవర్నర్‌కు అధికారం ఉందంది. చివరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం అతని క్షమాభిక్ష అంశం రాజ్‌భవన్ విచక్షణకే వదిలేసింది. అయినా సరే గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా బంతి కేంద్రం కోర్టులో వేసి, అంతా రాష్ట్రపతి ఇష్టమేనంటూ చేతులు దులుపుకొన్నారు. చివరకిప్పుడు రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకున్న అసాధారణ అధికారాన్ని సుప్రీమ్ వినియోగించాల్సి వచ్చింది. అరివు విడుదలకు ఆదేశించాల్సి వచ్చింది. సుప్రీమ్ తాజా ఆదేశం వివాదాలూ రేపుతోంది. రాజీవ్ హత్య కేసులోని దోషులను క్షమిస్తున్నా మనీ, వారిని విడిచిపెడితే అభ్యంతరం లేదనీ ప్రియాంక సహా రాజీవ్ కుటుంబసభ్యులే గతంలో చెప్పారు. కానీ, తీరా ఇప్పుడు దోషుల్లో ఒకరైన అరివు విడుదలకు అధికార బీజేపీ వైఖరే కారణ మంటూ కాంగ్రెస్ తప్పుబట్టింది. మిగతా ఆరుగురు దోషులను కూడా విడిచిపెట్టేస్తారా అని ప్రశ్నిస్తోంది. ఇక, రాష్ట్ర గవర్నర్ పేరబెట్టిన క్షమాభిక్షను కోర్టు పరిష్కరించడంతో, రాజ్ భవన్‌పై బాణాలు వేసేందుకు తమిళనాడు సర్కారుకు సరికొత్త అస్త్రం దొరికినట్టయింది. ఒక్క అరివు క్షమా భిక్షే కాదు... ఏడాది క్రితం గద్దెనెక్కినప్పటి నుంచి ‘నీట్’ రద్దు సహా అనేక అంశాలపై స్టాలిన్ సర్కారు చేసిన పలు సిఫార్సుల గతీ ఇదే! రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు వ్యవహరించాల్సిన గవర్నర్లు తద్విరుద్ధంగా, ప్రభుత్వ సిఫార్సులపై సాచివేత ధోరణిని అవలంబిస్తున్న తీరు ఇలా మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్రం చేతిలోని గవర్నర్ల వ్యవస్థపై వస్తున్న విమర్శలకు కొత్త బలం చేకూరింది. సుప్రీమ్ తన తాజా ఉత్తర్వులో 1980 నాటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రస్తావించింది. రాష్ట్రపతి ఓ ప్రతీక. కేంద్రప్రభుత్వమే వాస్తవం. గవర్నర్ పేరుకే పెద్ద, కార్యనిర్వాహక అధికారాలకు కేంద్రం. మంత్రిమండలి సలహా మేరకే ఆ అధికారాలను వాడవచ్చన్న మాటలను ఉటంకించింది. అధికారాల విషయంలో కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య ‘లక్ష్మణరేఖ’ ఉందంటూనే, భారత శిక్షాస్మృతి కింద విచారణ చేసినప్పుడు రాష్ట్రాన్ని తోసిపుచ్చే పై చేయి కేంద్రానికి లేదంది. ఎన్ఐఏ, ‘ఉపా’ లాంటి చట్టాల కింద కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసినప్పుడు తప్ప, ఏ ఇతర చట్టాల కిందా కేంద్రానిది పై మాట కాదనీ గుర్తు చేసింది. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకొనే అధికారం గవర్నర్లకు లేదనీ, సుప్రీమ్ తాజా ఆదేశాలు ‘రాష్ట్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి’కి విజయసూచిక అనీ స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇల్లలకగానే పండగ కాదు. ఈ ఒక్క తీర్పుతో కేంద్రం, వివాదాస్పద గవర్నర్లంతా తమ వైఖరిని మార్చేసుకుంటారనీ అనుకోలేం. అలాగే, ఇదే సందుగా పాపులర్ జనాభిప్రాయం సాకుతో దోషుల శిక్ష తగ్గించమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తే సబబనీ చెప్పలేం. అరివును కోర్టు విడుదల చేయమన్నంత మాత్రాన రాజీవ్ హత్య కుట్రలో శిక్ష పడ్డ అతను కానీ, మిగతా దోషులు కానీ అమాయకులనీ తీర్మానించలేం. నేర తీవ్రత, నేరస్థుడి ప్రవర్తన కాక, జైలులో శిక్షాకాలమే విడుదలకు గీటురాయనీ అనలేం. ఖైదీకైనా సరే రాజ్యాంగ స్వేచ్ఛకు భంగం వాటిల్లితే కోర్టు జోక్యం చేసుకోగలదన్నదే సారాంశం. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలంటున్నది అందుకే! -
రాజీవ్ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, తమిళనాడు : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె ఈ చర్యకు పాల్పడటానికి కారణం తెలియరాలేదు. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలైన తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్ నారాయణన్ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. -
‘అమాయకులం.. ఇక శాశ్వత సెలవు తీసుకుంటా’
సాక్షి, చెన్నై : తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితులు నళిని, ఆమె భర్త మురుగన్ జైలులోనే నిరాహార దీక్ష చేయడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గత 12 రోజులుగా దీక్ష చేస్తుండగా, గత శనివారం నళిని ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. తమతో పాటు ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేసేంత వరకు దీక్ష విరమించబోమని పేర్కొన్నారు. నళిని తరఫు న్యాయవాది ద్వారా ఈ విషయం బయటికి పొక్కడంతో తమిళ సంఘాలు, పార్టీల్లో కలకలం రేగుతోంది. మురుగన్ ఆరోగ్య పరిస్థితి విషమించడం, నళిని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో తమిళవాదుల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే నేపథ్యంలో ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలపై దృష్టి సారించింది. ఇక ఈ విషయమై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌కు లేఖ తమని విడుదల చేయాలి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ నళిని పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు నళిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ‘ న్యాయం కోసం అర్థిస్తున్న మాకు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. 28 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం. మేము అమాయకులం. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ కేసులో ఇరుక్కున్నాం. ఇక ఇప్పుడు నేను ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 9 నుంచి నిరాహార దీక్ష చేపడతున్నాను. ఇలానైనా నాకు విముక్తి లభిస్తుంది’ అని నళిని లేఖలో పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టడం సబబు కాదు. కానీ నళిని విషయంలో ఇది సమర్థనీయం. రాజీవ్ హత్య కేసులో వారిని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్ చేస్తున్న జాప్యానికి వ్యతిరేకంగానే ఆమె దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆయన ఇందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ వీరిని గనుక విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. రాజీవ్ హత్యకేసు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు. మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. జయకుమార్, రాబర్ట్ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది. -
‘నా తండ్రి హంతకులను క్షమిస్తున్నా’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిని పూర్తిగా క్షమించేస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ఇందిర, రాజీవ్ హత్య ఉదంతాలపై స్పందించారు. ‘నా తండ్రి హత్య తర్వాత మా కుటుంబం ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. ఏది ఏమైనా నేనూ, నా సోదరి(ప్రియాంక వాద్రా) హంతకులను క్షమించేస్తున్నాం’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఇందిర, రాజీవ్ హత్యలపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో దుష్ట శక్తులతో పోరాడే సమయంలో.. మీరు ఓ వైపు నిలిచినప్పుడు ఖచ్ఛితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మా నాన్నమ్మ, తండ్రి ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్లు చనిపోతారని మా కుటుంబం ముందే ఊహించింది. తాను చనిపోతానని నాన్నమ్మ(ఇందిర) నాతో తరచూ అనేవారు. ఆమె చెప్పినట్లే ఆమెను హతమార్చారు. అది చూశాక మీరు కూడా చనిపోతారని నా తండ్రి(రాజీవ్)తో నేను అన్నాను. ఊహించినట్లే జరిగింది. విధి బలీయమైంది’ అని రాహుల్ ఉద్వేగంగా ప్రసంగించారు. కాగా, గతంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేసేందుకు ప్రతిపాదన చేశారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో ఈ వ్యవహారంపై స్పందించేందుకు రాహుల్ విముఖత వ్యక్తం చేశారు. -
కన్నీరుమున్నీరైన సోనియా గాంధీ..
ముంబై : తన భర్త రాజీవ్‌ను రాజకీయాల్లోకి రావద్దని కోరింది నిజమేనని సోనియా గాంధీ చెప్పారు. ఇందిర లాగే రాజీవ్ కూడా హత్యకుగురవుతారనే ఆందోళన ఎప్పటి నుంచో ఉండేదని, భపపడ్డట్లే విషాదాన్ని చూడాల్సివచ్చిందన్నారు. శుక్రవారం ‘ఇండియా టుడే ముంబై కంక్లేవ్’లో మాట్లాడిన ఆమె.. గతాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఇండియా టుడే’ ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరీ.. సోనియాను ఇంటర్వ్యూ చేశారు. ‘‘రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాసేవ తప్ప మిగతావన్నీ రెండో ప్రాధాన్యాలే అవుతాయి. రాజీవ్ కూడా కుటుంబానికి దూరమవుతారని ఆందోళన చెందా. కానీ అత్త(ఇందిరా గాంధీ) హత్యతర్వాత ఆయన రాజకీయాల్లోకి రాకతప్పలేదు. బహుశా రాజీవ్‌ను (రాజకీయాల్లోకి) వద్దనడం నా స్వార్థమే కావచ్చు, అయితే, ఆయన్ను చంపేస్తారేమోనని భయంకూడా మాలో ఉండేది. నా చుట్టుపక్కల అలా మాట్లాడుకోవడం చాలాసార్లు నా చెవినడేవి. చివరికి దేనిగురించైతే భయపడ్డామో అదే జరిగింది’’ అంటూ ఉబికివచ్చిన కన్నీళ్లను తుడుచుకున్నారు సోనియా గాధీ. ఇందిరా గాంధీ హత్య(1984) జరిగిన ఏడేళ్లకే రాజీవ్ గాంధీ (1991లో) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను ఎల్టీటీఈ తీవ్రవాదులు బెల్టుబాంబులతో చంపేసిన ఉదంతం విదితమే. రాజీవ్ హత్యానంతరం ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సోనియా గాంధీ.. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. గతేడాదే పార్టీ అత్యున్నత పదవి నుంచి తప్పుకున్న ఆమె.. కుమారుడు రాహుల్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. -
నళిని నిరాహార దీక్ష!
దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ను చూసేందుకు కోర్టు అనుమతించక పోవడంతో మహిళా జైలులో నళిని ఆహారం తినకుండా నిరాహారదీక్షకు దిగింది. మురుగన్ పురుషుల జైలులో, భార్య నళిని మహిళా జైలులో శిక్ష అనుభవిస్తు న్న విషయం తెల్సిందే. వీరు ప్రతి 15 రోజు లకు ఒకసారి మాట్లాడేందుకు గతంలో కోర్టు అనుమతించింది. అయితే కొద్ది రోజుల క్రితం మురుగన్ నుంచి సెల్‌ఫోన్, నగదును పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యం లో ఈ నెల 12న నళిని, మురుగన్‌లు కలుసుకోవాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతించలేదు. నిబంధనలకు విరుద్దంగా మురుగన్ జైలులో నగదు పెట్టుకున్నాడన్న నెపంతో రెండు నెలలు నళిని చూడకుండా నిషేధం విధించారు. విషయం తెలుసుకున్న నళిని జైలులో మౌన పోరాటం చేసోంది. మహిళా జైలులోని అధికారులు చర్చలు జరిపారు. ఆ సమయంలో తనకు ఆహారం వద్దని భర్తను చూడకుండా ఉండలేక పోతున్నానని నళిని కన్నీరు పెట్టుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. గురువారం పూర్తిగా ఆహారం తీసుకోలేదు. చర్చల అనంతరం శుక్రవారం ఉద యం ఆమె ఆహారం తీసుకున్నట్లు తెలిపారు. -
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష వద్దు: కేంద్రం
దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష ఇవ్వద్దని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. హంతకులు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లో కనీస పశ్చాత్తాపం కూడా కనపడలేదని కోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల వారికి క్షమాభిక్ష పెట్టొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. వారి మరణ శిక్ష కేసుపై తన తీర్పును కోర్టు వాయిదా వేసింది.